టాటూ స్టార్ | Art Students change as Tattoo Artist | Sakshi
Sakshi News home page

టాటూ స్టార్

Published Mon, Nov 17 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

టాటూ స్టార్

టాటూ స్టార్

ఆర్ట్ స్టూడెంట్ కాస్తా టాటూ ఆర్టిస్ట్‌గా మారాడు. కేన్వాస్‌పై రంగులద్దాల్సిన వ్యక్తి సెలబ్రిటీల తనువులనే కేన్వాస్‌గా మలచుకుని, పచ్చబొట్లతో చిత్తరువులు దిద్దుతున్నాడు. ఇరవయ్యేళ్ల వయసులోనే సీనియర్ టాటూ ఆర్టిస్ట్ వద్ద అనుకోకుండా అసిస్టెంట్‌గా చేరి, అంచెలంచెలుగా ఎదిగిన అతడి వద్ద టాటూల కోసం ఇప్పుడు సెలబ్రిటీలే క్యూ కడుతున్నారు. సమీర్ పతంగే.. బాలీవుడ్ సెలబ్రిటీలందరికీ హాట్ ఫేవరెట్ టాటూ ఆర్టిస్ట్. ‘టాటూ ఫెస్టివల్’ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సిటీప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నారు.
 
ముంబైలో పుట్టి పెరిగాను. అక్కడే నా కెరీర్ మొదలైంది. ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. నా కాళ్లకు చక్రాలు ఉన్నాయంటారు నా మిత్రులంతా. నేను ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒక మిత్రుడు చేతిపై టాటూ వేయించుకోవడానికి నన్ను తోడుగా తీసుకువెళ్లాడు. నా మిత్రుడు ఏ డిజైన్ వేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉండగా, నేను ఒక స్టెన్సిల్ పేపర్‌పై డిజైన్ గీసి ఇచ్చాను. ఆ డిజైన్ చూసిన టాటూ ఆర్టిస్ట్ తన దగ్గర పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ చేశారు.

అప్పటికి ఇంకా స్టూడెంట్‌నే కాబట్టి, ప్యాకెట్ మనీకి పనికొస్తుందని, వీకెండ్స్‌లో చేస్తానంటూ జాయిన్ అయ్యాను. అప్పటికే ఆయన వయసు మళ్లడంతో కొన్నాళ్లకు రిటైర్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన స్థానంలో నేను పూర్తిస్థాయి టాటూ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను. త్వరలోనే సొంతంగా టాటూ స్టూడియో ప్రారంభించాను. నా డిజైన్లకు కస్టమర్ల నుంచి బాగా ఆదరణ లభించింది. వారి ద్వారా క్రమంగా నా పేరు సెలబ్రిటీల వరకు వ్యాపించింది.

బాలీవుడ్ ఇన్నింగ్స్..
టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే మొదట్లో మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అప్పటికే అన్నయ్య ఆర్మీలో చేరడంతో నన్ను కూడా ఆర్మీలో చేరాలంటూ పోరు పెట్టారు. అయితే, నేను వాళ్లను కన్విన్స్ చేశాను. ఇప్పుడు వాళ్లు నా సక్సెస్‌ని చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటిసారిగా సునీల్‌శెట్టి సినిమా ‘లకీర్’ కోసం జాన్ అబ్రహాంకి టాటూ వేశాను. బాలీవుడ్‌లో నా కెరీర్ అలా మొదలైంది. ఆ తర్వాత ఒకరోజు సల్మాన్‌ఖాన్ స్వయంగా నా స్టూడియోకి వచ్చి మరీ టాటూ వేయించుకున్నారు. హృతిక్ రోషన్, సుసానే, శ్రుతి హాసన్, సుస్మితా సేన్, సంజయ్ దత్.. ఇలా చాలామంది సెలబ్రిటీలకు టాటూలు వేశాను.

సినిమాల కోసం టెంపరరీ టాటూలు కూడా వేస్తుంటాను. ఫ్లోరల్ డిజైన్లు, బటర్‌ఫ్లై డిజైన్లు వంటివి అమ్మాయిలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అబ్బాయిలైతే హెవీ డిజైన్లు కోరుకుంటుంటారు. కొందరు పేర్లు టాటూలుగా వేయించుకుని, తర్వాత ఏవో కారణాలతో వాటిపై కవరప్ టాటూల కోసం వస్తుంటారు. ఇలాంటి టాటూలే కాకుండా, ఫొటోల ఆధారంగా వ్యక్తుల ముఖాలనూ టాటూలుగా వేస్తుంటాను.

వండర్‌ఫుల్ సిటీ..
హైదరాబాద్ నిజంగా వండర్‌ఫుల్ సిటీ. ఇక్కడకు ఏడాదికి మూడు నాలుగు సార్లయినా వస్తుంటాను. ఇక్కడ గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్ వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి రుచులంటే నాకు భలే ఇష్టం. ‘సర్వీ’లోని దమ్ కీ బిర్యానీ, మాసబ్‌ట్యాంక్‌లోని ‘డైన్‌హిల్’ రెస్టారెంట్‌లో గ్రిల్డ్ చికెన్ చాలా ఇష్టంగా తింటాను. వేకువజామున మూడు గంటలకే లేచి, మాదాపూర్‌లోని రామ్ కీ బండిలో చీజ్‌బట్టర్ దోసె తింటుంటాను. అదో డిఫరెంట్ ఫీల్. ఇక్కడి ప్రజలు చాలా కూల్. ప్లెజంట్‌గా మాట్లాడతారు. చక్కగా బిహేవ్ చేస్తారు. ఎన్నో దేశాలు తిరిగినా, నాకు హైదరాబాద్ అంటే ప్రత్యేకమైన ఇష్టం.

..:: శిరీష చల్లపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement