Tattoo Artist
-
వోగ్ కవర్ పేజీపై అత్యంత వృద్ధ స్టార్.. అలాంటి టాటూలు ఈమె మాత్రమే వేయగలదు
మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం. ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్లో శిక్షణ ఇస్తోంది. ‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది. -
చెరిగిపోని పచ్చబొట్టు సంతకం
‘ఒక మహిళ చిత్రకారిణిగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.కాని టాటూ ఆర్టిస్ట్‌గా ఉంటానంటేఆశ్చర్యంగా చూస్తారు’ అంటుంది అర్చన భానుషాలి.దేశంలో ఉత్తమ మహిళా టాటూ ఆర్టిస్ట్‌గా గుర్తింపు ΄పొం దిన అర్చనమగవాళ్లు రాజ్యమేలే ఈ రంగంలో తన ఉనికిని సగర్వంగా చాటుతోంది. ఈ రంగంలో మగవారు విపరీతంగా ఉన్నారు. ఆడవాళ్ల ప్రవేశం అంత సులభం కాదు. కాని నేను పంతంతో ఈ స్థాయికి వచ్చాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీకు లక్ష్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ కష్టం చాలా చేయాలి. ఇవాళ నేను ఈ రంగంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా మంచి రాబడి ΄పొం దుతున్నాను. – అర్చన శివరాత్రి సందర్భంగా ‘శివ్ అండ్ శక్తి కాస్మిక్ డాన్స్’ అనే సబ్జెక్ట్‌ను పచ్చబొట్టుగా వేసింది అర్చన భానుషాలి. శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తున్న ఆ పచ్చబొట్టులో జీవం ఉట్టి పడుతోంది. అర్ధనారీశ్వరుడి చిత్రం కూడా పచ్చబొట్టుగా వేస్తుందామె. ఇవే కాదు ఆమె బొమ్మల్లో మన సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలు కనపడతాయి. శివాజీ వంటి వీరులూ, అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారులు కూడా కనపడతారు. పచ్చబొట్టును ఒక విశృంఖల చిహ్నంగా కాకుండా వ్యక్తిత్వ ప్రకటనగా మార్చడం వల్లే అర్చనకు మంచి పేరొచ్చింది. అందుకే ఆమె ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా టాటూ ఆర్టిస్ట్‌లలో బెస్ట్ ఆర్టిస్ట్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా గౌరవం ΄పొందుతోంది. కమర్షియల్ ఆర్టిస్ట్‌గా అర్చన కుటుంబానిది గుజరాత్ అయినా ముంబైలో స్థిరపడింది. అర్చన ఏడేళ్ల వయసు నుంచే వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ బొమ్మలు వేసేది. దాంతో ఇంట్లోప్రో త్సహించారు. అయితే ఇంటర్ వయసు వచ్చే సరికి గుజరాతీలలో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపాలనే తొందర ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని వెంటపడితే అప్పుడే వద్దని చెప్పి ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో మూడేళ్ల డిప్లమా చేసింది కమర్షియల్ ఆర్ట్‌లో. ఆ తర్వాత లండన్ వెళ్లి ఒక సంవత్సరం కోర్సు చదవాలని అనుకుంది. ఆ కోర్సుకు అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా టీవీలో ఒక షో చూసింది. అందులో ప్రఖ్యాత అమెరికన్ టాటూ చిత్రకారిణి కేట్ వాన్ డి తన క్లయింట్లకు అద్భుతంగా టాటూలు వేయడం చూపించారు. ‘నేను పేపర్ మీద వేసేది ఈమె ఒంటి మీద వేస్తోంది. నేనెందుకు ఇలా వేయకూడదు’ అనుకుంది అర్చన. ఆమె యాత్ర మొదలైంది. ‘మా అమ్మానాన్నలు నేను టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే కంగారు పడినా ఆ తర్వాతప్రో త్సహించారు. దాని వల్ల టాటూ వేయడంలో కోర్సు చేశాను. నాకు బొమ్మలు వచ్చు కనుక చాలా త్వరగా పని నేర్చుకున్నాను. మేము గుజరాతీలం. ఒకరి కింద పని చేయడం కంటే సొంత బిజినెస్ ఉండటాన్నే ఇష్టపడతాం. అందుకే ‘ఏస్ టాటూజ్’ పేరుతో ముంబైలో మా నాన్న నా కోసం టాటూ స్టూడియో ఏర్పాటు చేశాడు’ అంటుంది అర్చన. అయితే అసలుప్రో త్సాహం భర్త నిఖిల్ నుంచి, అత్తా మామల నుంచి లభించింది. ‘మా అత్తగారు నన్ను బాగాప్రో త్సహిస్తారు. పెళ్లయ్యాక నా మొదటి పచ్చబొట్టును ఆమెకే వేశాను’ అంది అర్చన. -
టాటూ ట్రెండ్: ఒళ్లంతా పచ్చబొట్లే.. ఏమంటే ఇదో ఫ్యాషన్
సాక్షి, జగిత్యాల: ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌గా మారింది. నాడు పచ్చబొట్టు నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. టాటూ అంటే యంగస్టర్స్లో విపరీతమైన క్రేజ్. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరమంతా టాటూస్ డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫొటోస్ టాటూగా వేయించుకుంటున్నారు. ఇన్నర్ ఫీలింగ్స్, ఆలోచన విధానాన్ని బట్టి టాటూస్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొందరు స్టైల్ కోసం టాటూ వేయించుకుంటుండగా మరికొందరు తమకు నచ్చిన వ్యక్తులు, నాయకుల ఫొటోలతో పాటు దేవతల ఫొటోలు టాటూగా వేయించుకుంటున్నారు. ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా రకరకాల టాటూ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. సింపుల్ టాటూ నుంచి రకరకాల బొమ్మల టాటూలు వేయించుకుంటున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ డిఫరెంట్ వెరైటీస్‌లో టాటూస్ వస్తుండటంతో టాటూ లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం గ్రీన్ కలర్ టాటూస్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌లో టాటూస్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకుంటూ మురిసిపోతున్నారు యూత్. యూత్ ఫ్యాషన్‌గా టాటూ.. ప్రస్తుతం యూత్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్న టాటూ యంగ్‌స్టర్స్‌కు ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, ఆరాధించే దేవతల ఫొటోలు టాటూగా వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. తమ ఫీలింగ్స్‌ను ఎదుటి వ్యక్తులకు తెలిపేందుకు టాటూ వేయించుకుంటున్నారు. డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్.. గతంలో కేవలం గ్రీన్ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్ కాంబినేషన్స్‌లో టాటూస్ వేస్తున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ టాటూస్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. సింపుల్ టాటూ నుంచి మల్టీకలర్‌తో డిఫరెంట్ డిజైన్స్‌లో లైఫ్‌లాంగ్ గుర్తుండేలా టాటూ వేయించుకోవడం ప్రెజెంట్ డేస్‌లో క్రేజ్‌గా మారింది. అభిమానంతోనే.. ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అంటే నాకు కొండంత అభిమానం. అందుకే ఆయన ఫొటో నా గుండెల మీద టాటూగా వేయించుకున్నాను. ఎప్పటికీ ఆయన అడుగు జాడల్లో నడవడమే నా లక్ష్యం. అందుకే టాటూ వేయించుకుని నా అభిమానాన్ని చాటాను. – రఘువీర్‌గౌడ్ ముంజాల ఫ్యాషన్‌గా ఉండటం ఇష్టం స్టైలిష్‌గా ఉండటమంటే నాకిష్టం. అందుకు తగ్గట్టుగానే ఫ్యాషన్ బిజినెస్‌ను ఎంచుకున్నాను. నా వ్యాపారానికి ఫ్యాషన్‌గా ఉండటం అవసరం. ప్రస్తుత ట్రెండ్‌తో పాటు నా పర్సనాలిటీ కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో టాటూ వేయించుకున్నాను. – పవన్‌సింగ్ ఠాకూర్ -
వైరల్: అతడు ముక్కు కత్తిరించేసుకున్నాడు!
బ్రెసీలియా: ఏదైనా అవయవానికి లోపముంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి సరి చేయించుకుంటాం. అదేంటో కానీ ఈ మధ్య కొందరికి అన్ని అవయవాలు బాగుంటే నచ్చడం లేదు. మొన్నా మధ్య ఓ వ్యక్తి తన చెవులను కత్తిరించి జాడీలో భద్రపరుచుకున్నాడని చదివాం కదా! ఇప్పుడో వ్యక్తి ఏకంగా ముక్కును కత్తిరించేసుకుని అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. ఇది చదవగానే మీకు రామాయణంలోని శూర్పణఖ గుర్తొస్తుంది కదూ! పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా ముక్కును కత్తిరించేసుకున్న తర్వాత రాక్షసుడిలానే కనిపిస్తున్నాడు. ఎందుకిలా చేశాడు అంటే.. అది ఓ సరదా అని చెప్తున్నాడు. (చదవండి: ఇదేం పిచ్చి: చెవులను కత్తిరించి భద్రంగా..) బ్రెజిల్ దేశానికి చెందిన మైకెల్ ఫరోడో ప్రాడో ఓ టాటూ ఆర్టిస్టు. అతడి భార్య, స్నేహితులు కూడా టాటూ ఆర్టిస్టులే కావడంతో మైకేల్ శరీరమంతా పచ్చబొట్లు పొడిచారు. అయినప్పటికీ అతడికి సంతృప్తి కలగలేదు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది. సైతాన్గా అవతరించాలనే కోరిక పుట్టింది. ఇందుకోసం సంవత్సరాల తరబడి ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఎట్టకేలకు ముక్కును తొలగించుకున్నాడు. దీంతో అప్పటికే తల మీద ఉన్న కొమ్ములు, వికృతంగా మార్చుకున్న ముఖభాగం, ఇప్పుడు కోసేసిన ముక్కుతో నిజంగానే దయ్యంలా కనిపిస్తున్నాడు. భయంకరమైన తన కొత్త రూపాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచానికి తన పేరును డెవిల్ ప్రాడోగా పరిచయం చేసుకున్నాడు. కాగా ప్రపంచంలోనే నాసికాన్ని తొలగించుకున్న మూడో వ్యక్తిగా మైఖేల్ అవతరించాడు. (చదవండి: ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!) View this post on Instagram A post shared by #DIABÃOPRADDO (@diabaopraddo) on Sep 24, 2020 at 7:12pm PDT -
వైరస్ డిజైన్లు.. వైరల్
‘ఈ మహమ్మారి కాలంలో ప్రజలు వ్యాధి పట్ల అవగాహ కలిగి ఉండాలి. అప్పుడే వ్యాధి విస్తృతికి అడ్డుకట్ట వేయవచ్చు’ అని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సృజనశీలురు ఒక్కో విధంగా తమ ఆలోచన ద్వారా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. వారిలో టాటూ డిజైనర్లూ ఉన్నారు. పచ్చబొట్లు వేయించుకునేవారి కోసం కరోనా డిజైన్లను సృష్టించారు. కరోనా నుండి రక్షించుకునే మార్గాలను చూపుతూ సృష్టించిన ఈ టాటూ డిజైన్లు యువతరాన్ని ఆకర్షిస్తూ ట్రెండ్‌లో ఉన్నాయి. స్పెయిన్‌కు చెందిన ఆండ్రెస్ వేగా 21 ఏళ్లుగా పచ్చబొట్టు డిజైన్స్ వేస్తున్నాడు. ‘కోవిడ్ –19 సమయంలో నిపుణులు ఇచ్చిన సూచనలు ప్రజలు పాటిస్తున్నారు. వీటినే పచ్చబొట్టుగా వేయించుకోవడానికి చాలా మంది కస్టమర్లు ఇష్టపడుతున్నార’ని అంటాడు ఆండ్రెస్. ఆండ్రెస్ తన పచ్చబొట్టులో మాస్క్ ధరించిన ఒక మహిళా నర్సు డిజైన్ వేశాడు. అందమైన పువ్వులతో చేసిన డిజైన్‌ను నర్సు ఫోటో దిగువ భాగంలో వేశాడు. వైరస్ డిజైన్లు.. వైరల్ లాక్డౌన్ సమయంలో ఇంటి లోపల కరోనా గురించి తీసుకునే జాగ్రత్తలతో క్లయింట్ కోసం సృష్టించిన పచ్చబొట్లు హ్యాండ్ వాష్, మాస్క్, కరోనా వైరస్ డిజైన్లను యువతరం ఇష్టపడుతోంది. కరోనా కాలంలో ఈ పచ్చబొట్లు ప్రజలపై సరైన ప్రభావం చూపుతున్నాయంటున్నాడు ఈ టాటూ డిజైనర్. కరోనా గుర్తుగా కొంతమంది ఈ డిజైన్స్‌ని లాక్డౌన్ టైమ్‌గా గుర్తుంచుకునే మార్గంగా కూడా భావిస్తున్నారట. దీంతో ఇలాంటి పచ్చబొట్లు వేయించుకోవడానికి గల ఏ ఒక్క అవకాశాన్నీ యంగ్‌స్టర్స్ వదులుకోవడం లేదు. వినియోగదారుల అభిరుచి కోసం తయారు చేసిన ఈ పచ్చబొట్లు ప్రస్తుత కాలంలో స్టైల్‌గానూ కనిపిస్తున్నాయి. మొత్తానికి కరోనా కాలంలో వచ్చిన కొత్త ఆలోచనతో టాటూ డిజైనర్లు సరికొత్త ఉపాధిని పొందుతున్నారు. -
టాటూ స్టార్
ఆర్ట్ స్టూడెంట్ కాస్తా టాటూ ఆర్టిస్ట్‌గా మారాడు. కేన్వాస్పై రంగులద్దాల్సిన వ్యక్తి సెలబ్రిటీల తనువులనే కేన్వాస్‌గా మలచుకుని, పచ్చబొట్లతో చిత్తరువులు దిద్దుతున్నాడు. ఇరవయ్యేళ్ల వయసులోనే సీనియర్ టాటూ ఆర్టిస్ట్ వద్ద అనుకోకుండా అసిస్టెంట్‌గా చేరి, అంచెలంచెలుగా ఎదిగిన అతడి వద్ద టాటూల కోసం ఇప్పుడు సెలబ్రిటీలే క్యూ కడుతున్నారు. సమీర్ పతంగే.. బాలీవుడ్ సెలబ్రిటీలందరికీ హాట్ ఫేవరెట్ టాటూ ఆర్టిస్ట్. ‘టాటూ ఫెస్టివల్’ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సిటీప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నారు. ముంబైలో పుట్టి పెరిగాను. అక్కడే నా కెరీర్ మొదలైంది. ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. నా కాళ్లకు చక్రాలు ఉన్నాయంటారు నా మిత్రులంతా. నేను ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒక మిత్రుడు చేతిపై టాటూ వేయించుకోవడానికి నన్ను తోడుగా తీసుకువెళ్లాడు. నా మిత్రుడు ఏ డిజైన్ వేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉండగా, నేను ఒక స్టెన్సిల్ పేపర్‌పై డిజైన్ గీసి ఇచ్చాను. ఆ డిజైన్ చూసిన టాటూ ఆర్టిస్ట్ తన దగ్గర పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ చేశారు. అప్పటికి ఇంకా స్టూడెంట్‌నే కాబట్టి, ప్యాకెట్ మనీకి పనికొస్తుందని, వీకెండ్స్‌లో చేస్తానంటూ జాయిన్ అయ్యాను. అప్పటికే ఆయన వయసు మళ్లడంతో కొన్నాళ్లకు రిటైర్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన స్థానంలో నేను పూర్తిస్థాయి టాటూ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను. త్వరలోనే సొంతంగా టాటూ స్టూడియో ప్రారంభించాను. నా డిజైన్లకు కస్టమర్ల నుంచి బాగా ఆదరణ లభించింది. వారి ద్వారా క్రమంగా నా పేరు సెలబ్రిటీల వరకు వ్యాపించింది. బాలీవుడ్ ఇన్నింగ్స్.. టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే మొదట్లో మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అప్పటికే అన్నయ్య ఆర్మీలో చేరడంతో నన్ను కూడా ఆర్మీలో చేరాలంటూ పోరు పెట్టారు. అయితే, నేను వాళ్లను కన్విన్స్ చేశాను. ఇప్పుడు వాళ్లు నా సక్సెస్‌ని చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటిసారిగా సునీల్‌శెట్టి సినిమా ‘లకీర్’ కోసం జాన్ అబ్రహాంకి టాటూ వేశాను. బాలీవుడ్లో నా కెరీర్ అలా మొదలైంది. ఆ తర్వాత ఒకరోజు సల్మాన్‌ఖాన్ స్వయంగా నా స్టూడియోకి వచ్చి మరీ టాటూ వేయించుకున్నారు. హృతిక్ రోషన్, సుసానే, శ్రుతి హాసన్, సుస్మితా సేన్, సంజయ్ దత్.. ఇలా చాలామంది సెలబ్రిటీలకు టాటూలు వేశాను. సినిమాల కోసం టెంపరరీ టాటూలు కూడా వేస్తుంటాను. ఫ్లోరల్ డిజైన్లు, బటర్‌ఫ్లై డిజైన్లు వంటివి అమ్మాయిలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అబ్బాయిలైతే హెవీ డిజైన్లు కోరుకుంటుంటారు. కొందరు పేర్లు టాటూలుగా వేయించుకుని, తర్వాత ఏవో కారణాలతో వాటిపై కవరప్ టాటూల కోసం వస్తుంటారు. ఇలాంటి టాటూలే కాకుండా, ఫొటోల ఆధారంగా వ్యక్తుల ముఖాలనూ టాటూలుగా వేస్తుంటాను. వండర్ఫుల్ సిటీ.. హైదరాబాద్ నిజంగా వండర్ఫుల్ సిటీ. ఇక్కడకు ఏడాదికి మూడు నాలుగు సార్లయినా వస్తుంటాను. ఇక్కడ గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్ వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి రుచులంటే నాకు భలే ఇష్టం. ‘సర్వీ’లోని దమ్ కీ బిర్యానీ, మాసబ్‌ట్యాంక్‌లోని ‘డైన్‌హిల్’ రెస్టారెంట్లో గ్రిల్డ్ చికెన్ చాలా ఇష్టంగా తింటాను. వేకువజామున మూడు గంటలకే లేచి, మాదాపూర్‌లోని రామ్ కీ బండిలో చీజ్బట్టర్ దోసె తింటుంటాను. అదో డిఫరెంట్ ఫీల్. ఇక్కడి ప్రజలు చాలా కూల్. ప్లెజంట్‌గా మాట్లాడతారు. చక్కగా బిహేవ్ చేస్తారు. ఎన్నో దేశాలు తిరిగినా, నాకు హైదరాబాద్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ..:: శిరీష చల్లపల్లి