మౌలిక సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని గ్రామంలో ఉన్న వాంగ్ దగ్గర టాటూలు వేయించుకోవడానికి అంతర్జాతీయ ఔత్సాహికులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ వేసుకోవాలన్న ఆసక్తికి తోడు, వాంగ్ వేసే జామెట్రిక్ డిజైన్స్ కోసం ఎగబడుతున్నారు. ఎన్నో ఏళ్లనాటి కళను సెంచరీ దాటాక కూడా కాపాడుతూ తరువాతి తరాలకు అందిస్తోన్న వాంగ్‌ను ‘వోగ్’ సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె రూపాన్ని చిత్రించింది. ఇప్పటిదాక వోగ్ కవర్‌పేజీపై వచ్చిన అత్యంత వృద్ధ స్టార్‌గా వాంగ్ నిలవడం విశేషం.
ఎంతో ఇష్టమైన పేర్లు, నచ్చిన డిజైన్లను శరీరం మీద పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. ఈ అభిరుచి కొత్తగా వచ్చిందేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల్లో వందల ఏళ్లుగా భాగంగా ఉన్నదే. ఇప్పుడు టాటూలు వేయడానికి వాడుతోన్న సూదులు, టాటూ గన్‌లకు బదులు.. అప్పట్లో పదునైన గులాబీ ముళ్లు, సొరచేప పళ్లతో టాటూలు వేసేవాళ్లు. అప్పటి టాటూ పద్ధతులు చాలా వరకు కనుమరుగయ్యాయి. కానీ వందల ఏళ్లనాటి టాటూ టెక్నిక్‌ను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తోంది అపోవాంగ్ ఓడ్. 106 ఏళ్ల వయసులో పురాతన టాటూలను వేస్తూ కళను సజీవంగా ఉంచుతోంది వాంగ్. అంతేగాక ప్రపంచంలో అత్యంత వృద్ధ టాటూ ఆర్టిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగ్ ఓడ్‌ను మరియా ఒగ్గే అని కూడా పిలుస్తారు. మనీలాకు దగ్గరల్లో ఉన్న కలింగా ప్రావిన్స్‌లోని మారుమూల బుస్కలాన్ గ్రామంలో పుట్టి, అక్కడే స్థిరపడింది. టీనేజ్‌లో ఉండగా ‘మాంబా బాటక్’ అనే టాటూ కళను నేర్చుకుంది. పదహారేళ్ల వయసులో తండ్రితో కలిసి మాంబా బాటక్ వేస్తూ టాటూ ఆర్టిస్ట్‌గా మారింది. అప్పట్లో మాంబా బాటక్ వేయగల ఒకే ఒక మహిళా ఆర్టిస్ట్ అపోవాంగ్. చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడ టాటూలు వేసేది. పురుషుల్లో ధైర్యసాహసాలకు గుర్తుగానూ, యోధులుగా గుర్తింపు పొందిన వారికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు ఈ టాటూలు వేయించుకునేవారు.
అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ల తరబడి టాటూలు వేస్తూనే ఉంది వాంగ్. బొగ్గులో నీళ్లు కలిపి సిరా తయారు చేసి వెదురు పుల్లలు (బ్యాంబూ స్టిక్స్), పంపర పనస ముళ్లతో ఈ టాటూలను వేయడం వాంగ్ ప్రత్యేకత. చుక్కలతో రకరకాల ఆకర్షణీయమైన డిజైన్లు వేస్తుంది. ప్రస్తుతం ఈ టాటూలు వేయడం వచ్చిన వారు ఎవరూ లేరు. వాంగ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఈ ఆర్ట్‌ను రక్తసంబంధీకులకు మాత్రమే నేర్పిస్తోంది. వాంగ్‌కు పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన మేనకోడలికి మాంబా బాటక్‌లో శిక్షణ ఇస్తోంది.
‘‘ఈ టాటూలు వేసేవాళ్లంతా చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నాకు దిగులు లేదు. తరువాతి తరానికి శిక్షణ ఇస్తున్నాను. వాళ్లు టాటూ మాస్టర్స్ అవుతారు’’ అని వాంగ్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment