కేర్‌మన్నా.. కనిపిస్తుంది
స్క్రీన్ మీద ఒక వీడియో రన్ అవుతోంది... అందులో ఒక పనిమనిషి నెలల పిల్లాడిని మంచం మీదకు విసిరేసింది. తిరిగి పెకైత్తి మళ్లీ అలాగే విసిరేసింది. అలా పదే పదే చేసింది. అక్కడి నుంచి పసిబిడ్డని మళ్లీ హాల్లోకి తీసుకువచ్చి కుర్చీలో విసిరింది. కసి తీరా అలా ఒకటికి పదిసార్లు చంటి బిడ్డను రాక్షసంగా విసిరేసింది. ఇటీవల మీడియాలో ఈ దృశ్యం చూసినవారంతా.. ముఖ్యంగా పిల్లలను సర్వెంట్‌లకు అప్పచెప్పి వెళ్లే తల్లిదండ్రులంతా బెంగటిల్లారు. ఇలాంటివారి దిగులు తీర్చేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
- విజయారెడ్డి
కెమెరా-మోడల్స్ వైర్‌లెస్ నెట్‌వర్క్ కె మెరా డేనైట్ నెట్‌వర్క్ కెమెరా క్లవ్డ్ నెట్‌వర్క్ కెమెరా వైఫై బేబీ కెమెరా ఇదో యాంత్రిక ప్రపంచం.. ఉరుకులు, పరుగుల జీవనం. ఇదివరకు పురుష పుంగవులకే పరిమితమైన డ్యూటీ, హడావుడి.. ఇప్పుడు మహిళలకూ తప్పనిసరైంది. దాంతో ఆలూమగలు ఇద్దరూ బాక్స్‌లు పట్టుకుని మోటారు బళ్లు ఎక్కి బయలుదేరుతున్నారు. ఎలాగూ ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి. మరి కడుపున పుట్టిన పిల్లల సంగతేంటి? వారి ఆలనాపాలన ఎవరు చూస్తారు? క్రచ్‌లు, కేర్ సెంటర్లు, ప్లేస్కూల్స్ ఉండనే ఉన్నాయి. ఆలనాపాలన కోసం ఇంట్లో మెయిడ్‌ని పెట్టుకోవడం మహానగరాల్లో మాములైపోయింది. అయితే పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన వర్ణనాతీతం. కానీ ఇకపై ఆ మనసులకు సాంత్వన కల్గించే దుర్భిణీలు వచ్చేశాయ్.. అవే వీడియో బేబీ మానిటర్ కెమెరాలు! అంటే జస్ట్‌లైక్ సీసీ కెమెరాల మాదిరిగా అన్నమాట.
వై ఫై నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ బుజ్జి కెమెరా రాత్రి పూట కూడా పనిచేస్తుంది. గదిలో టెంపరేచర్ తేడాలు కూడా కనిపెడుతుంది.
బేబీ మానిటర్ కెమెరా: సుమారు పదివేల ఖరీదు చేసే బేబీ మానిటర్ కెమెరాని మీ ఇంట్లో అమర్చుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్తూ నిర్భయంగా చిన్నారిని ఇంట్లోనే ఉంచేసి వెళ్లొచ్చు. ఆఫీసులకు చేరుకున్నాక కూడా ఇంట్లో మీ పిల్లల్ని కదలికల్ని చూడొచ్చు. వీడియో పాటలు, రైమ్స్ రిమోట్ యాక్సిస్ ద్వారా వారికి వినిపించవచ్చు.
అటు నుంచి పిల్లల ఏడుపులు తదితర సౌండ్లను వినొచ్చు. రూమ్ టెంపరేచర్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్‌టాప్, పీసీ తదితరాల్లోనూ ఈ ఆప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా ఇంట్లోని కెమెరాను పనిచేయించొచ్చు. అంతేనా చీకట్లోనూ ఈ కెమెరా చక్కగా పనిచేయడం అదనపు సౌకర్యం. అలా ఈ వైఫై టెక్నాలజీతో పిల్లల్ని ఏ బెంగా లేకుండా ఈజీగా పెంచొచ్చు.
స్కూళ్లలో కూడా..
ఈ సౌకర్యం నగరంలోని పలు స్కూళ్లు కల్పిస్తున్నాయి. స్కూల్ ఎంట్రన్స్ నుంచే కెమెరాలు తమ పనిని ప్రారంభిస్తాయి. ప్రతి తరగతి గదిలో, లాన్‌లలో వెబ్ కెమెరాలుంటాయి. పిల్లలు స్కూల్లో ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులు ఎంతదూరంలో నుంచయినా వారి కదిలికల్ని చూడొచ్చు. ‘ఈ సౌకర్యంతో పిల్లల గురించి బెంగపడకుండా తల్లిదండ్రులు ప్రశాంతంగా తమ పనుల్లో లీనమవ్వచ్చు. ఫలానా టైమ్‌లో తమ పిల్లలు ఏమి చేశారో చూడాలనుకున్నా సాధ్యమే. అవసరమైతే వీడియో ఫుటేజీని కూడా వారికి అందిస్తాం’ అంటున్నారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎస్పారెంజా స్కూల్ నిర్వాహకులు.