మండీస్, హరీస్.. కేరాఫ్ బార్కాస్
హైదరాబాద్‌లో బార్కాస్‌ది ప్రత్యేక స్థానం. నిజాంల జమానాలో బార్కాస్‌ను మిలటరీ బారాక్స్‌గా ఉపయోగించేవారు. సైనిక సిబ్బంది కుటుంబాలతో సహా నివసించేవారు. కాలక్రమంలో ఆయా కుటుంబాలు శాశ్వతంగా ఇక్కడ స్థిరపడి స్థానికులుగా మారిపోయారు. అయితే ఇప్పటికీ వారు తమ ఐడెంటిటీని నిలబెట్టుకుంటూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారి ఆహారపు అలవాట్లు ఇక్కడ దాకా ప్రయాణించాయి. అందుకే ఈ ప్లేస్ విజిటర్స్‌కి మరింత ఆసక్తికం.
అరేబియన్, యెమెన్ ఫుడ్ బార్కాస్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడికి నేను కొంతకాలంగా వస్తున్నా. ‘మండి’ అనే వంటకం హైదరాబాద్‌లో ప్రతి చోటా దొరికే రెగ్యులర్ బిర్యానీకి భిన్నంగా ఉంటుంది. బాస్మతి, లాంబ్, చికెన్, డ్రైఫ్రూట్స్, మిక్చర్ ఆఫ్ స్పైసెస్ దీని తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఏ ఫ్లేవర్ కూడా గాఢమైన పరిమళాలు వెదజల్లకపోవడం విశేషం. ఇవి అండర్‌గ్రౌండ్‌లో కుక్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్లూ మటన్‌లోనే దాగుంటాయి. అలాగే ‘హరీస్’ ఇరానియన్ డిష్. దీని కోసం మాంసాన్ని గోధుమ పిండి, స్పైసెస్‌తో కలిపి వండుతారు. దీన్ని హలీమ్‌కు స్వీట్ వెర్షన్‌గా చెప్పవచ్చు. ఇది కేవలం బార్కాస్‌లోనే లభిస్తుంది.
ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా అందించే ఈ డిష్ సాధారణంగా తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కాలక్రమంలో ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చేశాయి. బర్గర్స్, షావర్మా, ఫలా ఫాల్‌లతో పాటు బక్లావా, బస్‌బుసా, దోనట్స్ వంటి డెసర్ట్స్ దొరుకుతున్నారుు. అయితే ఇక్కడి బర్గర్స్‌కు సిటీలో ఇతర ప్రాంతాల్లో దొరికే బర్గర్స్‌కూ రుచి పరంగా వ్యత్యాసం కనపడుతుంది. ఇవి మరింత మెత్తగా, కాస్త స్వీటిష్‌గా బాగా రుచిగా అనిపిస్తాయి. టెర్రియాకో, తందూరీ, బార్బెక్యూ, గ్రిల్డ్ చికెన్ బర్గర్, జింజర్ బర్గర్‌లూ లభిస్తాయి. ప్రతి బర్గర్‌దీ ప్రత్యేక రుచి. ఈ ప్రాంతాన్ని సందర్శించడం మొత్తంగా ఒక వినూత్న అనుభూతి. ఈ రుచులన్నీ అందుబాటు ధరల్లోనే ఉండటం వురో విశేషం. రూ.60 నుంచి రూ.85 మధ్య ధరల్లోనే బర్గర్స్ దొరుకుతాయి. ఇక మండి రూ.250 నుంచి రూ.450. ఇది దాదాపు ముగ్గురి నుంచి ఐదుగురికి సరిపోతుంది.
విలాసవంతమైన సోఫాలు, డైనింగ్ సౌకర్యాలు ఉండవు. కార్పెట్ వేసిన ఫ్లోర్ మీద, లేదంటే ఓ చిన్న టేబుల్ దగ్గర కూర్చోవాల్సిందే. ఇక్కడున్న బెస్ట్ ప్లేసెస్‌లో ‘యమ్ యమ్ ట్రీ’ ఒకటి. అలాగే ‘మటమ్ అల్ అరబ్బి’ కూడా. బార్కాస్ వెళితే చరిత్ర దగ్గరకు వెళ్లిరావడం మాత్రమే కాదు చవులూరించే రుచుల్ని ఆస్వాదించడం కూడా.
- టేస్ట్ స్పెషలిస్ట్
సంకల్ప్