ఆదేశాల్లోపదనిసలు..!
నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించడం ప్రధానమంత్రి నెహ్రూకు ఎంతో ఇష్టం అని చెప్పుకున్నాం కదా. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి నెహ్రూ డ్యామ్ చూడడానికి వచ్చారు. ‘కండలను కరగదీస్తూ బండలను విసురుతున్న’ శ్రామికులను పారవశ్యంగా చూస్తున్నారు. ‘మీ దినసరి కూలీ ఎంత?’ అని అడిగారు. ‘ముప్పావలా’ అని చెప్పారు. ‘మంచి మొత్తమే’ అన్నారట బ్రహ్మానందరెడ్డి. ఆ మాటకు నొచ్చుకున్న శ్రామికులు ముఖ్యమంత్రి మీద కలబడ్డంత పని చేశారట. రోజు కూలీని రూపాయి పావలా చేయమని నెహ్రూ ఆదేశించడంతో కార్మికులు ‘బ్రహ్మానంద’పడ్డారట! అప్పట్లో పాలకుల తీరు ఇప్పుడు హాస్యంగా అన్పించడం సహజం. ఇప్పుడు సాధారణంగా భావిస్తోన్న అంశాలు భవిష్యత్తులో నవ్వు తెప్పిస్తాయేమో! ఈ నేపథ్యంలో నిజాంల హయాంలో కొన్ని ఆదేశాలను గుర్తు చేసుకుందాం!
తప్పు చేసిన మేలు!
నిజాం హయాంలో కూడా ఉపాధి కోరుకునేవారి పేర్లను నమోదు చేసుకునే విధానం ఉండేది. అలా నమోదు చేసుకున్న వారు రేపటి ఉద్యోగాలకు ‘అభ్యర్థులు’! వీళ్లకు పని చెప్పే వారు. జీతం గీతం ఉండేది కాదు. ఉద్యోగం ఖాళీ కాగానే ఇచ్చేవారు. అభ్యర్థుల్లో ఒకరు రాసిన ‘నోట్ ఫైల్’ అపార్థానికి దారితీసేదిగా తప్పుల తడకగా ఉండడాన్ని మొదటి సాలార్‌జంగ్ గమనించారు. సదరు ‘రచయిత’కు పది రూపాయల జరిమానా విధిస్తూ, జీతంలోంచి మినహాయించుకోవాలని ‘నోట్ ఫైల్’పై ఆదేశించారు. ‘అభ్యర్థి’కి జీతభత్యాలు లేనందువలన జీతంలో మినహాయించుకోలేమని సాలార్‌జంగ్‌కు తిరుగు టపాలో ఆ తప్పుల తడక చేరింది! ‘అయితే వాడిని ఏదో ఒక ఉద్యోగంలో నియమించి జరిమానా వసూలు చేయండి’ అని మరొక ఆదేశం జారీ అయింది!
కాదనేందుకు నిజాం ఎవరు?!
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నివసించిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ మహా ఉదారుడు! వృద్ధుడైన ఆయన వ్యక్తిగత సేవకుడు తన అనారోగ్యాన్ని, ఈతి బాధలను ప్రభువుకు చెప్పుకున్నాడు. ఇతడికి నెలకు ఎనిమిది రూపాయల పెన్షన్‌ను జీవితాంతం ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఉత్తర్వు సిద్ధమైంది. నిజాం సంతకం చేయడమే తరువాయి. ఎనిమిది అనే సంఖ్య దగ్గర లేఖకుని పొరపాటు వలన సున్నా చేరి ‘80’గా మారింది. క్లర్క్ క్షమాపణలు చెప్పాడు. మరో కాపీ తెస్తానన్నాడు. ‘విశ్వాసుడైన ఆ సేవకునికి రూ.80 ఇవ్వాలని రాసిపెట్టి ఉంటే కాదనడానికి మనమెవ్వరం?’ అన్నాడు నిజాం! ఆ సేవకుడు జీవితాంతం రాజభోగాలు
అనుభవించాడు!
పోలీసు కమిషనర్‌కు ఫైన్!
ఆరవ నిజాం దగ్గర నవాబ్ సహాబ్ జంగ్ హోం మంత్రి. అక్బర్‌జంగ్ సిటీ పోలీస్ కమిషనర్. ఏదో విషయమై సిటీ పోలీస్ కమిషనర్ హోం మంత్రితో వాదులాడాడు. నీ పని ఇలా ఉందా అనుకున్నాడేమో ఒక రూపాయి జరిమానా విధించాడు. అక్బర్‌జంగ్ సహజంగానే అప్సెట్ అయ్యాడు. తనకు విధించిన శిక్ష గురించి నిజాంకు మొరపెట్టుకున్నాడు. మరుసటి రోజు సహాబ్ జంగ్ నిజాం సందర్శనకు వె ళ్లినపుడు ‘కమిషనర్ నా విశ్వాసపాత్రుడు, హితైషుడు. అటువంటి వ్యక్తికి జరిమానా విధిస్తారా’ అన్నాడు. అయ్యో అలాగా అని నిజాంకు క్షమాపణ చెప్పాడు సహాబ్ జంగ్. తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తాన ని అన్నాడు. ఆఫీసుకు వచ్చి సంబంధిత ఫైల్ తెప్పించుకున్నాడు. జరిమానాలో సగం చెల్లింపు జరిగింది. సంబంధిత వ్యక్తిని అర్ధరూపాయి చెల్లించనివ్వండి’ అని రాశారు!
‘బల్లె’ ఇంక్రిమెంట్!
ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ (1866-1911) ఉదారుడు. విద్యాధికుడు. వేటగాడు. అశ్వికుడు. ఆయన స్థాపించిన ‘నిజాం స్కాలర్‌షిప్ ట్రస్ట్’ సహాయంతో కవికోకిల సరోజినీ నాయుడు ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. అదలా ఉంచితే.. ఆరవ నిజాం సైన్యాధికారి నవాబ్ అఫ్సర్ జంగ్. ఈయన కింద ‘రిసాల్దార్ మేజర్’గా రెహమాన్‌ఖాన్ అనే వ్యక్తి బల్లెపు పోటుగాళ్ల మూడవ దళంలో పనిచేసేవాడు. పురానీ హవేలీలో నివసించే ఆరవ నిజాంను సందర్శించేందుకు వెళ్లే అఫ్సర్‌జంగ్‌కు అశ్వికుడైన రెహమాన్‌ఖాన్ పైలట్! ఓ పర్యాయం నిజాం నివసించే ప్యాలెస్ ప్రాంగణంలో రెహమాన్‌ఖాన్ గుర్రంపై స్వారీచేస్తున్నాడు, వాయువేగంగా! గుర్రపు వేగానికి పొడవాటి తెల్లటి గడ్డం గాలిలో నైరూప్య చిత్రాలను చూపుతోంది! ‘సెలయేళ్లుగా ప్రవహిస్తోన్న తెల్లటి గడ్డా’న్ని నిజాం తన భవంతి నుంచి చూసి అబ్బురపడ్డాడు! రెహమాన్‌ఖాన్ గడ్డం పోషణకు ఆజీవన పర్యంతం నెలకు పదిరూపాయల ఇంక్రిమెంట్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు! రెహమాన్‌ఖాన్ తన గడ్డాన్ని ప్రేమగా నిమురుకున్నాడు, చివరి శ్వాస వరకూ!
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి