‘హవ్’ హమ్ హైద్రాబాదీ! | mashoor wrote a shayari on neelam sanjiva reddy | Sakshi
Sakshi News home page

‘హవ్’ హమ్ హైద్రాబాదీ!

Published Mon, Sep 8 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

‘హవ్’ హమ్ హైద్రాబాదీ!

‘హవ్’ హమ్ హైద్రాబాదీ!

హైద్రాబాదీ షాయరీలు (కవితా గోష్టులు) ఆహ్లాదకరమైనవి. దక్కనీ భాషలో షాయరీ పాడుతోంటే  ప్రేక్షకులు తెరలు తెరలుగా కడుపుబ్బ నవ్వేవారు! ఈ వాతావరణంలో పిల్లలు హైద్రాబాద్‌లోనే పుట్టిపెరుగుతున్నారు.
 
అప్పుడప్పుడూ సకుటుంబంగా ఉత్తరాది బంధువుల దగ్గరకు వెళ్లేవారం. దేశ విభజనలో భాగంగా  పంజాబ్ రెండు భాగాలైనప్పటికీ పంజాబ్ నా స్వరాష్ట్రం కదా!  పంజాబ్‌లో, ఢిల్లీలో నివసించే బంధువులతో పిల్లలు మాట్లాడేప్పుడు వారి నోటి వెంట హైద్రాబాదీ పదాలు అసంకల్పితంగా వచ్చేవి. ‘ఇది తీసుకో’ అని ఉత్తరాది వాళ్లు అన్నారనుకోండి, ‘వద్దు’ అనదలచుకున్న మా పిల్లలు ‘నక్కో’ అనేవారు! తోటి పిల్లలు ఫక్కున నవ్వేవారు! వారి దృష్టిలో అది మోటు పదం! వద్దు అనాలంటే ‘న’ లేదా ‘నహీ’ అనాలి! ఏకీచ్ అంటే మోటు.. ఏక్‌హీ అనాలి!   మీరు మోటుగా మాట్లాడతారు, సంస్కారం లేదు అని పిల్లలను వెక్కిరించేవారు! నా దృష్టిలో హైద్రాబాదీలతో పోలిస్తే ఉత్తరాదివారికి సగం కూడా కల్చర్ లేదు! లేదంటే వింటారా! ‘నై బోలేతో సున్తే క్యా’!

‘నై బోలేతో సున్తే నై’ !
‘వద్దంటే వినదు/వినరు’ అనే అర్థం వచ్చే పై మకుటంతో దక్కనీ షాయరీ  సిటీలో ప్రాచుర్యంలో ఉండేది. అందులోని అనేక
చరణాల్లో కొన్ని...


కర్నే కొ జో కామా హైసొ  / చేయాల్సిన పనులన్నీ
 జైసేకే వైసే హీచ్ హై / ఎక్కడివక్కడే ఉన్నాయి
 నై కర్నేకె కామా కర్‌రై/ చేయకూడని పనులు చేస్తున్నావు
 నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు
 ఉమర్‌కె పీఛే మత్ భాగో / వయసు వెనుక  పరుగెత్తొద్దు
 గయేసీ జవానీ ఆతీనై / పోయిన వయసు రాదు
 మేకప్ గీకప్ నక్కో/మేకప్ గీకప్ వద్దు
 నైబోలేతో సున్తేనై /వద్దంటే వినడం లేదు
 అచ్ఛే అచ్ఛే డ్రామే దేఖో / మంచి మంచి నాటకాలు చూడు
 కిత్తా కిత్తా సమ్‌ఝాయా/ ఎంతెంతగా నచ్చచెప్పా
 గంధే ఫిల్మే మత్ దేఖో/ పాడు సినిమాలు చూడొద్దని
 నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు

 
సంజీవరెడ్డి మామా !
సమైక్యరాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు! హైకోర్టు అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యకు స్పందనగా పదవికి రాజీనామా చేయసారు, ప్రధాని నెహ్రూకు చెప్పకుండా! అటువంటి  వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండగా విమర్శించడం అంత తేలిక కాదు కదా! సర్వార్ దండా అనే మషూర్ కవి  ‘సంజీవరెడ్డి మామా’ అనే షాయరీ రాసారు. విన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వే అనేక చరణాల్లో ఒక చరణం..

 పోలీస్ కి డైరీ మె/ పోలీసుల డైరీలో
 దండె కి షాయిరీ మె/దండె కవిత్వంలో
 న ఫుల్ స్టాఫ్ న కామా/ఫుల్‌స్టాప్ ఉండదు కామా ఉండదు
 సంజీవ్ రెడ్డి మామా/సంజీవరెడ్డి మామా


 ఓల్డ్ సిటీలో నేటికీ  పాడుకునే ఒక ‘నక్కొ’ నుడికారం

 పూపీ సాస్ నక్కొ/మేనత్త అత్తగా వద్దు
 భతీజీ బాబు నక్కొ/సోదరుడి కూతురు కోడలుగా వద్దు
 బందీ సౌకాన్ నక్కొ/పని మనిషి సవతిగా వద్దు
 ఘర్ మె సాలా నక్కొ/బావమరిది ఇంట్లో వద్దు
 కతిల్ పితల్ కా సాజ్ నక్కొ/ఇత్తడి ఆభరణాలు వద్దు
 బూఢే మరద్ కి రాజ్ నక్కొ/ముసలి వాడితో సంసారం వద్దు


ఆహ్లాదకరమైన దక్కనీ సారస్వత వాతావరణంలో పెరిగిన పిల్లలు ఉత్తరాది వారి దృష్టిలో మోటు మనుషులు! ఉత్తరాది వారు   హిందీ లేదా ఉర్దూలో మాట్లాడతారు.  ఒక ఉత్తరాది వ్యక్తికి హైద్రాబాదీకి జరిగిన సంభాషణను ఆరోజుల్లో హైద్రాబాదీలు హాస్యంగా చెప్పుకునేవారు!

ఒక ఉత్తరాది వ్యక్తి హైద్రాబాదీ పిల్లవాడిని అడుగుతున్నాడు ‘ ఈ రోడ్డు హైద్రాబాద్‌కు పోతుందా?’  పిల్లవాడు ‘హవ్ (అవును)’ అన్నాడు. ‘హవ్’ అని నీచంగా మాట్లాడావు నువ్వు అన్నాడు పెద్దాయన. మరేమనాలి సార్ అన్నాడు పిల్లవాడు. ‘జీ హా’ అనాలి అన్నాడు. అంటే ‘హవ్’ నీచమైన పదం అన్నమాట అన్నాడు పిల్లవాడు. పెద్దాయన ‘హవ్’ అన్నాడు!
 ఇంతటి హాస్యం ఉన్న దక్కనీ.. ఉర్దూ కంటే లేక హిందీ కంటే తక్కువ ఎలా అవుతుంది? అసలు దక్కనీ భాషే ఈ రెండు భాషలకూ మాతృక. ఆ చారిత్రక వైనం మరోసారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement