
‘హ్యాపీ’ హైదరాబాద్
హైదరాబాద్ ట్రెడిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలా చెప్పినా తక్కువే. ఆనాటి చార్మినార్ నుంచి నేటి మెట్రో వరకు అన్నీ భాగ్యనగర సిగలో మెరిసే తారకలే. తాజాగా మన సైబరాబాద్ గొప్పదనం యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆస్కార్‌కు నామినేట్ అయిన పారెల్ విలియమ్స్ ‘హ్యాపీ’ సాంగ్‌లో హైదరాబాద్ ఒదిగిపోయింది. సరదా, సరదా పదాలతో తన నగరాన్ని పొగుడ్తూ పారెల్ విలియమ్స్ పాడిన పాట ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ పాట ఎసెన్స్ పట్టిన హైదరాబాదీ కుర్రాళ్లు ఊరికే ఊరుకుంటారా. ఆ ట్యూన్‌కి తగ్గట్టుగా హైదరాబాద్ అందాలను జోడించి షూట్ చేసిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
‘కౌచ్ పొటాటో ప్రొడక్షన్ హౌస్’ తీసిన ఈ వీడియోకు ఇప్పటికే 31,749 వ్యూస్ వచ్చాయి. మెర్విన్ సామ్ డెరైక్ట్ చేసిన ‘హ్యాపీ’ హైదరాబాద్ వీడియోలో 50 మంది యువతీయువకులు స్టెప్పులతో అదరగొట్టారు. డెసిప్లికబుల్ మీ-2 మూవీలో ‘హ్యాపీ’ పాటను చూసి ఇన్‌స్పైర్ అయిన మెర్విన్.. యూట్యూబ్‌లో చూస్తే మరింత ‘హ్యాపీ’గా ఫీలయ్యాడు. ఇదే పాటకు చెన్నై, బెంగళూర్ సిటీకి సంబంధించిన వీడియోలు చూసి హైదరాబాద్ ‘హ్యాపీ’ సాంగ్ చేయాలని ఫిక్సయ్యాడు. చార్మినార్, ట్యాంక్‌బండ్, హైటెక్స్, నెక్లెస్ రోడ్ ఇలా డిఫరెంట్ లొకేషన్లలో షూటింగ్ ప్లాన్ చేశాడు. రెండు వారాల్లో వీడియో షూట్ ఫినిష్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేశాడు. ఈ పాటలో మెట్రో ైరె లు కార్మికులు కూడా స్టెప్స్ వేయడం మరో విశేషం. షూటింగ్ టైంలో తారసపడిన వీరిని వీడియో కాన్సెప్ట్ చెప్పగానే.. డ్యాన్స్ చేశారని మెర్విన్ సంతోషంగా చెబుతున్నాడు. ఏదైతేనేం.. కౌచ్ పొటాటో ప్రొడక్షన్ హౌస్ తీసిన ‘హ్యాపీ’ హైదరాబాద్ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ ఫేవరేట్ స్నాక్.
- జాయ్