సీమ జోలికొస్తే చీరేస్తా!
రాష్ట్ర విభజన ప్రక్రియ చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రాంతాలవారీగా విడిపోయిన నేతలు పరస్పరం వాగ్బాణాలు విసురుకుంటున్నారు. నువ్వొకటి అంటే నేరెండంటా తరహా తన్నుకుంటున్నారు. ఇదే సమయంలో పరుష పదజాలం వాడేందుకు కూడా వెనుకాడడం లేదు. తాము ప్రజా ప్రతినిధులమన్న సంగతి మర్చిపోయి దిగజారుతున్నారు. సినిమా డైలాగులు చెబుతూ రెచ్చగొడుతున్నారు.
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుపై రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్) నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసిన కావూరిపై పరుష పదజాలంతో బైరెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమ జోలికొస్తే చీరేస్తా అంటూ ఊగిపోయారు. కావాలంటే కోస్తా ప్రాంతాన్ని చీల్చుకోమని సలహాయిచ్చారు. 'కోయాలనుకుంటే కోస్తాను కోసుకోండి, సీమను కోయాలని చూస్తే... కోస్తాం జాగ్రత్త' అంటూ బైరెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసే హక్కు కావూరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
సీమాంధ్రకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను బహిరంగంగా సమర్ధించిన జేసీ దివాకర్ రెడ్డిని బైరెడ్డి ఒక్కమాట అనకపోవడం గమనార్హం. కాగా బుధవారం హైదరాబాద్లో జరిగిన రాయలసీమ ప్రజా ప్రతినిధుల సమావేశంలోనూ కావూరిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త రాజధానిని కృష్ణా జిల్లాకు తరలించాలన్న కుట్రతోనే కావూరి రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారని మండిపడినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మరుగున పడకుంటే కావూరిని కడిగిపారేసే వాళ్లమని అన్నారు(ట). మొత్తానికి రాష్ట్ర విభజన నేతల మధ్య పెద్ద చిచ్చే పెట్టిందనే చెప్పాలి.