మైకేల్ జాక్సన్ - మార్లిన్ మన్రో
మత్తు(డ్రగ్స్) మాయలో పడితే ఎంతటివారైనా అంతే. పరువు బజారునపడితే, కుటుంబాలు, జీవితాలు నాశనమవుతాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో యువతీయువకులు డ్రగ్స్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు స్వార్ధపరులు ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నారు. వారికి డబ్బే ముఖ్యంగానీ జీవితాలు తృణపాయం. ఈ మత్తులో మాములు వారే కాదు సెలబ్రిటీలు కూడా పడ్డారు.పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న పలువురు సెలబ్రిటీలు చివరికి చీకట్లో కలసిపోయారు. మత్తు ఎంతలా జీవితాలను నాశనం చేస్తుందో చెప్పడానికి వారు సాక్ష్యాలుగా మిగులుతున్నారు. హాలీవుడ్ చరిత్రను ఒక్కసారి గమనిస్తే ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. యావత్ ప్రపంచాన్ని తమ అందచందాలు, నటన, ఆటపాటలతో అలరించిన ఎందరో డ్రగ్స్‌కు బానిసలయ్యారు. చివరికి వాటివల్లే ప్రాణాలపైకి తెచ్చుకున్నారు.
మార్లిన్ మన్రో: హాలీవుడ్ చరిత్రలో అత్యంత అందగత్తె మార్లిన్ మన్రో. వరల్డ్ లీడింగ్ సెక్స్ సింబల్. ఇప్పటికీ మన్రో డ్రెస్, స్టైల్, గెటప్‌ను ఫాలో అవుతున్నామంటే ఆమె క్రియేట్ చేసిన ట్రెండ్ ఎలాంటిదో అర్థమవుతుంది. కానీ మన్రో స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయిందంటే ఆశ్చర్యపోక తప్పదు. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ హోమ్‌లో ఆగస్టు 4, 1962న స్పృహలేకుండా కనిపించింది. డ్రగ్ ఓవర్ డోస్ వల్లే మన్రో కోమాలోకి వెళ్లి చనిపోయినట్లు నిర్థారించారు.
మైకేల్ జాక్సన్: కింగ్ ఆఫ్ పాప్. ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ లెజెండ్. 50 నైట్ కమ్ బ్యాక్ టూర్ రిహార్సల్స్ చేస్తూ చాలా అలసటకు గురవుతుండేవారు. ఆ సమయంలో ఆయన రిలాక్సేషన్ కోసం మెడిసిన్ తీసుకోవాలనుకున్నారు. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో జూన్ 25, 2009లో ఆయన అర్థాంతరంగా కన్నుమూశారు. ఆయనకు డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చిన ఆయన డాక్టర్ ముర్రే ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
విట్నీ హౌస్టన్: గొప్ప గాయనిగా పేరుప్రఖ్యాతులు సాధించింది. ఆమె ఫ్యాన్స్ లేని దేశం లేదంటే అతిశయోక్తికాదు. తన పాట ద్వారా అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. కానీ మత్తుకు బానిసై చివరికి బాత్‌టబ్‌లో శవమై తేలింది.
అమీ విన్‌హౌజ్: హాలీవుడ్‌లో అత్యంత ప్రతిభాశాలులైన గాయణీమనుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. రిహాబ్ పేరిట ఆమె పాడిన పాటల్లో తనను డ్రగ్స్ నుంచి బైటపడేసేందుకు జనం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. కానీ ఆమె ట్రీట్‌మెంట్‌కు ఒప్పుకోలేదు. ఫలితంగా 27 ఏళ్ల ప్రాయంలోనే ఆమె మృత్యు ఒడిలోకి చేరింది.
హీత్ లెడ్జర్: ది డార్క్ నైట్ సినిమాలో జోకర్‌గా యాక్ట్ చేసి, అది రిలీజ్ కాకముందే హీత్ లెడ్జర్ తుదిశ్వాస విడిచారు. నేలపై నగ్నంగా పడి ఉన్న ఆయనను చూసి అందరూ నివ్వెరపోయారు. ఇందుకు కారణాలు ఏమిటని ఆరా తీస్తే, తీవ్ర నిద్రలేమితో బాధపడిన లెడ్జర్ డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు తెలిసింది. చివరికి అదే ఆయన ఉసురు తీసింది.
ప్రమాదకరమైన మాదకద్రవ్యాలకు, వివిధ రకాల మత్తు పదార్ధాలకు అలవాటుపడేవారు వారి జీవితాలను హెచ్చరికగా తీసుకోవాలి. వీరి జీవితాలు గుణపాఠంగా తీసుకొని అటువంటి వారు డ్రగ్స్కు దూరంగా ఉంటూ జీవితాలను సుఖమయం చేసుకుంటారని ఆశిద్దాం.
- శిసూర్య