పంచామృతం
‘డ్రగ్స్’ వ్యక్తిగతంగా ఉల్లాసాన్ని ఇస్తాయేమో కానీ.. వ్యక్తిగా పతనం చేస్తాయి. అయినా కొందరు ప్రముఖులు చాలా గుట్టుగా వీటి మత్తులో మునుగుతున్నారు. దొరికిన వారు దొంగలు. అలా దొరికిన వారిలో కొందరైతే మరో రకంగా స్ఫూర్తిమంతులు కూడా! ఎందుకంటే వీళ్లు ఆ వ్యసన బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. నిర్వీర్యం అయిపోతున్న దశనుంచి కోలుకుని... తలెత్తుకుని నిలబడ్డారు. తమను తాము సంస్కరించుకుని తమ శక్తిని చాటుకొన్నారు. వారే ఈ ఐదుగురు.
ఏంజెలీనా జోలీ
‘ఇంకా నయం.. ఆ మత్తులో ఉన్నప్పుడే నాకు చావు రాలేదు...’ అని అంటుంది ఏంజెలీనా. నటిగా ఎంతో పేరును, వ్యక్తిగా ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్న జోలీ తన ‘డ్రగ్స్’ గతం గురించి ఏమీ దాచుకోకుండా మాట్లాడుతుంది. తన టీనేజ్ అంతా కొకైన్, హెరాయిన్‌ల సేవనంలోనే గడిచిపోయిందని చెబుతుంది. డ్రగ్స్ అందని సమయంలో తనను తానే హింసించుకునే దశకు వెళ్లినట్టు, ఆత్మహత్యాయత్నాలు కూడా చేసినట్టుగా వివరిస్తుంది. అయితే అదృష్టవశాత్తూ తను డ్రగ్స్ మత్తు నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చానని జోలీ తన గతకాలపు అనుభవాలను చెబుతోంది.
సంజయ్‌దత్
పొడవాటి జుట్టు... మత్తుతో మునిగినట్టుగా ఉండే కళ్లు... సునీల్‌దత్ తనయుడిగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యేనాటికి సంజయ్‌దత్ రూపమది. నిర్లక్ష్యదేహభాషకు అతడు నిదర్శనంగా కనిపించడానికి కారణం డ్రగ్స్. అదే సమయంలో తల్లి మరణం, తండ్రి తీసుకున్న చొరవ దత్‌ను మార్చింది. డ్రగ్స్‌కు దూరంగా, సినిమాలకు దగ్గరగా తీసుకెళ్లింది. ఈ వ్యవహారంలో దత్ దాచుకొన్నది ఏమీ లేదు. హీరోగా ఉన్నత స్థాయికి చేరడం ఎంత నిజమో.. ఒకనాడు డ్రగ్స్ వాడకంతో అథమస్థితిలో ఉన్నది కూడా అంతే నిజమని ఒప్పుకుంటాడు దత్.
డ్రూ బ్యారీమూర్
చార్లెస్ ఏంజెల్స్ సినిమాలో ఏంజిల్‌లా మెరిసిన, హాలీవుడ్ రొమాంటిక్ సినిమాల్లో క్యూట్‌గా కనిపించిన డ్రూ బ్యారీమూర్ వెనుక కూడా చీకటి గతం ఉంది. బాలనటిఅయిన నాటి నుంచే పేరుపొందిన డ్రూ అదే వయసులోనే డ్రగ్స్‌కు కూడా బానిస అయ్యింది. పదేళ్ల వయసులోనే తన తోటి పిల్లలతో కలిసి డ్రగ్స్‌మత్తులో మునిగేదాన్నని డ్రూ చెబుతుంది. అప్పటి వరకూ అలా అథమస్థితిలో ఉన్నా ఆ తర్వాత మాత్రం డ్రూ కోలుకుంది. కొత్త గమ్యాన్ని ఎంచుకొని ముందుకు సాగింది. నటిగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతగల వ్యక్తిగా కూడా నిలుస్తోంది.
బ్రాడ్‌పిట్
డ్రగ్స్‌నుంచి విముక్తి కావడంలో తనకు తానే స్ఫూర్తి అని అంటాడు బ్రాడ్‌పిట్. ఆ చెడు అలవాటుకు బానిసగా మారి... ఎన్నో రోజులను వృథా చేశాక కానీ, తను ప్రపంచాన్ని ఎంత మిస్ అవుతున్నానో, తనను తను ఎంతగా నాశనం చేసుకొంటున్నానో అర్థం కాలేదంటాడు ఈ హీరో. మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి, మంచి జీవితాన్ని గడపాలని అంతర్గతంగా జనించిన తపన తనకు డ్రగ్స్‌నుంచి విముక్తి కల్పించిందని ఈ హాలీవుడ్ హీరో సింహావలోకనంగా చెబుతాడు.
డిగో మారడోనా
ఆట నుంచి రిటైరై సంవత్సరాలు గడిచిపోయినా ఈ తరం ఫుట్‌బాల్ అభిమానులకు కూడా డిగో అంటే ఎంతో క్రేజ్. ఒకవేళ తను గనుక డ్రగ్స్‌కు బానిసగా మారకపోయుంటే మరింత గొప్ప ఆటగాడిని అయ్యేవాడిని అంటాడు ఈ అర్జెంటీనా ఫుట్‌బాలర్. డ్రగ్స్ నుంచి విముక్తి పొంది ఆటపై దృష్టి నిలపడం వల్లనే ఇప్పటికీ అభిమానుల మనసుల్లో స్థానం నిలుపుకున్నానని డిగో అంటాడు. అయితే యువకుడిగా ఉన్నప్పుడు విశృంఖలంగా సాగిన డ్రగ్స్ సేవనం ఇప్పటికీ ప్రభావం చూపుతోందని బాధపడుతుంటాడు ఈ లెజండరీ ప్లేయర్.
బానిసత్వం నుంచి బయటకొచ్చారు..!
Published Sun, Nov 16 2014 1:00 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement