
ఢిల్లీ యువతకు నయా అడ్డాగా మారిన చంపా గలీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునికత, అభివృద్ధితో గ్రామాలు సైతం నగరాల్లో కలిసిపోతుంటే దేశ రాజధాని ఢిల్లీలోని ఆ గల్లీ మాత్రం కృత్రిమ మెరుపులకు, హంగు ఆర్భాటాలకు దూరంగా యువతను ఆకట్టుకుంటోంది. చంపా గలీగా పేరొందిన సాకేత్‌లోని సైదుల్ అజైబ్ విలేజ్ ఒత్తిడి నుంచి సేదతీరాలనుకునే నగరజీవిని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఢిల్లీలోని యువతకు చిరునామాగా మారడంతో పాటు స్టార్టప్‌లకూ ఊతమిస్తోంది. వారాంతాల్లో కాఫీ, గరమ్ ఛాయ్‌లను ఆస్వాదించేందుకు నయా అడ్డాగా అవతరించింది.
ఐదేళ్ల కిందట ఫర్నీచర్ గోడౌన్లు, గ్రాఫిక్ డిజైన్ షాపులతో బిజీగా ఉన్న ఈ గల్లీ ఇప్పుడు సుందరమైన పెయింటింగ్‌లు, తీరైన కళాకృతులతో కళలను ఆస్వాదించేవారికి, భోజన ప్రియులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. ఈ చిన్న గల్లీని అలంకరించిన సుందరంగా మలిచిన తీరు చూస్తుంటే పారిస్‌ను తలపిస్తుంది. కేఫ్‌లు, ఫుడ్ జాయింట్లు పారిస్‌ను పోలిన వాతావరణం, కళాకృతిని పోలిఉంటాయి. సాయంత్రాలు ఇక్కడ మ్యూజికల్ బ్యాండ్స్, సోలో ఫెర్‌ఫామెన్స్‌లతో ఈ గల్లీలో సందడి నెలకొంటుంది. చంపా గల్లీలో ప్రతి ఈటింగ్ జాయింట్, కేఫ్‌ల్లో చిన్న రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. సందర్శకులు రుచికరమైన కాఫీ, వేడివేడి ఆహారాన్ని ఆరగిస్తూ తమకిష్టమైన పుస్తకాలను తిరగేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment