చందేరీ అందాలు
చందేరీ చేనేత వస్త్రాలు భాగ్యనగరిలో కనువిందు చేస్తున్నాయి. అక్కడి హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఆభరణాలు ఇక్కడి మగువల మనసు దోచుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా చందేరీ పట్టణానికి చెందిన ‘కల్యాణ్ బున్‌కర్ హ్యాండ్లూమ్’ సంస్థ బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్‌లో చందేరీ వస్త్రాలు, ఆభరణాల ప్రదర్శనను మంగళవారం ప్రారంభించింది. ‘చందేరీ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలకు, హస్త కళాకారులు తయారు చేసిన నగలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనిని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు చందేరీ పేరుతో నకిలీ వస్త్రాలను, ఆభరణాలను విక్రయిస్తున్నారు.
కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు, చందేరీ వస్త్రాలు, నగలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాం’ అని సంస్థ నిర్వాహకుడు షోయబ్ ఖాన్ చెప్పారు. ఈ ప్రదర్శనలో హ్యాండ్‌మేడ్ బీడెడ్ జ్యూవెలరీ, చేనేత వస్త్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చందేరీ చీరలు రూ.3 వేల నుంచి రూ.30 వేల వరకు, ఆభరణాలు రూ.300 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఈనెల 17 వరకు కొనసాగుతుంది.
- సాక్షి, సిటీప్లస్