అన్‌కట్ అదుర్స్
ఆభరణాలనేవి ఐశ్వర్యానికి ప్రతీకలుగా అన్పించేవేమోగానీ... ఇప్పుడలా కాదు. ఆధునిక పోకడలు పోతున్న నగరవాసుల దృష్టిలో అవి జీవనశైలికి ప్రతిబింబాలు. ధరించే దుస్తులైనా, ఆభరణాలైనా అభిరుచికి తగినట్లుగా ఉండాలని నవతరం కోరుకుంటోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇంట్లో జరిగే చిన్న శుభకార్యం నుంచి ఎంగేజ్‌మెంట్‌ల వరకు మహిళలు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక పెళ్లిళ్లైతే చెప్పనవసరం లేదు. జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లిలో వధువు అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు ధగధగలాడే నగలు ధరించేలా నగరవాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి ఆసక్తిని బట్టి నగరంలోని జ్యువెలరీ సంస్థలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా నగల డిజైన్లను మారుస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్‌కట్ డైమండ్ ఆభరణాలకు విపరీతమైన క్రేజ్. టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్), వివిధ డిజైన్లతో కూడిన సరికొత్త వడ్డాణం, జడ, నెక్లెస్, షార్ట్ నెక్లెస్‌లపై కూడా సిటీవాసులు మోజు పెంచుకుంటున్నారు. ఏ పండుగ వచ్చినా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో ఏ జ్యువెలరీ షాపు చూసినా రద్దీగా కనిపిస్తుంటుంది. మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు ఈ ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
హైదరాబాద్‌లోనే తయారీ
సిటీవాసులను కట్టిపడేస్తున్న ఈ ఆభరణాలన్నీ నగరంలోనే తయారవడం విశేషం. ఇవన్నీ హ్యండ్‌మేడ్ నగలు. దీంతో ధర ఎంతైనా కొనుగోలు చేసేందుకు వెనకాడడం లేదు. మెరుగైన డిజైన్లు చేయగల అద్భుత అనుభవం నగరవాసుల స్పెషాలిటీగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే అన్‌కట్ డైమండ్, టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్) తదితర ఆభరణాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఈ జ్యువెలరీకి మంచి డిమాండ్. దక్షిణ భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. అష్టలక్ష్మీ లాకెట్, విష్ణు, కృష్ణా, గణేష్.. ఇలా దేవతల బొమ్మలతో వీటిని తయారు చేస్తున్నారు. కెంపులు పచ్చలతో నెక్లెస్, జడ, బెల్టులు రెడీ చేస్తున్నారు.
ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాం
దేశవిదేశాల మధ్య పెరిగిన రాకపోకలు, ఇంటర్నెట్, టీవీ చానల్స్ తదితర మాధ్యమాలు అంతులేని ఫ్యాషన్లను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో తాము ధరించే ఆభరణాల డిజైన్ సరికొత్తగా ఉండాలని కోరుకునే ఫ్యాషన్ ప్రియులు ఎక్కువయ్యారు. అందుకనుగుణంగానే అన్‌కట్ డైమండ్ తదితర ఆభరణాలను నగరంలోనే తయారు చేస్తున్నారు. సిటీవాసులు వీటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు.
- మహేందర్ తయాల్, అధ్యక్షుడు,
హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్
- - వాంకె శ్రీనివాస్