
చిప్‌చాట్
క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాకెళ్లినా.. ఏ సర్టిఫైడ్ మూవీకెళ్లినా.. ఫస్ట్‌ఆఫ్ వరకు కథ బాగున్నా.. సాగదీసే కథనంతో తలబొప్పికట్టినా.. ఇంటర్వెల్ కాగానే కాస్త రిలీఫ్ మూడ్‌లోకి వచ్చేస్తాం. ఇంటర్వెల్ పూర్తయ్యాక సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ రిలీఫ్ మూడ్‌ను కంటిన్యూ చేసేది మాత్రం పంటికింద కరకరలాడే చిప్సే. సినిమాలో ఉత్కంఠ రేపే సీన్ వస్తుంటే.. కళ్లు స్క్రీన్‌కు అప్పగించేసి, చేతులకు, నోటికి పని చెప్పేస్తుంటాం. ఒక్క సినిమా టైమ్‌లోనే కాదు.. సరదా కబుర్లకు కాలక్షేపం కూడా ఇవే. రకరకాల చిప్స్ నిత్యజీవితంలో స్నాక్స్ రూపంలో మన ఆత్మారాముడికి ఆటవిడుపు కల్పిస్తూనే ఉన్నాయి.
..:: త్రిగుళ్ల నాగరాజు
ఔరార గారెలున్నా.. అయ్యారె బూరెలున్నా.. అప్పళాలు లేకపోతే ముద్దదిగని వాళ్లం మనం. అయితే ఈ చిప్స్‌కు పెద్దన్న లాంటి అప్పడాల వాడకం ఇంటికే పరిమితమైంది. అప్పడాలు, వడియాల ఫార్ములాతోనే రూపొందిన చిప్స్.. కార్పొరేట్ కవర్లలో చేరి ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ చిప్స్‌కు చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ అందరూ బానిసలే. అందుకే వీటికున్న ఆదరణ తెలిసే నగరంలో వీధి వీధికీ హాట్ చిప్స్ దుకాణాలు వెలిశాయి. ఆలూ, కంద, అరటికాయ, పెండలం.. ఇలా రకరకాల చిప్స్ అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ హంగులు అందుకున్న చిప్స్ సాల్ట్, టమాట, చిల్లీ, ఆనియన్.. ఇలా మార్కెట్‌లోకి రకరకాల ఫ్లేవర్స్‌లో వచ్చి రూకలు కొల్లగొడుతున్నాయి.
ఏ బిల్ మాంగే మోర్..
వీధి చివరనున్న కిరాణా కొట్టులో రూ.10 పలికే చిప్స్ ప్యాకెట్.. సినిమా థియేటర్‌కు వెళ్లే సరికి పాతికవుతోంది. అదే మల్టీప్లెక్స్‌లోకి చేరేసరికి వీటి ధర యాభై నుంచి వంద పలుకుతోంది. సినిమా టికెట్లకు అయ్యే ఖర్చు కన్నా.. స్నాక్స్‌కే ఎక్కువ వెచ్చిస్తున్నారు జనం. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వస్తే జేబులు లూటీ చేస్తున్నారని ఆ క్షణంలో గొణుకున్నా.. సినిమాకు వెళ్లిన ప్రతిసారీ వీటిని కొనడం మాత్రం మానడం లేదు సగటు సిటీవాసి. ఇక చిప్స్‌ను అప్‌డేట్ చేస్తూ వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్‌కు జనాలు ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే.. సినిమా టికెట్ బుకింగ్ కౌంటర్ కన్నా.. థియేటర్ లోపలున్న ఫ్రెంచ్ ఫ్రైస్ పాయింట్ దగ్గరే ఎక్కువ క్యూ కనిపిస్తుంటుంది. వీటి ధర కూడా 50కి పైమాటే.
టేస్ట్ విత్ డిప్..
ఈ చిప్స్‌ను మరింత టేస్టీగా ఎంజాయ్ చేయడానికి టమాటా సాస్, జామ్స్, చీజ్-పన్నీర్ డిప్.. ఇలా రకరకాల డిప్స్ కూడా ఉన్నాయి. అయితే ఫ్లేవర్డ్ చిప్స్‌కు అలవాటుపడిన ప్రాణం.. ఎక్స్‌ట్రా డిప్స్‌తో టేస్ట్ చేయడం తక్కువైంది. ఆయిల్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ చిప్స్‌కు అలవాటుపడి అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వాళ్లూ ఉన్నారు. ఏదైనా మితంగా తింటేనే హితం. అలాకాకుండా మెలితిరిగి ఉన్నా నాదే అంటూ.. కరకర నమిలేశామా..! అంతేసంగతులు. ఈ చిప్స్ బాత్ దేనికోసం అంటారా ఈ రోజు చిప్ అండ్ డిప్ డే.