కాంగ్రెస్ అభ్యర్థులకు 'చిరు' కష్టాలు
రాజకీయాలపై సినీ ప్రభావం మాటల్లో చెప్పలేం. తారాగణమంతా ఏదో ఒక పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేయడం ఏడో దశకం నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తారల ప్రచారంపైనే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. వీరి ప్రచారం వల్ల ఓట్లు రాలుతాయో, లేదో తెలియదు కానీ, కనీసం సభలు, సమావేశాలకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తే అభ్యర్థికి కాస్త మానసిక స్థైర్యం పెరుగుతుందని ఆయా పార్టీలు విశ్వసిస్తూ ఉంటాయి.
ఇక కేంద్రమంత్రి చిరంజీవితో ప్రచారం విషయంలో కాంగ్రెస్ అభ్యర్థులు భయపడుతున్నారు. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి కర్ణాటకలో జరిగే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి ప్రచారానికి వచ్చే విషయమై ఇంకా స్పష్టత లేదు. కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరులోని మూడు నియోజక వర్గాలు బళ్లారి, రాయచూరు జిల్లాలతో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న తమిళనాడులోని హోసూరులో ఆయన గతంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. చిరంజీవి ప్రచారం కోసం కేంద్రమంత్రి కెహెచ్. మునియప్ప ఆరాట పడుతుంటారు. గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో చిరంజీవి విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితాల మాట ఎలా ఉన్నా, ఆయనను చూడడానికి అభిమానులు ఎగబడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది.
మెగాస్టార్ చిరంజీవితో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో కర్ణాటకలోని ప్రవాసాంధ్రులతో పాటు నివాసాంధ్రులు సైతం కాంగ్రెస్ అంటేనే అసహ్యించుకుంటున్నారు. విభజన విషయంలో చిరంజీవి పాత్రపై ఆయన అభిమానుల్లోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చిరంజీవిని ప్రచారానికి తీసుకు వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.