ఆరోగ్య ప్రాప్తిరస్తు | City, venue 'World Yoga and Health Convention' | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ప్రాప్తిరస్తు

Published Thu, Jun 4 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

ఆరోగ్య ప్రాప్తిరస్తు

ఆరోగ్య ప్రాప్తిరస్తు

- సిటీ వేదికగా ‘వరల్డ్ యోగా అండ్ ఆరోగ్య కన్వెన్షన్’
- ఈ నెల 18 నుంచి ప్రారంభం
- డాక్టర్ రామ్ జి.రెడ్డి అసమాన కృషి
సాక్షి, సిటీబ్యూరో:
భారత గడ్డపై పుట్టిన ఎన్నో కళలు ఒకప్పుడు ప్రపంచమంతా విస్తరించాయి. కాలక్రమంలో తన మూలాలను మార్చుకుని పొరుగు దేశాల్లో ‘స్థానికం’గా నిలిచిపోయాయి. కరాటే, కుంగ్‌ఫూ వంటి విద్యలు అటువంటివే. కానీ కాలం మారినా.. ప్రపంచమంతా తన ప్రభ వెలుగుతున్నా తరతరాలుగా భారతీయ మూలాలతోనే మనుగడ సాగిస్తోన్న విద్య ‘యోగా’. మన దేశపు సంప్రదాయ సంపూర్ణ ఆరోగ్య విధానం. ఈ విధానానికి మరింత ప్రాధాన్యం, ప్రాముఖ్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు డాక్టర్ రామ్ జి.రెడ్డి. అమెరికాలోని నెక్స్‌జెన్ థెరపటిక్స్‌కు సీఎస్‌వోగా వ్యవహరిస్తున్న ఈయనో యోగా డాక్టర్. ఈనెల 18 నుంచి 21 వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘వరల్డ్ యోగా అండ్ ఆరోగ్య కన్వెన్షన్’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
 
ఇలా ఉంటుంది..
నాలుగురోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యోగా క్లాసులు, ఆయుర్వేద, హోమియోపతి సెమినార్లు, సిద్ధ యోగ ప్రాక్టీస్, మెడికల్ చెకప్‌లు, మెడికల్ ప్లాంట్స్, కౌన్సెలింగ్ సెషన్స్, ఇంట రాక్టివ్ సెషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, వేమన యోగా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజీ, ఆయుర్వేద కాలేజీలు, యునాని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఆయుష్ సంబంధింత సంస్థలు పాల్గొంటాయి. హెర్బల్ కుకింగ్, ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్, రెమెడీస్, హోమ్ ట్రీట్‌మెంట్ టెక్నిక్స్ నేర్పిస్తారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. అన్నీ ఉచితమే.
 
సంపూర్ణ ఆర్యోగం కోసమే..
అల్లోపతి మందులు వాడడంలో భారతీయులు ముందుంటారు. చిన్న జ్వరం వచ్చినా ఇంగ్లిష్ మందులను వారం పాటు వాడుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం మరింత పాడవుతుంది. అదే ఆయుర్వేద మందులు వాడితే ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. మన దగ్గరి నుంచి మూలికలు తీసుకెళ్లి ఇతర దేశాలు ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నాయి. మార్కెట్ కూడా చేస్తున్నాయి. ఆరోగ్యదాయకమైన ఈ ఆయుర్వేద మందులు మన దగ్గర వాడేది చాలా తక్కువ. అందుకే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆధునిక ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి థెరపీలను ఈ కన్వెన్షన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళుతున్నాం.     - డాక్టర్  రామ్.జి.రెడ్డి
 
అసలు చరిత్ర ఇదీ..

మన తెలుగు గడ్డ మీదనే ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన  డాక్టర్ రామ్ జి.రెడ్డి ఒత్తిడి నుంచి విముక్తితో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా ఎంతగానో ఉపకరిస్తుందని నమ్ముతారు. అమెరికాలోని వారికి కూడా ఆయన యోగా తరగతులు తీసుకుంటారు. యునాని, సిద్ధ యోగ, హోమియోపతి థెరపీలు కూడా తెలిసిన ఈయన యోగా ప్రచారానికి నడుం బిగించారు. గతేడాది డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి ‘జూన్ 21వ’ తేదీని ‘ఇంటర్నేషనల్ యోగా డే’గా ప్రకటించడం రామ్ రెడ్డిని ఆలోచింపచేసింది. ఒకరోజు మునక్కాడతో చేసిన రసాన్ని అమెరికన్ అమ్మడం చూశారు. ఇది తాగితే రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉండొచ్చని చెప్పడం గమనించారు. ఇది ఎక్కడి నుంచి తెచ్చారని అతన్ని అడిగితే భారత్ నుంచి తీసుకొచ్చామని సమాధానమిచ్చారు.

ఇండియాలో మునక్కాడను సాంబారులో మినహా పెద్దగా వాడారు. అలాంటి దాన్ని అమెరికా తెచ్చి డాలర్లలో వ్యాపారం చేయడం రామ్‌ను కదిలించింది. ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి మరెన్నో మొక్కల ప్రాశస్త్యాన్ని మనవారికి తెలియజెప్పాలనే సంకల్పంతో హైదరాబాద్‌లో ‘వరల్డ్ యోగా అండ్ ఆరోగ్య కన్వెన్షన్’ నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు తన స్నేహితుల సాయం తీసుకున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని, ప్రముఖులను కలిసి ఒప్పించారు. ‘అమెరికాలోనూ యోగా చేస్తారు. యోగాకు పుట్టినిల్లు అయిన మన దేశంలో ఇంకా దీనికి తగిన ఆదరణ లేకపోవడం చూసి నా వంతుగా యోగాను ప్రమోట్ చేయాలనుకున్నా. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు యోగ చికిత్స దొరుకుతుంది. ఆసనాలు, ఆయుర్వేదం, నేచురోపతి.. ఈ మూడింటి కలయికతో యోగా చికిత్స చేసుకోవచ్చు’ అని చెప్పారు రామ్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement