కాక్ టైల్. కామ్
మధువు గ్రోలెడు వేళ మత్తిల్లు వేళ
మనసు నిండు వేళ మరుల వేళ
వైనుతేయ! వినుము విశ్వమంత
ఆనంద నిలయమౌ అలతిగాను
మంచి మద్యం, మంచి పద్యం రసిక జనులెల్లరకూ ఆస్వాదయోగ్యాలు. పాతబడే కొద్దీ వాటి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. శ్రేష్ఠమైన మద్యానికి ఎప్పటికీ కాలం చెల్లదు. అలాగే, మంచి పద్యానికి కూడా. కవన మాధుర్యానికీ, మధుసేవనానికీ అవినాభావ సంబంధముంది. మంచినీళ్లు మాత్రమే తాగి బతికేసే వాళ్లు మన్నికైన కవిత్వం రాయలేరని ‘మదిరా’ంతకుడైన ఒక కవివరేణ్యుడి ఉవాచ. అంటే, మధువు గ్రోలనిదే మేలిమి కవన రచన సాధ్యం కాదనేది ఆయన కవిహృదయం. ఆంగ్ల కవిపుంగవుడు రాబర్ట్ లూయీ స్టీవెన్‌సన్ అయితే ఈ విషయంలో అద్వైత సిద్ధాంతి.
‘మధు’రోక్తి
నేనన్నీ పాత వాటినే ఇష్టపడతాను...
పాత మిత్రులు, పాతకాలం, పాత
మర్యాదలు, పాత పుస్తకాలు, పాత మధువులు
- ఆస్కార్ వైల్డ్, ఆంగ్లో-ఐరిష్ కవి, రచయిత
అందుకే, ఆయన మధువును సీసాలో బంధించిన కవిత్వంగా అభివర్ణించాడు. ప్రపంచంలోని మహా మహాకవులెందరో మధుపానాసక్తులే. మద్యంలోనైనా, పద్యంలోనైనా పస తేలాలంటే తన్మయత్వమే ప్రాతిపదికగా వాటిని అంచనా వేయాలి. తాగేటప్పుడు వెగటు పుట్టించేది మంచి మద్యమూ కాదు, చదివేటప్పుడు విసుగు పుట్టించేది మంచి పద్యమూ కాదు. ఈ సంగతి కళాత్మక కవిహృదయం గల ‘సురా’ర్చకులందరికీ అనుభవైకవేద్యమే! కళాత్మక ‘సురా’ర్చకుల కోసం ఈవారం...
స్పిరిటెడ్ ఫాంటసీ
స్పార్క్‌లింగ్ రెడ్‌వైన్: 100 మి.లీ.
బ్రాందీ : 30 మి.లీ.
కోకాకోలా : 100 మి.లీ.
దాల్చిన సిరప్ : 10 మి.లీ.
గార్నిష్ : చిటికెడు
జాజికాయ పొడి, నారింజ తొన
- వైన్‌తేయుడు