నవభారత నిర్మాతలు | Engineers Day | Sakshi
Sakshi News home page

నవభారత నిర్మాతలు

Published Mon, Sep 15 2014 3:36 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

డాక్టర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య - Sakshi

డాక్టర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య

 నేడు ఇంజినీర్స్ డే
 దేశాభివృద్ధిలో  ఇంజినీర్ల పాత్ర కీలకం
 ఇంజినీరింగ్ రంగంలో  ఉపాధితోపాటు, ప్రత్యేక గుర్తింపు  నైపుణ్యం ఉంటే ఉజ్వల భవిత

 ఏఎన్యూ (గుంటూరు):  అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇంజినీరింగ్ రంగ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, ఆరోగ్యం, విద్య తదితర అన్ని రంగాల్లోనూ ఇంజినీర్ల సేవలు తప్పనిసరి అయ్యాయి. ఇందుకు అనుగుణంగా మనదేశ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. ఈ రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇంజినీరింగ్ కోర్సు చదివే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. నైపుణ్యాలు పెంపొందించుకుని ఉజ్వల భవితను సొంతం చేసుకోవటంతోపాటు సమాజాభివృద్దిలో కీలకపాత్ర పోషించాలని భావి భారత ఇంజినీర్లకు నిపుణులు సూచిస్తున్నారు.
 
 మనదేశ తొలితరం శాస్త్రవేత్త,  శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ శక్తిని 19వ దశాబ్దంలోనే ప్రపంచానికి చాటిన డాక్టర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా  ఏటా మన దేశంలో సెప్టెంబర్ 15న ఇంజినీర్స్‌డే నిర్వహిస్తున్నారు. ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. హైదరాబాద్, ముంబై నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన సేవలు  ఎనలేనివి.  దేశాభివృద్ధికి అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఆయనను   భారతరత్నతో సత్కరించింది.  
 
 సమాజానికి ఉపయోగపడాలి..
 సమాజానికి ఉపయోగపడితేనే ఇంజనీరింగ్ వృత్తికి నిజమైన సార్ధకత చేకూరుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ఇంజినీర్లు ఉండగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇప్పటికీ దేశం గౌరవించటానికి ఆయన సేవలే కారణం. వృత్తిని సామాజిక బాధ్యతగా భావించిన ఘనత ఆయనకే దక్కుతుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను సక్రమమైన మార్గంలో భారతీయ సమాజానికి అందించాల్సిన బాధ్యత యువ ఇంజినీర్లపై ఉంది. ఇంజినీరింగ్ అంటే మంచి ఉద్యోగమనే భావనతోపాటు మంచి బాధ్యత అని కూడా గుర్తుంచుకుని ముందుకు సాగాలి.
 - ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపాల్, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజి

 జీవితాశయం..
 ఇంజినీర్‌ను అవుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా. బీటెక్ చదవాలనేది నా జీవితాశయం. నేడు ఉన్న పోటీ, మారుతున్న పరిజ్ఞానం దృష్ట్యా మంచి ఇంజినీర్ కావటం అంత సులభం కాదు. ఇంజినీరింగ్ విద్యను ఎంజాయ్ చేసి కేవలం కోర్సు పాసయ్యామనిపించుకుంటే తరువాత విధుల్లో రాణించటం వీలుకాదు. కాన్సెప్ట్‌ను డెవలప్ చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
 - కె.అజయ్, బీటెక్, ఏఎన్‌యూ కాలేజీ

 జాతి గర్వించాలి..
 ఇంజినీరింగ్ విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని జాతి గర్వించేలా ఎదగాలి. కేవలం  చదువుతోనే సంపూర్ణ ఇంజినీర్లుగా రూపొందలేరు. సామాజిక అవసరాలు, దేశాభివృద్ధికి దోహదం చేసే నూతన ఆవిష్కరణలు, పరిజ్ఞానం రూపకల్పన అంశాలను ఇంజినీర్లు అవగాహన చేసుకుని వాటిని అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవాలి. రానున్న రోజుల్లో ఇంజినీర్ల సేవలు దేశానికి చాలా కీలకం. దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్దులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ రంగంలోని మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.       
       - ఆచార్య పి.సిద్ధయ్య, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ డీన్
 
 ప్రజలకు ఏం కావాలో గుర్తించాలి..
 ఇంజినీర్ల నుంచి ప్రజలు, సమాజం ఏం కోరుకుంటుందనేది గుర్తించి దానికి అనుగుణంగా మసలుకోవాలి. సమాజంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానంతో కృషి చేయాలి. మంచి లక్ష్యం, ఉన్నతాశయంతో ముందుకు సాగితే నిరతంరం ప్రజాభిమానం చూరగొనవచ్చు. అన్ని రంగాల్లో సేవలు అందించే ప్రత్యేకత ఇంజనీర్లకే దక్కుతుంది. దానిని సద్వినియోగం చేసుకుని మంచి పేరుతెచ్చుకోవాలి.  
 - వి.కరుణాకర్, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఏఎన్‌యూ

 ఈ రంగానికి ప్రాధాన్యం..
 ఇంజనీరింగ్ విద్యార్థులు నామమాత్రపు పరిజ్ఞానంతో ఫీల్డ్‌లోకి వెళితే దీర్ఘకాలంగా ఆ రంగంలో నిలదొక్కుకోలేరు. నాది వ్యవసాయ కుటుంబం అయినా చిన్నప్పటి నుంచి నాకు ఇంజినీర్ కావాలనే బలమైన కోరిక ఉంది. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన అనంతరం నిబద్ధతతో సేవలు అందించేందుకు కృషి చేస్తా. భవిష్యత్‌లో ఈ రంగానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది.
 - బి.సత్యన్నారాయణ స్వామి,   బీటెక్ మెకానికల్, ఏఎన్‌యూ  

 రాణించవచ్చు..
 మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజినీర్లు మనదేశంలో పుట్టటం మన అదృష్టం. పాతకాలపు ఇంజినీర్లు కమిట్‌మెంట్‌తో పనిచేసేవారు. వారి కష్టానికి ప్రతి ఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంజినీరింగ్ రంగంలో గతానికి ఇప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. నిర్మాణం, విద్యుత్ తదితర రంగాల్లో నూతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పాతకాలపు ఇంజినీర్ల అనుభవాలు, వారి కమిట్‌మెంట్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే యువ ఇంజినీర్లు మంచిగా రాణించవచ్చు.
 - ఆచార్య రమణారావు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి,   ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీ
 
  ఇంజినీర్ల పనితనానికి మచ్చుతునక
 
 విజయపురిసౌత్:  ఇంజినీర్ల పనితనానికి మచ్చుతునక నాగార్జునసాగర్ ప్రాజెక్టు. మానవనిర్మిత దేవాలయంగా రూపుదిద్దుకున్న సాగర్ పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించినది. భారత ఇంజినీర్లు తమ ప్రతిభాపాటవాలతో నాగార్జునసాగర్ ఆనకట్టను నిర్మించి మట్టిలోనూ మాణిక్యాలు ఉన్నాయని ప్రపంచానికి చాటగలిగారు. ప్రపంచ సాంకేతిక లోకమే అబ్బురపడేలా అత్యధిక ఎత్తు, నిడివి గల ఈ డ్యాంను పూర్తిగా రాతితో నిర్మించారు. పుష్కరకాలం పాటు కార్మికులు, ఇంజినీర్లు నిర్విరామంగా చేసిన కృషి ఫలితంగా 1969 నాటికి డ్యాం నిర్మాణం పూర్తయింది. ప్రధాన డ్యాం ఇరుపక్కలా రెండు ఎర్త్‌డ్యాంలు నిర్మించారు. దేశంలోని  మేషనరీ డ్యాంలలో ఇది రెండవది. 590 అడుగుల ఎత్తులో ప్రాజెక్టుండగా 110 చదరపుమైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణసమయంలో 408.24టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కల్గి ఉండేలా నిర్మాణం జరిగింది. కాలక్రమేణా పూడిక నిండటంతో ప్రస్తుతం 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. 1955 సంవత్సరం డిసెంబర్10న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల కాలంలో ఒక కొలిక్కి వచ్చింది. 45 వేలమంది శ్రామికులు 24 గంటలు తమ శ్రమను ధారపోసి శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా సాగర్ ప్రాజెక్టును నిలిపారు. ఆనాడు పెద్దరాళ్లను సైతం క్యావింజర్లు ఎత్తుకొని డ్యాం పైవరకు వెళ్లేవారు.

1967లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం 1974లో క్రస్ట్‌గేట్ల నిర్మాణం పూర్తయింది. ఆనాటి ఇంజినీర్లు ఏలాంటి లాభాపేక్షలేకుండా కేవలం వేతనం కోసమేకాకుండా భారతదేశం అభివృద్ధికోసం పనిచేసేవారని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. నేడు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం కాని మిషనరీలు కాని ఆనాడు లేవు. కనీసం సమాచారాన్ని అందిపుచ్చు కోవడానికి కూడా నేడున్నన్ని అవకాశాలు లేవు. అయినా  ఆనాటి ఇంజినీర్లు బలమైన కోర్కె, పనిచేయాలనే తలంపు దీక్ష ఉండటంతో ప్రాజెక్టును సకాలంలో అంచనా వ్యయంకంటే తక్కువ వ్యయంతో పూర్తిచేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement