
ఇదే నా హీరోయిజం?
సినిమా ప్రపంచం పుట్టి ఎన్ని సంవత్సరాలైనా అందులోని పోకడలు మాత్రం రోజు రోజుకూ దిగజారుతూనే ఉన్నాయి. సమాజానికి ఏదో చేస్తున్నామని చెబుతున్నమన హీరోలు సినిమా వెనుకబాటుతనంలో తమ పాత్ర సమర్ధంగా నిర్వహిస్తునే ఉన్నారు. సినిమా పెద్దలు ఏమైనా చెబితేనే కదా సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేది. వాటి నుంచి మంచి అనేది మెల్లగా జనాల్లోకి వెళ్లినా.. చెడు అనేది మాత్రం చాలా తొందరగా ఫలితాన్ని చూపెడుతుంది. ఇదంతా చెప్పాల్సి రావడానికి కారణం మాత్రం సినిమాల్లో మెండుగా కనిపించే మద్యం సన్నివేశాలే.
మందు సన్నివేశాలంటే మహా ప్రాణమంటూ మన హీరోలు ఫోజులిస్తారు. అదేదో హీరోయిజంలా బిల్డప్ ఇస్తారు. మరి హీరోలు చెబితే.. మన కుర్రకారు ఊరుకుంటారా? అలానే ఫీలవుతూ హీరోలను మైమరిపిస్తారు. జల్సాలు, కిక్క్ లే జీవితానికి ప్రధానమని తమ జీవితాన్ని తప్పుడు మార్గంలో నెట్టుకుంటారు. ఇదే నా సినిమా నుంచి సమాజానికి ఇచ్చేది.
ఈ మధ్య వచ్చే సినిమాల్లో మద్యం సన్నివేశాలు లేకుండా తెరకెక్కడం లేదన్నది జనానికి తెలియంది కాదు. వీటిలో సన్నివేశాలతో ప్రేక్షకుడు ఎలా స్పందించాడు అనేది కాసేపు పక్కన బెడితే.. సమాజానికి సినిమా ఏం చేస్తున్నది అనేది మాత్రమే ప్రధానం. సమాజంపై సినిమా పోకడ చాలానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం.
కిక్కు అనేది సమాజానికి అవసరమా? కిక్కుతో ఏమైనా మార్పు వస్తుందా?అనేది ఆలోచిస్తే మాత్రం అవునని ఎవరంటారు?ఒకవేళ ఎవరన్నా 'ఎస్' అంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా పుట్టిందని వసంతాలు చేసుకుంటాం. హిట్ట్ అయితే పండుగ చేసుకుంటాం. ఇవన్నీ సినిమాను బ్రతికించడానికి మాత్రమే. మరి సమాజానికి ఏం చేశాం.. ఏం చేస్తున్నాం. అంటే మాత్రం కిక్తో ముందుకు తీసుకుపోతున్నామని చెబుదామా? ఈ అర్థ శతాబ్దపు అజ్ఞానంలో ఇంకా మనం కొట్టుమిట్టాడుతూనే ఉన్నామని గర్వపడదామా?