ప్రొఫెషనల్స్ సైతం విస్తుపోయేలా డ్యాన్స్. మోడల్స్‌కి దీటుగా ర్యాంప్‌వాక్. కనువిందు చేసే గెటప్స్. వన్స్‌మోర్ అనిపించే షాయరీలు. అన్నీ కలబోసిన ఈ కార్యక్రమాన్ని కండక్ ్టచేసింది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ‘హైఫై లైఫ్‌స్టైల్.. టైమ్ దొరికితే కాఫీషాప్స్... వీకెండ్స్‌లో పబ్స్!’ తమ మీదున్న ఇలాంటి అభిప్రాయానికి చెక్ పెడుతూ వీలు చేసుకుని మరీ ఈ ఈవెంట్ ద్వారా సోషల్ సర్వీస్ బాట పట్టారు టెకీ లు.
సేవే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసీ).. ఇంతకుముందు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఈ కల్చరల్ ఈవెంట్ రొటీన్‌కు భిన్నమైనది. రోజంతా కంప్యూటర్లకు స్క్రీన్స్‌కు కళ్లప్పగించే టెకీలు.. తమలోని సృజనను తట్టిలేపారు. ఆటపాటలతో అందరికీ కనువిందు చేశారు. కాలేజీ రోజుల్లో ఫ్రెషర్స్, ఫేర్‌వెల్ డేస్ అప్పుడు చేసిన అల్లరికి.. కొంచెం హుందాతనం, ఇంకొంచెం ప్రొఫెషనలిజం జోడించి పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇటీవల గంటన్నర పాటు జరిగిన యాన్యువల్‌లో ఏడాదంతా గుర్తుండిపోయే అభినయం చూపారు. అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) జనరల్ మైకేల్ ములిన్స్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఏడీపీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, డెలాయిట్, టీసీఎస్, ఐబీఎం... ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 200 కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాలు పంచుకొన్నారు. ఎవరికి ప్రావీణ్యమున్న కళల్లో వాళ్లు తమ సత్తా చూపించారు.
ఒక్కో థీమ్.. ఒక్కో తీరు..
ఒకరు శాస్త్రీయ సంగీతంలో ఓలలాడిస్తే... కొందరు కామెడీ స్కిట్స్ చేసి కడుపుబ్బా నవ్వించారు. డ్యాన్స్‌ల కోసం ప్రొఫెషనల్స్ తరహాలో కొరియోగ్రాఫర్స్ సహాయం తీసుకున్నారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఒకరు ఏంజల్, ఇంకొకరు వాల్ పెయింటింగ్, మరొకరు లగాన్ గెటప్.. ఇలా ఒక్కో థీమ్‌కు ఒక్కో తరహా డ్రెసింగ్‌తో అలరించారు. బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌కి స్టెప్పులు వేశారు. ఇక ఏడీపీ ఉద్యోగులు 12 మంది మెడ్లీ సాంగ్‌పై పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో స్టేజ్ మీదికి ఎంట్రీ ఇచ్చిన టీమ్ సభ్యులు.. ముఖాలపై డ్రాగన్ స్పార్క్‌లింగ్స్‌తో సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపించారు. ఇక క్యాపిటల్ ఐక్యూ నుంచి గ్రూప్ డ్యాన్స్ వీక్షకులను సైతం కాలు కదిపేలా చేసింది. ఇక అమ్మాయిల క్యాట్‌వాక్‌తో హొయలు పోతే.. అబ్బాయిలు ర్యాంప్‌పై మోడల్స్‌లా గాంభీర్యం ప్రదర్శించారు. ఒంటినిండా టాటూస్, ఫంకీ హెయిర్‌స్టైల్స్‌తో, హాలీవుడ్ హీరోస్‌తో పోటీ పడ్డారు. ఇలా ఎక్కడో మరచిపోయిన తమలోని టాలెంట్‌ను మరోసారి వెలికి తీసి ఓ వెలుగు వెలిగారు.
స్ట్రెస్ రిలీఫ్..
జాబ్ టెన్షన్స్‌కు చెక్ పెట్టడానికి టెకీలు ఈవెంట్స్‌ను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేసి తమ సత్తా చాటుతున్నారు. వచ్చామా.. చేశామా అన్నట్టు కాకుండా.. ఇందుకోసం నిపుణుల దగ్గర కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్స్ ఎంచుకోవడమే కాదు, రిహార్సల్స్‌లో చెమటోడ్చి.. వాటిని సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్నారు. డ్యాన్స్, ర్యాంప్‌వాక్‌లే కాదు.. కామెడీతో పాటు సామాజిక అంశాలపై స్కిట్స్ కూడా చేస్తున్నారు.
- సిరి
ఫండ్స్ ఫర్ రిలీఫ్: వందలాది కంపెనీలు ఎంతో ఉత్సాహంతో ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నాయి. ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడం సంతోషాన్నిస్తోంది. వచ్చిన స్పాన్సర్ ఫండ్‌ను అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలకోసం ఉపయోగిస్తునాం. ఈ ఈవెంట్ ఓ కాజ్‌కు ఉపయోగపడేదే కాదు, ఐటీ ఉద్యోగులకు తమ టాలెంట్ ప్రదర్శించే అవ కాశాన్ని కూడా కల్పించింది.
- రమేష్ లోకనాథన్, ప్రెసిడెంట్, హైసీ
హైటెక్ కళాపోషణ
Published Thu, Feb 12 2015 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM
Advertisement