నడుంనొప్పి ఆయుర్వేద చికిత్స | Ayurvedic treatment for Waist pain | Sakshi
Sakshi News home page

నడుంనొప్పి ఆయుర్వేద చికిత్స

Published Sun, Oct 26 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

నడుంనొప్పి ఆయుర్వేద చికిత్స

నడుంనొప్పి ఆయుర్వేద చికిత్స

నేటి జీవన విధానంలో ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం.. అంటే రాత్రివేళ నిద్ర పోకపోవడం, పగటిపూట నిద్రపోవడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది నడుంనొప్పి. ఈ రోజుల్లో 40 ఏళ్లకే నడుంనొప్పి వస్తోంది. ఆయుర్వేద శాస్త్రం నడుంనొప్పికి ‘గృధ్రసీవాతం’గా నామకరణంచేసింది. తొంభైశాతం మంది తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నడుంనొప్పి బారినపడతారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమయింది.
 
కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయడం, ద్విచక్ర వాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు.. ఈ కారణాల వల్ల వాత ప్రకోపం ఏర్పడి, ముందుగా పిరుదులపై భాగాన స్తబ్థతను, నొప్పిని కలిగించి ఆ తరువాత నడుంభాగం, ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి వస్తుంది.
 
డిస్కులో వచ్చేమార్పులు: వెన్నుపూసల మధ్య ఉంటే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడం, డిస్కుకి రక్తప్రసరణ సరిగా లేకపోవడం, డిస్కు అరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది
 
లక్షణాలు: నడుంనొప్పి, వాపు, కాస్త శ్రమించినా సూదులతో గుచ్చినట్లుగా నొప్పి తీవ్రం కావడం, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.
 
ఆయుర్వేద చికిత్స: నడుంనొప్పి సమస్యకు ఆయుర్వేద శాస్త్రం సూచించిన సమగ్రమైన చికిత్సాపద్ధతుల్లో నిదాన పరివర్జనము, శమన చికిత్స, శోధన చికిత్స అని మూడు ప్రధానమైనవి ఉన్నాయి.
 
శమన చికిత్సలు: వ్యాధి తాలూకు దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ బలాన్ని బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు వంటి ఔషధాలు రోగికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ శమన చికిత్స వల్ల ఒక్కోసారి ప్రకోపించిన దోషాలు మళ్ళీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీవ్రతను బట్టి శమన చికిత్సలతోపాటు కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం.
 
కటివస్తి:  ఇది ఆయుర్వేదంలోని ఒక విశిష్ఠ ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థి (కార్టిలేజ్)కి రక్తప్రసరణ పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది.
 
వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ చికిత్స అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ వస్తికర్మ చిన్న పేగులు, పెద్దపేగులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు.
 
జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం ముఖ్యం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుంనొప్పి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
డా.మనోహర్ ఎం.డి(ఆయుర్వేద)
స్టార్ ఆయుర్వేద

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement