సాక్షి,న్యూఢిల్లీ: నైన్ టూ ఫైవ్ జాబ్‌లు, ఏటా బోనస్, బోలెడన్ని లీవ్‌లు ఇవన్నీ ఇక తీపిగుర్తులుగా మారనున్నాయి. మారుతున్న వ్యాపార ధోరణులు, విపరీతంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు నియామక వ్యూహాలను మార్చేస్తున్నాయి. ఆటోమేషన్ వంటి నూతన టెక్నాలజీలకు మళ్లుతున్న క్రమంలోనూ నియామక ప్రక్రియ రూపురేఖలు మారుతున్నాయి. శాశ్వత ఉద్యోగులు, నాలుగైదేళ్ల కాలపరిమితితో కూడిన కాంట్రాక్టు నియామకాలకు కంపెనీలు స్వస్తి పలకనున్నాయి. అవసరమైనప్పుడు హైరింగ్ ఆ తర్వాత ఫైరింగ్ విధానానికి సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.
ఇప్పటికే భారత్‌లో 56 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకున్నాయని కెల్లీఓసీజీ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. రానున్న రెండేళ్లలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని 71 శాతం కంపెనీలు యోచిస్తున్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. అత్యవసర, తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీల్లో చోటుచేసుకుంటున్నాయి.
ఈ పద్ధతిలో ఆయా సంస్థలు డిమాండ్‌ను అనుసరించి ఆయా ప్రాజెక్టులు, సైట్‌పై అత్యవసర, తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. తమ అవసరం తీరిన తర్వాత సదరు ఉద్యోగులను సాగంపుతాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కలిగిన పనివేళలుండటంతో ఫ్రీల్యాన్సర్లుగా సేవలందించేందుకు ఉద్యోగులూ ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment