రంగులు పండుగ హోలీ అంటే ఇష్టపడని వారుండరు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సాగే రంగుల కేళీ ఆడేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువతీ యువకులు రంగుల్లో తడిచిముద్దవుతారు. వెండి తెరపై కూడా హోలీకి సముచిత స్థానం కల్పించారు. రంగుల లోకంలో రంగుల పండుగకు పెద్దపీటే వేశారు. సినిమాల్లో హుషారుగా సాగిపోయే హోలీ పాటలు ప్రేక్షకులు ఆదరించి పట్టం కట్టారు. సమకాలిన సినిమా పాటల్లో హోలీ ప్రస్తావన పరిపాటిగా మారిందంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో ముందుగా వస్తుంది హోలీ రంగుల పాట. ‘రంగు రపరప అంటోంది రంగుబర్సే’ అంటూ హుషారైన స్టెప్పులతో రంగులు జల్లుకుంటూ సాగిపోతుందీ పాట. ‘కొట్టు కొట్టు కొట్టు...రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ 'మాస్' చిత్రంలో నాగార్జున ఆడిపాడారు. తనకెంతో పేరు తెచ్చిన 'ఖుషీ' సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా 'హోలీ... హులీల రంగ హెలీ' అంటూ స్టెప్పులేశారు. 'మురారి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ పాటలో రంగుల్లో మునిగి తేలాడు. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర'లో తన కుటుంబ సభ్యులతో హోలీ ఆడే సీన్ కన్నులపండువ ఉంటుంది. ఉదయ్‌కిరణ్-రిచా చావ్లా జంటగా ‘హోలీ’ పేరుతో ఓ ప్రేమకధా చిత్రమే వచ్చింది.
ఉత్తరాది వారు ఘనంగా జరుపుకునే హోలీకి బాలీవుడ్ కూడా పెద్దపీట వేసింది. నాటి షోలే నుంచి నేటి రామ్ లీలా వరకు రంగుళ కేళీని ఏదో ఒక సందర్భంలో తెరపై ఆవిష్కరిస్తూనే ఉంది. ఆన్,కోహినూర్, గోదా, కటీ పతంగ్, సిల్సిలా సినిమాల్లో హోలీ పాటలు ప్రజాదరణ పొందాయి. మదర్ ఇండియా, షోలే సినిమాల్లో కీలక సన్నివేశాల్లో వచ్చే హోలీ పాటలు కథను ముందుకు నడిపించడంలో దోహదపడ్డాయి. నాటి నుంచి నేటి వరకు వెండితెరపై రంగుల పాటల వన్నె తరగలేదు. కొత్త సినిమాల్లోనూ హోలీ పాటలు వస్తూనే ఉన్నాయి. ఇకముందు కూడా వస్తుంటాయి. ఎందుకంటే పండుగ మాత్రమే కాదు ఆనందాల కేళీ!
వెండి తెరపై వన్నె తరగని రంగేళీ
Published Mon, Mar 17 2014 11:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement