నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్..
జాతీయం
వారణాసి - ఖాట్మండు బస్ సర్వీస్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మార్చి 4న వారణాసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు బస్ సర్వీసును ప్రారంభించారు. భారత్ - నేపాల్ మైత్రి బస్ సేవ పేరుతో దీన్ని ఆరంభించారు.
కేంద్రమంత్రి దాన్వే రాజీనామా
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దాదారావు దాన్వే మార్చి5న పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దాన్వే ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ నియమావళికి అనుగుణంగా పదవి నుంచి తప్పుకున్నారు.
రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విధాన సమీక్షతో సంబంధం లేకుండా మార్చి 4న రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో ఇది 7.75 నుంచి 7.5 శాతానికి తగ్గింది. రెపో రేటుతో ముడిపడిన రివర్‌స రెపో రేటు కూడా 6.5 శాతానికి తగ్గింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని యథాతథంగా 4 శాతం వద్ద కొనసాగించింది. రెపో రేటు తగ్గడం వల్ల గృహ, వాహన, రిటైల్ రుణాలపై నెలవారీ వాయిదాల చెల్లింపు (ఈఎంఐ) తగ్గనుంది.
నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్
అమెరికా కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ మార్చి 3న విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాల జాబితా ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్‌ట - 2015’లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 138వ స్థానంలో ఉంది. 440 నగరాల్లో జీవన ప్రమాణాలను పరిశీలించి 230 నగరాలకు ర్యాంకులు కేటాయించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో, జూరిచ్ (స్విట్జర్లాండ్) రెండో స్థానంలో, ఆక్లాండ్ (న్యూజిలాండ్) మూడో స్థానంలో ఉన్నాయి. పుణే 145, బెంగళూరు 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్‌కతా 160 స్థానాల్లో నిలిచాయి.
అమెరికాలో భారత రాయబారిగా అరుణ్‌సింగ్
అమెరికాలో భారత రాయబారిగా అరుణ్‌కుమార్ సింగ్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్చి 8న నియమించింది. 1979 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఫ్రాన్‌సలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. 2015 జనవరిలో ఎస్.జయశంకర్ విదేశాంగ కార్యదర్శిగా నియమితులవడంతో ఈ స్థానానికి అరుణ్ కుమార్ సింగ్‌ను ఎంపిక చేశారు.
1200 దాటిన స్వైన్ ఫ్లూ మరణాలు
దేశంలో 2015 మార్చి 4 నాటికి స్వైన్ ఫ్లూ వల్ల మరణించిన వారి సంఖ్య 1239కి చేరుకుంది. వ్యాధి సోకిన వారి సంఖ్య 23,153కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా గుజరాత్‌లో 300, రాజస్థాన్‌లో 295, మహారాష్ట్రలో 178, మధ్యప్రదేశ్‌లో 174 మంది మరణించారు. తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది మరణించారు.
ముస్లిం కోటాను రద్దు చేసిన మహారాష్ట్ర
ముస్లింలకు విద్యా సంస్థల్లో కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 5న రద్దు చేసింది. ఇప్పటికే విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందిన వారికి అవి వర్తిస్తాయని పేర్కొంది. 2014 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికలకు ముందు అప్పటి ఎన్‌సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. కోర్టు మరాఠా రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసి, ముస్లింలకు విద్యా సంస్థల్లో అనుమతినిచ్చింది.
జర్నలిస్టు వినోద్ మెహతా మృతి
ప్రముఖ జర్నలిస్టు, రచయిత వినోద్ మెహతా (73) అనారోగ్యంతో న్యూఢిల్లీలో మార్చి 8న మరణించారు. ఔట్‌లుక్ మేగజీన్ వ్యవస్థాపక సంపాదకుడైన మెహతా సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయనీర్ లాంటి పత్రిక,
మేగజీన్లను నడిపారు. 1995లో ప్రారంభించిన ఔట్‌లుక్ మేగజీన్‌కు 17 ఏళ్లపాటు ప్రధాన సంపాదకుడుగా పనిచేసి 2012లో రిటైరయ్యారు. ‘లక్నోబాయ్’ పేరుతో
2011లో స్వీయ చరిత్రను ప్రచురించారు.
అవార్డులు
వీరప్ప మొయిలీకి సరస్వతీ సమ్మాన్ అవార్డు
కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన రామాయణ మహాన్వేషణనకుగాను ఈ అవార్డు దక్కింది. 2007లో తొలిసారి కన్నడ భాషలో ఈ పద్య రచన ప్రచురితమైంది. తర్వాత ఇది ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లోకి అనువాదమైంది. 1991 నుంచి కేకే. బిర్లా ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. దీని కింద ప్రశంసా పత్రంతో పాటు రూ. 10 లక్షల నగదు బహూకరిస్తారు.
సినారెకు సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం
ప్రముఖ కవి, రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం లభించింది. ప్రముఖ రచయితలకు అత్యున్నత ఫెలో పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ప్రకటిస్తుంది. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, 1999లో గుంటూరు శేషేంద్రశర్మకు, 2004లో భద్రిరాజు కృష్ణమూర్తికి ఈ పురస్కారం దక్కింది.
ఆర్.శాంతకుమారికి అనువాద పురస్కారం
రచయిత్రి ఆర్. శాంతకుమారికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ప్రకటించింది. ఈమె ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కమార్తె. ప్రేమ్‌చంద్ (హిందీ రచయిత) ఆత్మకథను తెలుగులోకి అనువదించినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం లభించింది.
క్రీడలు
మానవ్‌జిత్‌కు ప్రపంచ షాట్‌గన్ టోర్నీలో కాంస్యం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య నిర్వహించే ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నమెంట్‌లో భారత షూటర్ మానవ్‌జిత్ కాంస్య పతకం సాధించాడు. మార్చి 3న మెక్సికోలో జరిగిన ట్రాప్ ఈవెంట్ ఫైనల్‌లో మానవ్‌జిత్ మొదటి స్థానంలో నిలిచి ఉంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత దక్కేది.
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ ఓటమి చెందినప్పటికీ ఈ స్థాయికి చేరిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మార్చి 8న బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ను కరోలినా ఆరీన్ (ఫ్రాన్‌స) ఓడించింది. గతంలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన ప్రకాశ్ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్ (2001) గెలుచుకున్నారు.
మహిళల డబుల్స్ టైటిల్‌ను బావో యిక్సిన్, టాంగ్ యుయాంటింగ్ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్‌లో వాంగ్ గ్జియోలీ, యుయాంగ్ (చైనా)లను ఓడించారు.
పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాన్ జోర్గెన్‌సన్ (డెన్మార్‌క)ను ఓడించి చెన్‌లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మాథియాస్ బోయి, కార్‌సటన్ మొగెన్సన్ (డెన్మార్‌క) గెలుచుకున్నారు. వీరు ఫైనల్‌లో ఫు హైఫెంగ్, జాంగ్‌నన్ (చైనా)ను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను జాంగ్‌నన్, జావో యున్‌లీ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్‌లో టోంటోవీ అహ్మద్, లియానా నస్టిర్ (ఇండోనేషియా)ను ఓడించారు.
రాష్ట్రీయం
తెలంగాణలో నేర బాధితుల పరిహార పథకం
రాష్ట్రంలో నేరాల వల్ల నష్టపోయినవారికి, వారిపై ఆధారపడిన కుటుంబాలకు పరిహారం అందించడానికి ఉద్దేశించిన నిధిని ఏర్పాటు చేస్తూ మార్చి 7న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేర బాధితుల పరిహార పథకం- 2015 పేరుతో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక నిధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 2008లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం నేర ఘటనల బాధితులకు పరిహారం చెల్లించేందుకు అన్ని రాష్ట్రాలు ఒక పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. సంవత్సరానికి రూ. 4.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపు దారులకు వర్తించదు. ఈ పథకం కింద ప్రాణ నష్టం జరిగితే వయసును బట్టి రూ.1 లక్ష నుంచి రూ. 3 లక్షలు, శాశ్వత వైక్యలం కలిగితే రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు, పాక్షిక వైకల్యానికి రూ. 25 వేల నుంచి లక్ష వరకు, యాసిడ్ దాడిలో వైకల్యానికి రూ. 3 లక్షలు, అత్యాచారం జరిగితే రూ. 2 లక్షలు, వేధింపులు, మనుషుల అక్రమ రవాణా, కిడ్నాప్ తదితర ఘటనల బాధితులకు రూ. 50 వేలు చెల్లిస్తారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ మార్చి 7న ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ ఆ రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి అదే రోజు ప్రసంగించారు.
అంతర్జాతీయం
చట్టసభల్లో రెండింతలైన మహిళల ప్రాతినిధ్యం
ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 20 ఏళ్లలో రెండింతలు పెరిగిందని ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) మార్చి 5న తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 22.1 శాతం పార్లమెంటరీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. ఇది 1995 లో 11.3 శాతంగా ఉండేది. సబ్ - సహారా ఆఫ్రికన్ దేశాల సభల్లో అధికంగా మహిళలు ఉన్నారు. రువాండాలో అత్యధికంగా 3.8 శాతం మంది ఉన్నారు. తర్వాత స్థానాల్లో బొలీవియా, అండోర్రా ఉన్నాయి. స్వీడన్ ఆరో స్థానంలో ఉంది. కోటా విధానం వల్ల మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇది 120 దేశాల్లో అమలవుతోందని ఐపీయూ పేర్కొంది.
ఎలక్ట్ట్రిక్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు
ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్ట్రిక్‌తో పనిచేసే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కాలిఫోర్నియాలోని కేప్ కెనరావల్ నుంచి మార్చి 1న ప్రయోగించారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ (స్పేస్ ఎక్స్) ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిని కక్ష్యలోకి చేర్చడానికి రాకెట్ థ్రస్టర్ల బదులుగా ఎలక్ట్ట్రిక్ ఇంజన్లను ఉపయోగించారు. ఇవి రెండు దశాబ్దాలపాటు పనిచేస్తాయి. తక్కువ బరువు ఉండటం వల్ల ఈ రెండు ఇంజన్లను ఒకేసారి ప్రయోగించడానికి వీలుంటుంది. ఇవి భూస్థిర కక్ష్యలోకి చేరేందుకు కొన్ని నెలలు పడుతుంది. వీటిని బోయింగ్ సంస్థ ఫ్రాన్‌సలోని ఇయుటెల్‌శాట్, ఆసియా బ్రాడ్ కాస్ట్ శాటిలైట్‌ల కోసం నిర్మించింది.
భారత్ -స్పెయిన్ రక్షణ ఒప్పందం
రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించుకునేందుకు భారత్, స్పెయిన్ మధ్య న్యూఢిల్లీలో మార్చి 5న సంతకాలు జరిగాయి. స్పెయిన్ రక్షణ మంత్రి పెడ్రో మోరెమ్స్, భారత్ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత్ ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి నిర్దేశించిన పి-751 ప్రాజెక్టులో భాగం పంచుకోవడానికి స్పెయిన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
నాలుగు నక్షత్రాల గ్రహం గుర్తింపు
అమెరికన్ శాస్త్రవేత్తలు నాలుగు నక్షత్రాల వ్యవస్థలో భారీ గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమికి 136 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రాల వ్యవస్థ పేరు 30 అరి. ఇందులోని వాయుగ్రహం గురు గ్రహం కంటే 10 రెట్లు పెద్దగా ఉంది. శాన్ డిగోలో పాలోమార్ అబ్జర్వేటరీలోని టెలిస్కోప్ ద్వారా ఈ వ్యవస్థను గుర్తించారు. సాధారణంగా ఒక్కో గ్రహ వ్యవస్థకు ఒకే మాతృ నక్షత్రం ఉంటుంది. నాలుగు నక్షత్రాల గ్రహాన్ని కనుగొనడం ఇది రెండోసారి. మొదట గుర్తించిన గ్రహాన్ని కేఐసీ 4862625 పేరుతో పిలుస్తున్నారు.