బెస్ట్ సిటీ
అందంలో, ఆటలో, ఫ్యాషన్‌లో ఆమె ఓ ఐకాన్.. భారత మహిళా టెన్నిస్ మణిపూస. నవాబుల నగరానికి నగిషీలుగా చెప్పుకోదగ్గ కొద్దిమంది జాబితాలో ఈ స్టార్ స్థానం ఎన్నటికీ పదిలం. మా హైదరాబాదీ అని అందరూ గర్వంగా చెప్పుకోగల ఆ సెలబ్రిటీయే సానియా మీర్జా. భాగ్యనగరంతో తనకున్న అనుబంధం, అల్లుకున్న జ్ఞాపకాలను ఆమె ‘సిటీప్లస్’తో పంచుకుంది. విశేషాలు సానియా మాటల్లోనే..
హైదరాబాద్ సానియా మీర్జా
హైదరాబాద్‌లో ప్రతీది నాకు నచ్చే అంశమే. ఇక్కడ కాకుండా మరో చోట ఉండాలనుకోవడం నాకు సాధ్యం కాని విషయం. టోర్నీల మధ్య వారం రోజుల విరామం వచ్చినా నేను వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, జనం, ఆహారం.. అంతా బాగుంటుంది. నగరంలోని వెస్ట్ అండ్ ఈస్ట్ మిక్స్‌డ్ కల్చర్ నాకు చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ది బెస్ట్ సిటీ’ అంటాను.
చాలా మారిపోయింది..
గతంతో పోలిస్తే సిటీ చాలా మారిపోయింది. ముఖ్యంగా అవుటర్ రింగ్‌రోడ్‌తో పాటు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. నాకు తెలిసిన చాలా మంది విదేశీయులకు హైదరాబాద్ అంటే తేలిక భావం ఉండేది. కానీ ఈ మధ్య వారు ఇక్కడి అభివృద్ధి చూశాక తమ అభిప్రాయం మార్చుకున్నారు. నా దృష్టిలో ఇక్కడ పెద్దగా సమస్యలు లేవు.
కబాబ్ చాలా ఇష్టంగా తినేవాళ్లం
ఠంచనుగా వీకెండ్‌సలో ట్యాంక్‌బండ్‌కు ఫ్యామిలీతో వెళ్లేవాళ్లం. అక్కడ లభించే కబాబ్స్ మేం చాలా ఇష్టంగా తినేవాళ్లం. సినిమాలాంటి సరదాలు పెద్దగా లేవు. టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత బయట తిరిగే ధైర్యం చాలా కాలం పాటు చేయలేకపోయాను.
రంజాన్ ప్రత్యేకం
ఈ మాసంలో ఇక్కడ కనిపించే ఆధ్యాత్మిక వాతావరణం, రోజాలు, ఇఫ్తార్ పార్టీలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రపంచంలో మరో చోట ఇలాంటివి చూడలేం. ప్రొఫెషనల్‌గా మారాక రంజాన్‌లో ఇక్కడ ఉండే అవకాశమే చాలాసార్లు రావట్లేదు. ఈసారి కూడా పండగకు మూడు రోజుల ముందే అమెరికా వెళ్లిపోతున్నాను. చిన్నప్పుడు రంజాన్‌లో తప్పనిసరిగా లాడ్‌బజార్‌కు వచ్చి గాజులు, దుస్తులు కొనడం నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నేను వెళ్లి షాపింగ్ చేయలేను కానీ, ఇతర అమ్మాయిల్లాగే నేను కూడా వాటిని బాగా ఇష్టపడతాను.
ప్రైవసీ ఉండేచోటే..
ఎక్కడైతే ప్రైవసీ ఉంటుందో, మీడియా సమస్య ఉండదో అక్కడికే వెళ్తాను. ఎందుకంటే ఎవరితో వెళ్లాం, ఏం తిన్నాం వంటివి కూడా కొంతమంది రాయాలని ప్రయత్నించడం చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నగరంలో పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. తరచుగా ఎన్ గ్రిల్‌కు వెళుతుంటాను. తాజాగా నా ఫేవరేట్ ఈటింగ్ స్పాట్ అదే.
టెన్నిస్ వదిలేస్తే...
కామెంటేటర్‌గా వెళ్తానేమో.. కొన్నాళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో రిస్ట్రెట్టో పేరుతో నా చెల్లెలితో కలిసి కాఫీ షాప్ ప్రారంభించే ప్రయత్నం చేశాను. ఇక ఆరంభమే తరువాయి అనుకున్న సమయంలో ఆ స్థలం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే హైదరాబాద్‌లోనే మరొకటి ఏదైనా చేస్తాను.
ముసుగేసుకుని..
ఇన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఒకే ఒక్కసారి నా మనసుకు నచ్చిన విధంగా ఓ సాహసం చేశాను. గత ఏడాది రంజాన్‌లో నా ముఖానికి మొత్తం దుపట్టా కట్టుకొని కొంత మంది ఫ్రెండ్స్‌తో చార్మినార్ వెళ్లాను. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. సాయంత్రం నుంచి దాదాపు రాత్రి వరకు చార్మినార్ పరిసరాలు అంతా తిరిగాను. పూర్తిగా ముసుగు ఉండటంతో నన్నెవరూ గుర్తు పట్టలేదు. చివరకు ఒక హోటల్‌కు వెళ్లాం. రాత్రి 2 గంటల సమయంలో అక్కడ హలీమ్, పాయా వంటివి తినడం చాలా స్పెషల్‌గా అనిపించింది.