ఆ ఠీవి.. ఆకాశమంత | Jhansi ki Rani: Great history of the record Charminar spot in hyderabad | Sakshi

ఆ ఠీవి.. ఆకాశమంత

Published Fri, Aug 8 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

ఆ ఠీవి.. ఆకాశమంత

ఆ ఠీవి.. ఆకాశమంత

చిన్నప్పుడు మలక్‌పేట్‌లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చార్మినార్‌ను చూసినా.. ఆ రూపం నా మనసులో ముద్రేసుకుంది మాత్రం నా ఏడేళ్ల వయసులో, స్కూల్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు. కలువల నగిషీలు..

ఝాన్సీకీ వాణి:  కలం పట్టి కాలమిస్టుగా కొత్త అవతారం కదా!
 ఏది ముందు రాయాలి.. ఏది తర్వాత అన్న సందిగ్ధంలో వెన్నుతట్టి ప్రోత్సహించింది చార్మినార్!
 చార్మినార్.. హైదరాబాద్ అస్తిత్వ పతాక!
 చరిత్రకు సాక్ష్యం.. సంస్కృతికి చిహ్నం!!
 కారు చార్మినార్ వైపు కదిలింది.
 నా మనసు బాల్యంలోకి పరుగెత్తింది.

 
 చిన్నప్పుడు మలక్‌పేట్‌లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చార్మినార్‌ను చూసినా.. ఆ రూపం నా మనసులో ముద్రేసుకుంది మాత్రం నా ఏడేళ్ల వయసులో, స్కూల్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు. కలువల నగిషీలు.. గంభీరమైన గుమ్మటాలు.. సున్నపు గోడల నునుపుతో లేత పసుపు రంగులో ఠీవిగా నిలబడ్డ ఆ రూపం నా కళ్లల్లో నిలిచిపోయింది. మినార్లలోని మలుపుల మెట్లు ఎక్కి మొదటి అంతస్తు నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపించేస్తుందనుకున్న అమాయకత్వం.. అప్పుడు కొనుక్కున్న గాజులు.. కొనుక్కోలేకపోయిన బైనాక్యులర్స్.. గుర్తుల తడి ఇంకా ఆరిపోలేదు!
 
 ఎప్పుడూ అదే ఠీవి
 నేను వాస్తవంలోకి వచ్చేసరికి నా కారు చార్మినార్‌కు పహారా కాస్తున్న పోలీస్‌స్టేషన్ ముందు ఆగింది. కారు దిగి ఒక్కసారి చుట్టూ చూస్తే.. మొన్ననే వెళ్లిన బోనాల పండుగ పసుపుదనం.. రంజాన్ ఆకుపచ్చదనం పెనవేసుకున్నట్టు కనిపించాయి! నా చిన్నప్పుడు అంతెత్తున రాజసంగా కనబడిన చార్మినార్ ఇప్పుడు ఇంత చిన్నగా కనబడుతోందేంటీ? రెండడుగులు ముందుకేశా. వాహనాలు.. తోపుడుబండ్లు.. జనాలు.. ఒకరినొకరు తోసేసుకుంటూ ఆ చార్మినార్ పక్కనే తిరుగుతున్నారు. కానీ, నాలుగు శతాబ్దాల చరిత్ర పక్కనే ఉన్నామన్న స్పృహ ఏదీ..? చార్మినార్ ఓ పాత భవనంలా మిగిలిపోయిందా..? కెమెరాల్లో కన్నుదూర్చి క్లిక్ మనిపిస్తున్న టూరిస్ట్‌లు.. చార్మినార్ వైభవాన్ని చాటుతున్న దూతల్లా కనిపించారు! బాల్యంలో కళ్లలోని మెరుపుతో చూసిన చార్మినార్ ఈ రోజు చిన్నగా కనపడటానికి  కారణం నేను చూసిన ‘చిన్నచూపు’ అని అర్థమయింది. ఇవేవీ పట్టని ఆ కట్టడానిది ఎప్పుడూ అదే ఠీవి! ఇంతలోకే ఒకటే హారన్ల కూత.. ఆ రాజసం చుట్టూ మూగిన ఈగల మోతలా! ఇంకా నయం.. ఇప్పుడు ట్రాఫిక్‌కి నేను అడ్డు. ఇంకొన్నేళ్లు పోతే చార్మినారే రోడ్డుకి అడ్డంగా ఉందని అడ్డంగా వాదించేవాళ్లు తయారవుతారేమో!
 
 చార్మినార్ టు హైటెక్ సిటీ
 హైదరాబాద్ ఎంతో విస్తరించింది. ఈ మహానగరంలో దారులన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. మూసీకి అటు, ఇటూ చాలలేదని.. సైబరాబాద్‌నీ సృష్టించుకున్నాం. తనను మరచి మిగిలిన సిటీ చుట్టూ పెనవేసుకుంటున్న హైటెక్ వృద్ధిని చూసి తబ్బిబ్బవుతోందా.. చార్మినార్? ఒక్కసారైనా వెనక్కి చూస్తే కదా.. చార్మినార్ ఉబ్బిందా, తబ్బిందా.. మసిబారిందా, పెచ్చులూండిదా తెలియడానికి! ఇరానీ కేఫ్‌ల మధ్య ప్రత్యక్షమైన మోడర్న్ కాఫీ డేలు.. లాడ్ బజార్‌ని మరిపించే బిగ్ బజార్‌లు.. అడుగు జాగా లేకుండా..  క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న ట్రాఫిక్ రద్దీ.. కేవలం ఓల్డ్ సిటీ లోకల్ సమస్యలు కాదు! చార్మినార్‌ను పాదచారుల ప్రాంగణంలా మార్చాలనే ప్రాజెక్ట్‌కు పట్టిన చెదలు!
 
 నా స్వరం..
 ఢిల్లీలో కుతుబ్‌మినార్ చుట్టూ కుతుబ్ కాంప్లెక్స్‌ని కట్టి అక్కడి ఇతర కట్టడాలన్నింటినీ పర్యాటక క్షేత్రాల్లా మార్చినట్టు.. మన దగ్గరా చార్మినార్‌ని మదీనా టు చౌమొహల్లా దాకా ఓ గొప్ప చారిత్రక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న చార్మినార్ పెడస్ట్రియన్ ప్రాజెక్ట్ బూజు కొట్టుకుపోయింది. పదిహేనేళ్ల కిందట 140 కోట్ల అంచనాతో పునాదిరాయేసుకున్న ఆ ప్రణాళిక, ఇప్పుడు 400 కోట్ల వ్యయానికి ప్రయాసపడుతోంది. పాదచారుల దారి గుల్జార్‌హౌస్ నుంచి ఒకవైపే పూర్తయి.. మరికొన్ని గల్లీల్లో నత్తనడకన సాగుతోంది. దీనికోసం ఇప్పటిదాకా అయిన ఖర్చు వంద కోట్లు. మిగిలిన మూడువందల కోట్ల కథను కోర్టులు వింటున్నాయి. ఇది ఎప్పుడు పూర్తవుతుందో! మన చార్మినార్‌కి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా ఎప్పుడొస్తుందో? గత ఇరవై ఏళ్లుగా గోల్కొండకోట, ఖుతుబ్ షాహీ టూంబ్స్‌తో పాటు చార్మినార్ పేరునీ యునెస్కోకి పంపిస్తూనే ఉంది మన రాష్ట్రం. వాళ్లూ సందర్శనకి వస్తూనే ఉన్నారు. కానీ ప్రపంచ హోదా మాత్రం ఖరారు కాలేదు ఇంతవరకు.
 
 కారణం.. చార్మినార్ చుట్టూ ఉన్న గందరగోళం.. అస్తవ్యస్త వాతావరణం! గోల్కొండ కోటనీ, కుతుబ్ షాహీ టూంబ్స్‌నీ పరిరక్షించిన ప్రభుత్వాలు చార్మినార్ విషయంలో ఏమీ చేయలేకపోయాయి. చార్మినార్ వల్లే మిగతావాటికీ ప్రపంచ హోదా రాలేదని ఈ రోజంతా వేలెత్తి చూపిస్తుంటే, సిగ్గుపడాల్సింది చార్మినార్ కాదు.. ఆ పరిస్థితికి కారణమైన మనం! నాలుగు వందల ఏళ్లలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. చార్మినార్ చెక్కుచెదరలేదు. కానీ ఈ 50 ఏళ్లలో మాత్రం కాలుష్యంతో మసిబూసాం, హారన్ల హాహాకారాలతో బీటలు వార్చాం, ఈ ఘనత మన తరానికే చెల్లింది. ఇప్పుడు మూర్ఖత్వపు అడ్డుగోడలతో వారసత్వ సంపద హోదా రాకుండా అడ్డుతగులుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి రాజముద్రలో కాకతీయ  తోరణంతో పాటు చార్మినార్‌ని చేర్చినందుకు సంతోషమే. అయితే ఇంతటితో ఆగొద్దు.. ఆ పేరు ప్రపంచ హోదా కింద మార్చే ప్రయత్నం జరగాలి. ఇలా కోరుకుంటున్న కోట్ల గళాల్లో నాదీ ఒక స్వరం. వందల ఏళ్ల చారిత్రక వైభవం ఉండీ చరిత్రహీనులం కావద్దు. చక్కని చార్మినార్ ఒళ్లో కూర్చోని హైదరాబాద్ కథలు వినే అవకాశం చేజారనివ్వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement