అరుదైన పుస్తకాలు.. జాన్సీకీ వాణి | Jhansi ki Rani: rare books will available over Charminar street | Sakshi
Sakshi News home page

అరుదైన పుస్తకాలు.. జాన్సీకీ వాణి

Published Fri, Sep 12 2014 1:29 AM | Last Updated on Wed, Sep 19 2018 6:37 PM

అరుదైన పుస్తకాలు.. జాన్సీకీ వాణి - Sakshi

అరుదైన పుస్తకాలు.. జాన్సీకీ వాణి

ఓ రోజు చార్మినార్‌ని చుట్టపు చూపుగా పలకరిద్దామని వెళ్లాను. చార్మినార్ పక్కనే చౌక మసీద్ వీధిలో నడుస్తుంటే ఓ బోర్డు నన్ను ఆకర్షించింది. ‘‘హజిక్.ఎన్.మోహీ’’ రేర్ బుక్ సెల్లర్స్. అసలే పుస్తకాలు.. అందులోనూ అరుదైన పుస్తకాలు, ఇక నన్ను ఆపతరమా? రెండవ మనిషి నడిచేందుకు చోటులేని ఆ దుకాణంలో అరలు అరలుగా పుస్తకాలు, నడుస్తున్న కొద్దీ లోపలకి గదులు తెరుచుకుంటూనే ఉన్నాయి. అన్ని పుస్తకాల మధ్య నేను మళ్లీ చిన్నపిల్లనైనంత సంబరపడిపోయాను. ఆ పుస్తకాల్లో హైదరాబాద్ చరిత్ర తొంగి చూస్తోంది. ఆ పుస్తకాల ఖజానాలో చరిత్రకి చిరునామాగా ఓ జ్ఞాపకాల దీవానా. ఎనభైల్లోకి అడుగు పెడుతున్న ఆ కుర్రవాడు అహ్మద్ బిన్ మహమ్మద్ బాఫన్నా, ఈ షాపు ఓనరు. నిజాం పాలన గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి మట్లాడే అహ్మద్ గారి కబుర్లు వింటూ కూర్చున్నా. మూడు చాయ్‌లు పూర్తయ్యాయి. మూడున్నరకి అస్ ్రఅజా వినిపించింది.
 
  ‘మూడు’ మారిన నా బృందసభ్యుల ఆకలి తెలుస్తోంది కానీ రెండు పుస్తకాల పురుగులు ఒక చోట చేరితే మూడు ముచ్చట్లతో ఎలా ముగిస్తాం చెప్పండి? ఏడు భాషలు మాట్లాడే ఈ పెద్దమనిషి ఓ ఎన్‌సైక్లోపీడియా. ఫలక్‌నుమా ప్యాలస్‌లోనూ, ఖిల్వత్ ప్యాలస్‌లోనూ లైబ్రరీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ఈయనకి పుస్తకాలు అమ్మడం కేవలం వ్యాపారం కాదు, ఓ జీవన విధానం. తన దగ్గరున్న అరుదైన పుస్తకాలను చూపిస్తూ ఆయన తన జ్ఞాపకాల వెంట నన్నూ తీసుకువెళ్లారు. గదంతా పుస్తకాల వాసన. కొన్ని వాసనలు నోస్టాలజిక్‌గా ఉంటాయి. ఈ వాసనతో నాకు నా స్కూల్ లైబ్రరీ గుర్తొచ్చింది. క్లాసు పుస్తకాల కంటే మిగతావి ఎక్కువ చదువుతానని టీచర్లు ఎంత కంప్లైంట్ చేసినా మా నాన్నగారు నాకు పుస్తకాలు కొనిపెడుతూనే ఉండేవారు. మంచి నవల దొరికితే ఇప్పటికీ మా ఇద్దరికీ పోటీనే. ఇక మా అమ్మగారిదీ అదే బాట. ఆవిడకి ఆధ్యాత్మిక రచనలే లోకం. అప్పట్లో చలం పుస్తకాలు పట్టుకుంటే ఇంకొన్నేళ్లు పోయాక అర్థం చేసుకొనే తీరు మారుతుంది అని మార్గదర్శనం చేసారు. పుస్తకాల బాటలో ఆప్తులు, మిత్రులు, గురువులు ఎందరో! చదివిన పుస్తకాల గురించి ఆలోచన, వాదన, చర్చ ఇలా అన్నింట్లో పాలు పంచుకొని నన్ను పెంచిన సన్నిహితులందరికీ నమః! ముఖ్యంగా తెలుగు సాహిత్యపు తోటలో తియ్యందనాలు రుచి చూపించేందుకు వేలుపట్టి నడిపించిన బ్నిం గారికి, ఆధునిక రచనలతో పరిచయం చేసిన తనికెళ్ల భరణిగారికి సదా రుణపడి ఉంటాను. పుస్తకాలు ప్రపంచపు కిటికీ తెరుస్తాయని నమ్ముతాను కాబట్టే నా కూతురు ధన్యకి కూడా పుస్తకాలను స్నేహితులని చేయాలనే సంకల్పంతో ఆమెకి ఏడాది వయసు నుంచే వారానికో పుస్తకం కొనే సంప్రదాయం ప్రారంభించాను. కానీ దాదాపు రెండేళ్ల నుండి పుస్తక సేకరణ తగ్గు ముఖం పట్టింది. గాడ్జెట్ల హోరులో పుస్తకాల జోరు తగ్గింది. ఏ సమాచారమైనా క్షణాల్లో గూగుల్ చేసి తెలుసుకునే ఈ తరానికి రోజుల తరబడి పుస్తకం పట్టుకొనే ఓపిక లేదు.
 
 అందుకే వారికి నచ్చే పద్ధతుల్లోనే పుస్తకాలను పరిచయం చేసే ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు వేలి కొసనే పుస్తక భాండాగారం అందుబాటులో ఉంది. ఈ మధ్య మా పాప స్కూల్‌మేట్స్ కొందరు రాసిన పుస్తకాలు అమెజాన్‌లో అమ్మకానికి పెట్టారంటే, ఎంతో ఆనందపడ్డాను. ఇంత చిన్న వయసులో రాసే ప్రయత్నమే గొప్ప అనుకుంటే అందుకు మార్గం సుగమం చేసిన ఇంటర్నెట్‌ని అభినందించాల్సిందే. ఆధునిక సమాజం ఇంటర్నెట్‌లో ఉంది. వారిని పుస్తకం దగ్గరకి తీసుకెళ్లలేము కానీ పుస్తకాన్ని వారికి దగ్గరగా తీసుకు వెళ్లొచ్చు. ఆసక్తిగా ఉండీ చదివే తీరికలేని వారి కోసం ఓ కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు.
 
  అవే ఆడియో బుక్స్. ముళ్లపూడి రమణ గారి కోతికొమ్మచ్చి కథలని వినిపించే ప్రయత్నం చేశారు వారబ్బాయి ముళ్లపూడి వర. ఎస్పీ బాలుగారు తన గళంలో అద్భుతంగా చదివిన ఆ కథల్లో ఓ చోట నా గొంతూ వినిపించడం నా అదృష్టం. ఇక అదే బాటలో బ్నిం గారి కథలని కూడా నేనూ, సుమ, ఇతర మిత్రులం కలసి ఆడియో పుస్తకాలుగా చదివేశాం. ఏ కారు ప్రయాణంలోనో, తీరిక వేళల్లోనో వినేందుకు వీలుగా సీడీల రూపంలోనూ, మాలికలాంటి వెబ్ పత్రికల్లోనూ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఎన్నో రచనలని కొత్త రూపాల్లోకి కొత్త మాధ్యమాల్లోకీ తీసుకురావాలి. ఇప్పటికే ఆ పని ప్రారంభించిన బ్లాగులకీ, సైట్లకీ ధన్యవాదాలు. వీరి ప్రయత్నాలు ఫలించాలంటే మనం ఆదరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement