మహేష్ పేరుతో ముప్పు!
'ప్రతివాడికి నా పేరుతోనే ప్రాబ్లమా?' అంటాడు ఖలేజా సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు. అవును నిజంగానే ఈ అందగాడి పేరుతో ప్రాబ్లం ఉంది(ట). అసలు మహేష్ పేరు చెబితే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందున్న మహేష్ బ్రాండ్ విలువ ఇతర హీరోల కంటే ఎక్కువే. ఆయన చేస్తున్న వాణిజ్య ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఇక మహేష్ పేరు చుట్టూ తిరిగిన సినిమాలు లేకపోలేదు. 'మహేష్' పేరుతోనే రేపు ఓ సినిమా విడుదల కాబోతోంది.
'దూకుడు' నుంచి మహేష్ మానియా కొనసాగుతోంది. ఆయన పేరు బ్రాండ్గా చెలామణి అవుతోంది. అయితే మహేష్ పేరుతో ప్రమాదం కూడా పొంచివుంది అంటోంది సెక్యురిటీ టెక్నాలజీ కంపెనీ అయిన మెక్ ఆఫీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ మహేష్ అని తేల్చింది. మెక్ ఆఫీ జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువయింది. సెలబ్రిటీల పేరుతో సైబర్ స్పేస్లో కలిగిస్తున్న నష్టాన్ని బట్టి ఈ అంచనా వేసింది.
ప్రముఖుల పేరుతో వైరస్ వ్యాపింపజేయడం ఇంటర్నెట్లో ఇటీవల బాగా ఎక్కువయింది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ పేరుతో ఇ-మెయిల్స్కు వైరస్లు పంపిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు ఇండియాలో రెండో స్థానంలో ఉన్నారని మెక్ ఆఫీ అధ్యయనం వెల్లడించింది. సైబర్ స్పేస్లో నష్టం కలిగించేందుకు హ్యాకర్లు ఎక్కువగా మహేష్ పేరును వాడుకుంటున్నారని వివరించింది. సినిమా సెలబ్రిటీల పేర్లకు కంప్యూటర్లకు నష్టం కలిగించే సమాచారాన్ని జోడించి ఇంటర్నెట్లో వదులున్నారని తెలిపింది.
మహేష్ బాబుతో పాటు పలువురు అగ్రహీరోలు, హీరోయిన్ల పేర్లతో ఆన్లైన్లో ముప్పు పొంచివుందని మెక్ ఆఫీ హెచ్చరించింది. దీనికి సంబంధించిన టాప్ టెన్ జాబితాను ప్రకటించింది. రామ్ చరణ్(2), పవన్ కళ్యాణ్(3), జూనియర్ ఎన్టీఆర్(6), అల్లు అర్జున్(7) ఈ లిస్ట్లో ఉన్న మిగతా హీరోలు. హీరోయిన్లు అంజలి(4), ఇలియానా(5), అమలాపాల్(8), కాజల్ అగర్వాల్(10) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా మహేష్ సరసన నేనొక్కడినే..1లో నటిస్తున్న కృతి సనన్ ఈ లిస్ట్లో 9 స్థానంలో నిలిచింది. అభిమానించే హీరో పేర్లతో ఆనందమే కాదు హాని కూడా పొంచివుందని మెక్ ఆఫీ అధ్యయం తేటతెల్లం చేసింది.