'మోస్ట్ డేంజరస్' జాబితాలో మహేశ్ బాబు!
టాలీవుడ్లో నెంబర్వన్ హీరో ఎవరు? ఈ విషయంలో ఏకాభిప్రాయం రావడం కష్టమే. ఎందుకంటే మా హీరోనే గొప్పంటూ అభిమానులు గోల చేస్తారు. అయితే తెలుగు సినిమాల్లో అత్యంత డేంజర్ సెలెబ్రిటి మాత్రం ప్రిన్స్ మహేశ్ బాబునేనట. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడ్డ రెండో వ్యక్తి కూడా అతనే. ప్రపంచంలో అతిపెద్ద సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ మెకాఫీ పరిశోధనలో ఈ విషయం తేలింది. 2003 ఏడాదిలో స్పోర్ట్స్, రాజకీయాలు, సినిమా రంగాలకు చెందిన అత్యంత ప్రముఖులపై మెకాఫీ అధ్యయనం నిర్వహించింది.
సైబర్ క్రిమినల్స్ తమకు కావాల్సిన సమాచారాన్ని సంగ్రహించేందుకు సెలెబ్రిటీల పేర్లను ఉపయోగించుకుంటున్నట్టు మెకాఫీ వెల్లడించింది. ఇందులో హీరోల అభిమానుల్నికూడా వాడుకుంటున్నారు. అపరిచితుల్ని ఎరగా వేసి పాస్వర్డ్లు, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ప్రముఖుల చిత్రాలు, వీడియోలు, నగ్న చిత్రాలు చూడటానికి ఎక్కువ మంది మొగ్గు చూపినట్టు పరిశోధనలో వెల్లడైంది. 'భారత్లో సెలెబ్రిటీలను దేవుళ్ల మాదిరిగా ఆరాధిస్తారు. సైబర్ క్రిమినల్స్ మోసాలు చేయడానికి వారి పేర్లను వాడుకుంటున్నారు' అని మెకేఫీ ఇండియా సెంటర్ ఇంజనీరింగ్-కంజూమర్, మొబైల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వెంకట సుబ్రమణ్యం చెప్పారు.
మహేశ్ బాబు నటిస్తున్న వన్ (నేనొక్కడినే) చిత్రం ట్రైలర్ను రెండు లక్షల మందికి పైగా వీక్షించారని ఈ అధ్యయనంలో తేలింది. ఇక మెగా పవర్స్టార్ రామ్చరణ్ తేజకు రెండో ర్యాంక్ దక్కింది. వన్ ట్రైలర్ తర్వాత రామ్చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'జంజీర్'ను చూడటానికి నెటిజెన్లు ఎక్కువగా ఇష్టపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గబ్బర్సింగ్'కు మూడో ర్యాంక్ లభించింది. ఈ చిత్రం వీడియోలతో పాటు పవన్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపారు. కాగా జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్లు వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.