విక్రమ్-శంకర్
ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ - హీరో విక్రమ్ అనగానే మనకు అపరచితుడు చిత్రం గుర్తుకు వస్తుంది. అపరిచితుడు సినిమా 2005లో విడుదలై తెలుగు,తమిళ భాషలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రయోగాలు చేయడంలో శంకర్ దిట్ట. విక్రమ్ కూడా ఆయనకు ఏమీ తీసిపోడు. కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. అటువంటి వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేశారు. శంకర్ సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం సహజం. అందులో వీరిద్దరికి తోడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'ఐ' షూటింగ్ పూర్తి అయింది. శంకర్ ఒక సినిమాకి, ఒక సినిమాకు పోలికే ఉండదు. అది అతని ప్రత్యేకత. ఈ చిత్రం కూడా కథ, కధనంలో పూర్తిగా కొత్తదనం చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన అందాల భామ ఎమిజాక్సన్ హీరో హీరోయిన్గా నటించింది. దీనిని తెలుగులో 'మనోహరుడు' పేరుతో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్‌ను శంకర్ ఆరు గెటప్‌లలో చూపించనున్నారు. విక్రమ్ ఎంతో అంకితభావంతో ఈ పాత్రలను పోషించినట్లు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చెప్పారు. అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రఖ్యాత సాంకేతిక నిపుణులతో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘ఐ’ చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల శంకర్ తన మనసులో మాటలు బయటపెట్టాడు. హీరో విక్రమ్ను ఆకాశానికెత్తేశాడు. విక్రమ్ లాంటి రియల్ హీరో లేనేలేడని తెగపొగిడేశాడు. ఈ మూవీ కోసం విక్రమ్ చాలా కష్టపడి సన్నబడ్డాడని చెప్పాడు. విక్రమ్ చేస్తున్న పాత్ర చాలా క్లిష్టమైనదని, ఆ పాత్ర కోసం విక్రమ్ గుండు చేయించుకోటానికి కూడా వెనుకాడలేదని శంకర్ చెప్పారు. మేకప్, కాస్టూమ్స్ల్, టెక్నికల్ అంశాలలో చాలా కొత్తదనం చూపినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడుని మించి ఇది ప్రేక్షకాదరణ పొందుతుందని అంచనా.