
సాక్షి, న్యూఢిల్లీ : పని ప్రదేశంలో తరచూ ఆందోళనకు గురవుతూ..అలిసిపోతుంటే అందుకు మూడీగా ఉండే మీ బాసే కారణమంటున్నాయి తాజా అథ్యయనాలు. నిత్యం రుసరుసలాడే బాస్ ఎదురైతే ఉద్యోగులకు టెన్షన్ తప్పదని భారత్, బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అథ్యయనం వెల్లడించింది. ఉత్పాదకత పైనా మూడీ బాస్ ప్రభావం ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. మరోవైపు క్షణానికో రకంగా వ్యవహరించే బాస్‌ల కంటే ఎప్పుడూ మూడీగా ఉండే బాస్ కొంత మేలని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
కఠినంగా ఉండే బాస్‌తో కుదురైన సంబంధాలు నిర్వహించే ఉద్యోగులు సాఫీగానే నెట్టుకురాగలరని, గంటకో రకంగా వ్యవహరించే బాస్‌లతోనే సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్ట్సర్ పరిశోధక బృందం తేల్చింది. సహోద్యోగుల మధ్య మెరుగైన సంబంధాలు లేకుంటే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని పేర్కొంది.
సిబ్బంది, మేనేజర్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటం అత్యంత కీలకమని..సంస్థల్లో ఎలాంటి వాతావరణం ఉందనేది ప్రధానాంశమని అథ‍్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ అలన్ లీ చెప్పారు. అస్తవ్యస్త మూడ్‌తో వ్యవహరించే బాస్‌లతో ఉద్యోగులు సతమతమవుతారని..ఏ అంశంలో మేనేజర్ ఎలా రియాక్ట్ అవుతారనే కంగారుతో ప్రతికూల భావోద్వేగాలకు లోనయి పనిలో సరైన సామర్థ్యం కనబరచలేకపోతారని ఆయన విశ్లేషించారు.