వోడ్కాకు సరిసాటి వేరొండు యేముండు?
కమ్యునిస్టుల డ్రింకు కల్లగాదు!
దానిలోన నిమ్మ దానిమ్మ కలుపంగ
వైనుతేయ! రుచిని వదలలేము!
‘మధు’రోక్తి
తాగుతున్నప్పుడు వోడ్కా రుచిరహితం... తలకెక్కాకనే అది చిరస్మరణీయం
- గ్యారిసన్ కీలర్, అమెరికన్ రచయిత
విగర్ స్పిరిట్
వోడ్కా : 45 మి.లీ.
వైట్ రమ్ : 15 మి.లీ.
దానిమ్మరసం : 90 మి.లీ.
లెమనేడ్ : 100 మి.లీ.
గార్నిష్ : నిమ్మచెక్క, నిలువునా చీల్చిన పచ్చిమిర్చి
‘సిటీ’జనులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కొందరు ‘స్పిరిటెడ్’, మరికొందరు ‘స్పిరిచ్యువల్’. వీరు కాకుండా, ఇంకొందరు ‘స్పిరిచ్యువల్లీ స్పిరిటెడ్’. ‘స్పిరిటెడ్’ పీపుల్ మాంచి ‘స్పిరిట్’ను మనసారా ప్రేమిస్తారు. ‘స్పిరిచ్యువల్ పీపుల్’ దానిని పూజిస్తారు. ‘స్పిరిచ్యువల్లీ స్పిరిటెడ్’ పీపుల్ తీరే వేరు. వారిదంతా అద్వైతం. తామే ‘స్పిరిట్’గా, ‘స్పిరిటే’ తాముగా తత్వ‘సారా’న్ని తలకెక్కించుకుంటారు. ప్రపంచంలో ఎందరు రాజకీయ సిద్ధాంతులున్నా, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత గల వారు కమ్యూనిస్టులేనని ఇప్పటికీ ప్రతీతి.
నిజానికి కమ్యూనిస్టుల సామ్యవాద సిద్ధాంతం మధుశాలలోనే పుట్టి ఉంటుందని కొందరి నమ్మకం. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు వంటి పబ్లిక్ ప్లేసులెన్ని ఉన్నా, అలాంటి ప్రదేశాల్లో మనుషుల మధ్య వర్గ భేదాలు కొట్టొచ్చినట్టు బట్టబయలైపోతూనే ఉంటాయి. మధుశాలల్లో మాత్రమే అలాంటి శషభిషలేవీ ఉండవు. పెగ్గు మీద పెగ్గు ఖాళీ అవుతున్న కొద్దీ, సామ్యవాద సాంద్రత గాఢతరమవుతూ ఉంటుంది. సామ్యవాదం పరిఢవిల్లే తూర్పు యూరోపియన్ దేశాల్లో వోడ్కాకే అగ్రతాంబూలం. ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దిలో ఇది రష్యాలో పుట్టిందా లేక పోలండ్‌లో పుట్టిందా అనేదానిపై కొంత గందరగోళం ఉంది. అయితే, సోవియట్ జమానా నుంచి రష్యన్ వోడ్కానే ప్రపంచ ప్రసిద్ధి పొందింది. పరబ్రహ్మ స్వరూపంలా దేనిలోనైనా విలీనమైపోగల వోడ్కాతో ఈవారం మీకోసం...
- వైన్‌తేయుడు