ఆ కిక్కే లేదప్పా!
నూతన సంవత్సర వేడుకల్లో తగ్గిన లిక్కర్ కిక్కు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గ్రేటర్ పరిధిలో సుమారు రూ. వంద కోట్ల అమ్మకాలు సాగించాలని ఆబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా ఈ ఏడాది లిక్కర్ కిక్కు కాస్త తగ్గింది. న్యూ ఇయర్ వేడుకల్లో లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు.. అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మందుబాబులు.. కుర్రకారు వెనక్కి తగ్గడంతో ‘హాఫ్’ అమ్మకాలు మాత్రమే జరిగాయి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో ఈసారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో సుమారు రూ.55 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
గతేడాది ఈ రెండు తేదీల్లోనే ఏకంగా రూ.100 కోట్ల మద్యం అమ్ముడవడం విశేషం. గ్రేటర్ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, 500 బార్లు, మరో వంద పబ్‌లు, మరో వంద ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన కొత్త సంవత్సర వేడుక(ఈవెంట్స్)ల్లో గతంతో పోలిస్తే మద్యం, బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు విశ్లేషించారు. వీటిలో 1,25,843 కేసుల ఐఎంఎల్ మద్యంను మందు బాబులు స్వాహా చేయగా.. ఏకంగా 1,76,293 కేసుల బీర్లను కుర్రకారు హాంఫట్ చేశారు.
కిక్కు తగ్గడానికి కారణాలివే...
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో చాలా మంది న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్నారు. ఇళ్లలోనే సింపుల్‌గా వేడుకలు జరుపుకున్నారు. ఈవెంట్స్‌లో పాల్గొన్న వారు సైతం అడుగడుగునా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ‘ఫుల్లు’ కొట్టలేదు. దీంతో మద్యం అమ్మకాలు తగ్గముఖం పట్టాయి. ఇక ఐఎంఎల్ మద్యం కంటే ఈసారి ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న బీర్లు, వోడ్కా, బ్రీజర్ వంటి డ్రింక్‌లనే కుర్రకారు అధికంగా సేవించడం గమనార్హం.