అనురాగం | Old age Homes will give more relief to Senior citizens | Sakshi
Sakshi News home page

అనురాగం

Published Sat, Jan 3 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

అనురాగం

అనురాగం

మలిసంధ్యలో కొత్త పల్లవి
 తరాల అంతరాన్ని కాలం తెచ్చిన మార్పని నెపం కాలం మీదకి నెట్టేస్తాం కానీ.. అది కొత్తగా తెస్తున్నదేమీ లేదు!. చక్రం తిరుగుతున్నప్పుడు అడుగున పడ్డవి పైకొస్తున్నాయి. కాకపోతే ఆధునిక హంగులు, రంగులద్దుకొని కాస్త పేర్లు  వరించు కుంటున్నాయంతే!. అంటే.. గురుకులాలు హాస్టళ్లు, వానప్రస్థాశ్రమాలు ఓల్డేజ్ హోమ్స్ అయినట్టన్నమాట!. రండి.. ఒక్కసారి ఈ ఆధునిక ఆశ్రమంలోకి వెళ్దాం.
 - శరాది
 ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి
 
 అక్కడ అడుగుపెట్టగానే పచ్చని తోవ.. మూడంతస్తుల భవనంలోకి ఆహ్వానం పలికింది. లోపలికి వెళ్లగానే పేపర్ చదువుతూ ఓ డెబ్భై ఏళ్ల సీనియర్ సిటిజన్.. ‘మీ పేరు’అనగానే ‘నరసింహారెడ్డి’ అని ఠక్కున చెప్పారు. ఎన్నాళ్లయింది? అని అడుగుతుండగానే- ‘మూణ్ణెళ్లయింది. మా ఊరు కడప జిల్లా పులివెందుల దగ్గర. మొదటి నుంచి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుయాయుడిని. నాకు ముగ్గురు కొడుకులు, అమ్మాయి. పెళ్లిళ్లయి, వాళ్ల పిల్లలకూ పెళ్లిళ్లయి అమెరికాలో ఉంటున్నారు. బాధ్యతలన్నీ తీరాక ఊళ్లో ఒంటరిగా ఉండేకంటే పిల్లల దగ్గరకు వెళ్దామని నా భార్య బలవంతపెడితే వెళ్లాం.
 
 కానీ ఎవరి దగ్గరా అడ్జస్ట్ కాలేకపోయాం. క్షణం తీరికలేని ఉద్యోగాలు వాళ్లవి.. పైగా మా బాధ్యతొకటి.. వాళ్లను ఇబ్బంది పెడుతూ, మాకు ఇండువిడ్యువాలిటీ లేకుండా.. ఎందుకిలా అనిపించింది. వెంటనే ఓల్డేజ్ హోమ్‌లో చేరాలనుందని పిల్లలతో చెప్పాం. వాళ్లు షాక్ తిన్నారు. కానీ, ఒకే ఇంట్లో.. ఎవరి గదుల్లో వాళ్లు టీవీలు చూసుకుంటూ గడిపే కంటే అపరిచితులు ఆత్మీయులుగా మారే ఇలాంటి ఆశ్రమాలు బెస్ట్ కదా!. తొలుత శ్రీశైలంలోని ఓ ఆశ్రమంలో ఉన్నాం. మూడేళ్ల కిందట మా ఆవిడ భగవంతుడికి చేరువైంది. మళ్లీ కొన్నాళ్లు కొడుకుల దగ్గరున్నా. మళ్లీ అదే సమస్య. రీసెంట్‌గా ఇక్కడికి వచ్చా. ఇక్కడ నా తోటి వాళ్లుంటారు. నోరారా మాట్లాడుకోవచ్చు. నచ్చిన వంట చేయించుకుంటా. నచ్చిన ఛానల్ చూస్తా.. నచ్చినట్టు ఉంటా..’ అని వివరించారు నరసింహారెడ్డి.
 
 శ్రీకారం చుట్టుకుంది ‘అనురాగం’
 ఇలాంటి వారి కోసమే, సరిగ్గా అలాంటి ఉద్దేశంతోనే పారిశ్రామికవేత్త వెంకటేశ్వరరావు ‘అనురాగం ఫౌండేషన్’ను స్థాపించారు. వ్యాపారం లాభసాటిగానే ఉన్నా మనసులో ఏదో వెలితి.. పదిమందికీ ఉపయోగపడే పని చేయాలనిపించేది. ఈ క్రమంలోనే సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులను చేరదీయాలనే లక్ష్యంతో ‘అనురాగా’నికి శ్రీకారం చుట్టారు ఐదేళ్ల క్రితం. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. పచ్చని చెట్ల మధ్య తొంభై పడకలు గల ఈ ఆశ్రమం ఐదు నెలల క్రితం ప్రారంభమైంది. భోజనం, బస, నేచురోపతి వైద్య సదుపాయం, జిమ్, 500 మందికి ఒకేసారి వండి వడ్డించగల వంటశాల, డైనింగ్ హాల్, స్విమ్మింగ్‌పూల్, ఫ్లోరైడ్‌ఫ్రీ వాటర్ కోసం వాటర్ ప్లాంట్ సౌకర్యాలున్నాయి. మధ్యలో భవంతి.. చుట్టూ గార్డెన్‌లో దానిమ్మ, జామ, తియ్యటి చింత, నాలుగు రకాల ఉసిరి, బత్తాయి, నారింజ, మామిడి చెట్లతో పాటు పలు ఔషధ మొక్కలు.. చందనం, ఎర్రచందనంతో పాటు కల్పతరువూ ఉన్నాయి.
 
 వృద్ధుల గుండెచప్పుడూ వింటారు..
 ఈ ఆశ్రమం వైద్యాలయం కూడా!. మానవ శరీర నైజాన్ని అర్థం చేసుకొని దానికనుగుణంగా వైద్యాన్నిచ్చే నేచురోపతి ఇక్కడి వృద్ధుల శారీర రుగ్మతలకు మంచి ట్రీట్‌మెంట్ ఇస్తోంది. ఇందుకు నేచురోపతి డాక్టర్ వాణిశ్రీ బాధ్యత తీసుకుంటున్నారు. ఈ సౌకర్యం ఇన్ పేషంట్స్‌గా ఉన్నవారికే కాదు అవుట్ పేషంట్స్‌కీ అందుబాటులో ఉంటోంది. ఆశ్రమంలోని సీనియర్ సిటిజన్స్‌కి రోజూ బీపీ చెక్ చేయడానికి ఓ నర్సూ ఉంది.
 
 ‘అనురాగా’నికే అంకితం
 వెంకటేశ్వరరావు.. తన స్వప్నమైన ఈ ఆశ్రమం ఇలా రూపుదిద్దుకోకముందే కన్నుమూశారు. మంచి పని అర్ధంతరంగా ఆగిపోవడం ఇష్టంలేని ఆయన స్నేహితుడి కొడుకు ప్రసాద్.. ఆశ్రమం బాధ్యతను తీసుకున్నాడు. ఆయన అమెరికాలో కార్డియాలజిస్ట్. మధ్యలో ఆగిపోయిన నిర్మాణ పనులన్నిటినీ పూర్తిచేయించి నడిపే పనిని ఇక్కడే ఉండే తన బాబాయ్ చలసాని వెంకటేశ్వరరావుకి అప్పగించారు. ఆయన కుటుంబమంతా అనురాగాన్ని పంచడానికి అంకితమైంది. ‘ఆశ్రమం పెట్టాలనుకున్న వెంకటేశ్వరరావుకి, మధ్యలో బాధ్యత తీసుకున్న మా అబ్బాయ్‌కి, నడిపే ధర్మాన్ని నెరవేరుస్తున్న మాకు.. ఈ ఆశ్రమం ఒక ఆలయం. దీని నిర్వహణకు ఎవరి దగ్గరా ఫండ్స్ తీసుకోవట్లేదు. ఇక్కడ చేరే వాళ్ల నుంచి నామినల్ ఫీజు తీసుకుంటున్నాం. సీనియర్ సిటిజన్స్‌కు అత్యవసర వైద్యసేవల కోసం రావల్‌కోల్‌కి దగ్గర్లో ఉన్న మెడిసిటీ ఆసుపత్రితో అనుసంధానమయ్యాం. ఎమర్జెన్సీకి మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉన్న వ్యాన్ కూడా ఉంది’ అని చెప్పారు చలసాని వెంకటేశ్వరరావు. ఆయన పూర్వాశ్రమంలో బ్యాంక్ మేనేజర్.
 
 అందరిదీ అదే లక్ష్యం
 చలసాని వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఆశ్రమ నిర్వహణలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్నారు. కుమార్తె డాక్టర్ కృష్ణబిందు ఫిజియోథెరపిస్ట్. బాగా నడుస్తున్న ప్రాక్టీస్‌ను వదిలి తనవంతు సేవగా ‘అనురాగం’లో చేరింది. మద్రాస్‌లోని డీడీ వర్సిటీలో ప్రొఫెసర్స్‌గా పనిచేసి రిటైర్ అయిన వైద్యజంట డాక్టర్ భారతి, కృష్ణారావు.. ఆశ్రమంలోనే ఉంటూ సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ‘రిటైర్మెంట్ దాకా జీతం కోసం పనిచేశాం. ఇకపైనైనా ఆత్మసంతృప్తి కలిగే పని చేయాలనుకున్నాం. మా పిల్లలు అమెరికాలో సెటిల్డ్. ఇంట్లో ఇద్దరమే ఒంటరిగా ఉండే బదులు ఇలా నలుగురు మాతోటి వాళ్లున్న వాతావరణంలో ఉంటూ, చేతనైన సేవనందిస్తే బాగుంటుందని ఆశ్రమంలో చేరాం. రావల్‌కోల్ చుట్టుపక్కలున్న గ్రామాల్లోనూ వైద్యసేవలందిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ భారతి.
 
భవిష్యత్ ప్రణాళిక..
రావల్‌కోల్ పరిసర ప్రాంతాల యువతకు ఉపయోగపడేలా త్వరలోనే ఇక్కడ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అనాథాశ్రమాన్నీ ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాళ్ల కోరిక నెరవేరి మరింత మందికి  అనురాగం పంచాలని ఆకాంక్షిద్దాం!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement