సాక్షి, హైదరాబాద్: వృద్ధాశ్రమాల నిర్వహణ కంటతడి పెట్టించేలా ఉందని, పట్టించుకో వాల్సిన ఉన్నతాధికారులను అక్కడ మూడు రోజులు బస చేయిస్తే ఎంత ఘోరంగా అవి ఉన్నాయో అనుభవంలో తెలుస్తుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగరిక సమాజంలో అనాగరిక పరిస్థితుల ను నగరాల్లోనే చూస్తున్నామని, నాగరికత లేదని చాలా మంది భావించే గ్రామాల్లోనే అమ్మానాన్నలను బాగా చూసుకుంటున్నారని అభిప్రాయపడింది. పండుటాకుల పట్ల ప్రేమ చూపని నేటి తరం.. రేపటి వృద్ధ తరమని మరిచిపోవద్దని హెచ్చరించింది. జంట నగరాల పరిసర ప్రాంతాల్లోని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల నిర్వహణపై అమికస్‌క్యూరీ (ఈ కేసులో కోర్టుకు సహాయకారి)గా నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ ఇచ్చిన నివేది కను పరిశీలించిన ధర్మాసనం వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని వ్యాఖ్యా నించింది.
వృద్ధాశ్రమాల నిర్వహణ ఎలా ఉందో చూడాల్సిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఓ మూడు రోజులు అ లాంటి ఆశ్రమాల్లో బస చేయమంటే పరిస్థితులు అనుభవపూర్వకంగా తెలిసివస్తాయం ది. నివేదికపై ప్రభుత్వ వాదనను తెలియ జేస్తూ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆ ఇద్దరు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగ రంలోని మమత వృద్ధాశ్రమంలో దుర్లభ పరిస్థితులపై న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు మరో సారి విచారణ జరిపింది.
వారికీ హక్కులు ఉన్నాయన్నది మరవద్దు..
వృద్ధాశ్రమాల్లో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో నివేదిక చూస్తే అర్ధమవుతోందని, నిరుపేదలు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేరని అనుకోవద్దని హెచ్చరించింది. వారికి రాజ్యాంగం హక్కులు కల్పించిందనే విషయాన్ని అధికారులు మరిచిపోకూడదని, చట్ట ప్రకారం.. సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు తనిఖీలు చేయాలనే బాధ్యతను నిర్వహించకపోతే వారిని ఏమనాలని ప్రశ్నించింది. ‘ఒకచోట మదర్స్ నెస్ట్ అనే వృద్ధాశ్రమంలో మూడు గదుల్లో ఏకంగా 24 మంది ఉన్నారు. గదులకు కిటికీలు ఊడిపోయాయి. మరుగుదొడ్లు కూడా లేవు. ‘ది సెకండ్ చాన్స్’లో మంచాల మధ్య నడిచే ఖాళీ కూడా లేదు. ఎప్పుడో ఉతికిన దుప్పట్లు.. దుమ్ము ధూళితో ఉన్నాయి. దాతల చేయూతతోనే ఎన్జీవోలు వీటిని నిర్వహిస్తున్నాయి. రూ.25–30 వేల వరకూ చెల్లించి ఉండే కొన్ని చోట్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇంకొన్ని అంతకంటే ఎక్కువే వసూ లు చేస్తున్నాయి. అధికారులు ఏడాదికోసారి తనిఖీ చేసినట్లుగా చెబుతున్నారు. పలుచోట్ల అయితే వృద్ధాశ్రమం రిజిస్టర్ చేసినప్పుడే తనిఖీ జరిగింది’అని నివేదికలోని విషయాలను ధర్మాసనం ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదనను వెలిబుచ్చింది.
హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయండి...
‘జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో అధికారికంగా రిజిస్ట్రర్ చేసినవి ఎన్ని ఆ శ్రమాలున్నాయి. రిజిస్ట్రర్ చేయనివి ఎన్ని ఉన్నా యి. ఇప్పటివరకూ ఎన్నిసార్లు తనిఖీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు. వృద్ధాశ్రమాల్లోని వారి కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేయా లి. హెల్ప్‌లైన్లకు వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. వృద్ధాశ్రమాలను ఆదుకునేందుకు కార్పొరేట్ కంపెనీల సాయం పొందే చర్యలు తీసుకోవాలి. మేము జారీ చేసే ఉత్తర్వుల ప్రతులను అన్ని వృద్ధాశ్రమాల నిర్వాహకులకు అధికారులు అందజేయాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment