
పవన్ కళ్యాణ్
వచ్చేవారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడం ఖాయం అని తెలుస్తోంది. పార్టీ పేరును, ఎజెండాను ఆయన ప్రకటించనున్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు ఈరోజే ప్రకటించారు. పవన్ మరో పార్టీ పెట్టబోతున్నట్లు చెబుతున్నారు. రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక పుస్తకం రాశారు. దానిని రాజకీయ పార్టీ ప్రకటన రోజున విడుదల చేస్తారని చెబుతున్నారు. సమాజంలో రాజకీయాలు మారాలి - ప్రజాస్వామ్య దేశంలో హక్కులు, విధులు - ప్రజలతో ప్రభుత్వం సత్సంబంధాలు ... తదితర అంశాలను ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని పది రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పలువురు ఆయనను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు కూడా ఆహ్వానం పలికారు. అయితే పవన్ కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని - లోకసత్తా పార్టీ తరపున పోటీ చేస్తారని - మల్కాజిగిరి లేక ఏలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని - లేదు కొత్త పార్టీ పెడతారని - ఆ పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ) లేక యువరాజ్యం అని ....ఇలా అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలన్నిటికీ బలం చేకూరే విధంగా ఈనెల రెండో వారంలో మీడియా ముందుకు రానున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నెల 9వ తేది ఆదివారం పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి ఓ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన ఏదో చేస్తేగాని ఈ ప్రచారానికి తెరపడదు.