నాలుగేళ్లయినా మానని గాయం | People can't forget YS Rajasekhara reddy even after four years | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లయినా మానని గాయం

Published Mon, Sep 2 2013 11:09 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

నాలుగేళ్లయినా మానని గాయం - Sakshi

నాలుగేళ్లయినా మానని గాయం

ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి. ఆ ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ నాలుగేళ్ల క్రితం సరిగ్గా  ఇదే రోజు... మన కళ్ల ముందునుంచి దూరమయ్యారు. కోట్లాది మందిని కన్నీటి సంద్రంలోకి నెట్టి తాను కానరాని లోకాలకు చేరుకున్నారు.

సెప్టెంబర్‌ 2, 2009
రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం
బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా హెలికాప్టర్‌
చిత్తూరు జిల్లా అనుపల్లికి సంక్షేమ సారథి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణం

నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు హెలికాప్టర్‌ ఎక్కుతూ 'సాక్షి టీవీ'తో మహానేత వైఎస్‌ఆర్‌ మాట్లాడిన చివరి మాటలివి...
''ముందు చెప్పకుండా ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను ఏ గ్రామానికి వెళ్తున్నానో చెప్పాను. సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కాబట్టి అంత అడ్వాన్సు నోటీసు ఇచ్చాను. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడున్న సమస్యలేంటో ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అవుతాను. ముందే నేను ఎక్కడికెళ్తున్నానో చెబితే అక్కడ ఏమైనా తప్పులున్నా సరిచేసుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలూ సరిగా పనిచేస్తున్నాయా, కరువు సమస్యలు ఏమైనా ఉన్నాయా, పనులు లేకపోవడం గానీ, మంచినీళ్లు, పశుగ్రాసం లాంటి సమస్యలున్నాయా, రేషన్ కార్డులు, ఇళ్లు లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా అనేవి చూస్తాను. ఇందిరమ్మ పథకంలో అందరికీ ఇళ్లు మంజూరు చేశాం. ఇంకా కానివారు ఎవరైనా ఉన్నారా, కట్టుకోడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా చూస్తా. బీదవాళ్లలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డులు లేకుండా ఉండకూడదు. పెన్షన్లు రానివాళ్లు ఎవరైనా ఉన్నారా.. అలాగే ఒకరికే రెండు పెన్షన్లు రావడం లాంటివి ఉన్నాయా అనేవి నేరుగా తెలుసుకోడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నా''

ఇక ఆ తర్వాత ఆయన గొంతు వినిపించలేదు. ఆయనా కనిపించలేదు. కోట్ల మందిని కన్నీటి సాగరంలో ముంచి  దివికేగిపోయారు రాజన్న. ఉదయం హెలికాప్టర్‌లో బయల్దేరిన రాజన్న... ఎంతకూ గమ్యం చేరకపోయేసరికి రాష్ట్రమంతా తల్లడిల్లిపోయింది.  ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేసిన వారెందరో. కోట్ల మంది ప్రార్థనలు, పూజలను  విధి పట్టించుకోలేదు. మహానేత  ప్రయాణించిన హెలికాప్టర్‌ను పావురాల గుట్ట కబళించింది. పేద ప్రజల పెన్నిధిని మనకు దూరం చేసింది.

దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు.  ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు.

కానీ ఆ హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాల గుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైలట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అంతా మరణించారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా  రాజశేఖర్‌ రెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూసింది.  నాడు  ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడులే అని జనం నమ్మారు.  రాజన్న అంటేనే కొండంత అండ అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు.  దేశంలో ఎక్కడా లేని రీతిలో  ఉచిత విద్యుత్‌ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు.  పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు.  ఫించన్లిచ్చి ఎంతో మంది  వృద్ధులకు పెద్ద కొడుకయ్యాడు. మహానేత పాలనలో ఎంతో ధైర్యంగా బతికారు బడుగు, బలహీనవర్గాల ప్రజలు.

అందుకే ఆ  సంక్షేమ సారధి పదికాలాలు  పదవిలో ఉండాలని జనం  ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే  మహానేత ఇక లేడని తెలిసిందో  పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తాము ఉండలేమన్నారు.  రాజన్న లేడని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు.  కాని  మహానేత కానరాని లోకాలకేగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement