రూపాయికి తొలగని ముప్పు!
రూపాయి రికవరీతో మధ్య తరగతి ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. గత కొద్ది రోజులుగా పతనావస్థకు లోనైన రూపాయి గురువారం మార్కెట్ లో 225 పైసలు లాభపడి 66.55 రూపాయల వద్ద ముగియడం కొంత ఊరటనిచ్చింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా రికవరీకి మద్దతునిచ్చింది.
దేశీయ చమురు కంపెనీలు మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంకు వెసలుబాటు కలిగించడంతో గురువారం మార్కెట్ లో గత పదిహేనేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా రూపాయి ఒకరోజు ట్రేడింగ్ లో లాభపడటం మార్కెట్ కు ఉత్తేజాన్ని ఇచ్చింది.
రూపాయి క్రమంగా క్షీణించడంతో దేశ ప్రజలు అభద్రతాభావానికి లోనవుతున్నారనే అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రభుత్వాన్ని విపక్షాలు పార్లమెంట్ లో నిలదీశాయి. దేశ ఆర్ధిక వ్యవస్థతోపాటు, విదేశీ పరిస్థితులు కూడా రూపాయి పతనాన్ని శాసించాయని ప్రధాని వివరణ ఇచ్చారు. సిరియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల కూడా అమెరికా ద్రవ్య విధానంలో మార్పులు వచ్చాయని.. దాంతో రూపాయి పతనానికి పలు అంశాలు తోడయ్యాయన్నారు.
పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియాపై పశ్చిమ దేశాలు సైనికదాడి చేయొచ్చనే భయాలతో ముడిచమురు పైకి ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్ల పైకి దూసుకెళ్లింది. మరోపక్క, ఆహార భద్రత బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో సబ్సిడీ భారం ఎగబాకి ద్రవ్యలోటు పెరిగిపోతుందనే భయాలు కొత్తగా వచ్చిచేరాయి. దాంతో అసలే బిక్కుబిక్కుమంటున్న రూపాయి మరింత కుండిపోయింది. రూపాయి పతనంతో విదేశీ నిధులు తిరోగమన బాట పట్టాయి. తాత్కాలికంగా రూపాయి కోలుకున్నా.. అనేక అంశాలు రూపాయి పతనానికి దోహదమయ్యే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.