ఎంతపని చేశావమ్మా..
బేటీ బచావోలో ఇప్పటి వరకు ప్రస్తావనకు వచ్చిన ఆడబిడ్డల్లో చాలామంది కన్నవారి పాపానికి బలైనవారే! శంషాబాద్‌కి చెందిన ఈ బిడ్డలూ అంతే! అంజలి, అరుణ అక్కాచెల్లెళ్లు. అంజలి ఆరో తరగతి, అరుణ అయిదో తరగతి. చిన్న కుటుంబం.. కానీ చింతలు లేని కుటుంబం కాదు. వీళ్ల నాన్న ఏదో కేసులో జైలుకి వెళ్లాడు. ఆయనను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేసింది అంజలి వాళ్ల అమ్మ. మిగిలిన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఒక ప్రయత్నం మాత్రం ఘోరమైంది.
ఏంటది?
భర్త బెయిల్ కోసం రూ.10 వేలు అవసరమయ్యాయి ఆమెకు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు బిడ్డలపై కన్నుపడింది. వెంటనే ప్లాన్ చేసుకుంది. ‘అవసరం’ ఉన్న వాళ్ల గురించి ఆరా తీసింది. ఓ వ్యక్తి దొరికాడు. పిల్లల ఫొటోలు చూపించింది. బేరం మొదలుపెట్టింది. పదివేలకు బేరం కుదుర్చుకుంది. పిల్లలు చదివే స్కూల్ అడ్రస్, వాళ్ల పేర్లు, చదువుతున్న క్లాస్ వివరాలనూ ఆ వ్యక్తికి చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది.ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు అంజలి, అరుణ.. ఇద్దరూ స్కూల్‌లో ఉన్నారు.
మధ్యాహ్నం..
పదివేలు తీసుకున్న వ్యక్తి నేరుగా ఆ పిల్లల స్కూల్‌కి వెళ్లి, పిల్లల పేర్లు చెప్పి తనతో పంపించమని టీచర్‌ని అడిగాడు. ఇంత హఠాత్తుగా పిల్లల్ని తీసుకెళ్లే కారణమేంటో చెప్పమని అడిగింది టీచర్. ఎవరికో ఒంట్లో బాగాలేదు పిల్లల్ని తీసుకొని అర్జెంట్‌గా ఊరెళ్లాలి అని చెప్పాడు ఆ వ్యక్తి. ఎందుకో ఆ టీచర్‌కి ఆయన మీద అనుమానం వచ్చింది. ‘అసలు పిల్లలకి నువ్వేమవుతావ్?’ అని అడిగింది టీచర్. ‘నా పిల్లలు’ అని చెప్పాడు. పొంతన కుదిరినట్టు అనిపించలేదు.. ఇంకా వివరాలను ఆరాతీసే ప్రయత్నం చేసింది. పంపించమంటే ఇన్ని ప్రశ్నలేస్తున్నారేంటి అని ఆవేశపడ్డాడు. అది చూసి టీచర్ మనసు కీడు శంకించింది. పట్టుబట్టి అడిగితే పట్టుబడిపోయాడు.
ఆ పిల్లల అమ్మ పదివేల రూపాయలకు వాళ్లను తనకు అమ్మేసిందన్న నిజం కక్కేశాడు. అవాక్కయింది టీచర్. స్కూల్ మేనేజ్‌మెంట్‌కి విషయం తెలియజేసింది. వాళ్లమ్మకు ఫోన్ చేశారు. ‘అవును.. నా పిల్లలు నా యిష్టం. నా భర్త బెయిల్ కోసం అమ్మేసుకున్నాను. అతనితో పంపించండి’ అని కటువుగా సమాధానమిచ్చింది. పోలీసులకు ఫోన్ చేసింది యాజమాన్యం. అమ్మతో పాటు, కొనుక్కున్న వ్యక్తి కటకటాల్లో ఉన్నారు. అమ్మ చేసిన పనికి పసివాళ్లు షాక్‌కి గురయ్యారు. పిల్లలను కస్తూర్బాలో చేర్పించారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అక్కాచెల్లెళ్లు చదువు మీదే దృష్టి పెట్టారు. దేన్నీ పట్టించుకునే స్థితిలో లేరు! ‘అయ్యో..’ అని అంజలి, అరుణను జాలి ఊబిలోకి నెట్టేయకుండా.. ధైర్యంగా నిలబెట్టే ప్రయత్నాలు చేద్దాం! వాళ్ల హక్కుల్ని కాపాడే వాతావరణాన్ని కల్పిద్దాం!
..:: శరాది