దిగ్విజయ్ సింగ్ - కెసిఆర్
టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ ఢిల్లీలో ఈరోజు రహస్యంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు), టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అంశం చివరి దశకు రావడంతో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనంపైనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లాభంలేనిదే ఏ పనికీ పూనుకోదన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో అటు ఓట్లు,సీట్లుతోపాటు టిఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ కూడా మొదలు పెడుతోంది. పార్టీ విలీనంపై కెసిఆర్ తడవకు ఓ రకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రకటిస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని తొలుత ప్రకటించారు. ఆ తరువాత విలీనం లేదు - రాష్ట్ర పునర్నిర్మాణంలో తామే కీలక పాత్ర - అధికారం మాదే - బిల్లు పాస్ అయిన తరువాత ఆలోచిద్దాం... అని మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఊరుకుంటారు? పార్టీ విలీనం కాకుండా, తెలంగాణ ప్రకటిస్తే ఆ క్రెడిట్ అంతా టిఆర్ఎస్కు, కెసిఆర్కు పోతుందన్న విషయం వారికి తెలియనిదికాదు.
ఈ నేపధ్యంలో ఒకవైపు తెలంగాణ బిల్లును పార్లమెంటులో నెగ్గించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూనే, మరో పక్క టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయడానికి కెసిఆర్తో మంతనాలు జరుపుతోంది. కెసిఆర్ ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడినా, తన ప్రధాన ఆశయం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటమే అయినందున, ఆ పని పూర్తి అయితే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో టిఆర్ఎస్ నేతలలో టెన్షన్ మొదలైంది.