మూగజీవుల నేస్తం.. ప్రాణం పోసే | serving to animals | Sakshi
Sakshi News home page

మూగజీవుల నేస్తం.. ప్రాణం పోసే

Published Sun, Feb 23 2014 11:36 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

మూగజీవుల నేస్తం.. ప్రాణం పోసే - Sakshi

మూగజీవుల నేస్తం.. ప్రాణం పోసే

 మూగజీవాల జబ్బులను పారదోలుతున్న అద్భుతమైన సంప్రదాయ మూలికా వైద్యుని విజయగాథ ఇది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంత పల్లెల్లో గొర్రె, మేక, గొడ్డు, గోదున్న రైతులందరికీ పెద్ద రాజన్న పేరు పేదాల మీదే ఆడుతుంది. ప్రాణాంతక వ్యాధి సోకింది.. ఈ పశువు బతకదని పశువైద్యులు తేల్చేసినప్పుడు ‘ఓరె.. పెద రాజన్నకు ఓసారి చూపించు.. చచ్చే బక్కెద్దు కూడా లేచి రంకేస్తుంది’ అంటుంటారు రైతులు. గోళ్ల గ్రామానికి చెందిన పెద్ద రాజన్న పశువైద్యుడిగా అంత పేరొం దాడు. అలాగని పెద రాజన్నకు పశువైద్యంలో పట్టాలేమీ లేవు. మూడో తరగతితో చదువు సరిపెట్టాడు. తాత, ముత్తాతల కాలం నుంచి మూగజీవాలకు ఊపిరిపోస్తున్న కుటుంబంలో పుట్టిన రాజన్న అందుబాటులో ఉన్న వనమూలికలతోనే పశువులకు చికిత్స చేస్తాడు. సంప్రదాయ విజ్ఞానంతో వేలాది పశువులకు ప్రాణంపోస్తున్న రాజన్న సేవలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్) సముచిత రీతిన గుర్తించడంతో ప్రతిష్టాత్మ క రాష్ర్టపతి అవార్డు ఇచ్చింది. పల్లెజనుల జ్ఞానాన్ని నెత్తికెత్తుకునే పల్లెసృజన సంస్థ కృషి ఇందుకు దోహదపడింది.
 
 తండ్రి, మామలే స్ఫూర్తి
 వనమూలికలతో పశువులకు వైద్యం చేసే పెద్ద రాజన్న కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలోని వందలాది గ్రామాలకు వెళ్లి సేవలందిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మూగజీవాలున్న ప్రతి ఇల్లూ తలచుకునే పెద్ద రాజన్నకు పశువైద్యంలో ఆయన తండ్రి మాదప్ప, మామ కామయ్యలే గురువులు. 30 ఏళ్ల వయసు నుంచి రాజన్న మూగజీవాలకు సేవ చేస్తున్నాడు. 65 ఏళ్లు నిండినా నేటికీ మూగజీవాల సేవలోనే తలమునకలుగా ఉంటాడు. ఒక్కో రోజు వేళకు భోజనం చేసేందుకు కూడా వీలుకానంతగా లీనమైపోతాడు. స్వతహాగా రైతైన రాజన్న సొంత పొలం పనులు కూడా మానుకొని పశువుల సేవలో మునిగిపోతుంటాడు. ఒక్కోసారి దూరప్రాంతాల రైతులు కూడా వచ్చి రాజన్నను తీసుకుపోతారు. అయినా, రాకపోకల ఖర్చులు తప్ప వైద్యం చేసినందుకు రూపాయి కూడా ఆశించడు.
 
 శాస్త్రీయమైనది రాజన్న వైద్యం
 ఈ కాలంలో గచ్చాకు పుచ్చాకుతో రోగాలు కుదురుతాయూ? అని కొట్టి పడేసే వారి నోళ్లను పరీక్షల ఫలితాలు అవాక్కయ్యేలా చేశాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లాబ్ పరీక్షల్లో రాజన్న మందులోని శాస్త్రీయత రుజువైంది. ఆ తర్వాత దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. ఐరోపా దేశాల్లో పేటెంట్ కోసం ఎన్‌ఐఎఫ్ దరఖాస్తు చేసిందంటే రాజన్న మందు గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మార్చిలో రాష్ర్టపతి పురస్కా రంతోపాటు రూ. లక్ష నగదు బహుమతిని రాజన్న అందు కున్నారు. రాజన్న మందులను పోస్టు/ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. పొదుగు వ్యాధి మందు ప్యాకెట్ ధర రూ.వంద! వివరాలకు: పల్లెసృజన స్వచ్ఛంద సంస్ధ, 122, వాయుపురి, సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్-500 094. ఫోన్: 040-27111959. జె. శ్రీకర్: 91777 52753                
                        - వంక సోమశేఖర్‌రెడ్డి,
          న్యూస్‌లైన్ , కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా
 
 
ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తా!
 నోరులేని ప్రాణులు.. రోగాన్ని, బాధను చెప్పుకోలేవు. తండ్రి, మామల వద్ద నేర్చుకున్న విద్యతో 35 ఏళ్లుగా వేలాది పశువులను బతికించాను. ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటా. జబ్బుపడిన పశువు లేచి మేత తినే వరకు ప్రాణం కుదుటపడదు. పశువుకు రోగం కుదిరిందంటే సంతోషపడతాను. నా విద్యను రాష్ర్టపతి గుర్తిస్తారని, బహుమతి  ఇస్తారని ఎప్పుడూ అనుకోలేదు.  ఢిల్లీ పెద్దల నుంచి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది.
 - బోయ పెద్ద రాజన్న, గోళ్ల గ్రామం,
 కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా
 
ప్రాణాంతక పొదుగు వ్యాధి పరారే!
 పాడి పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చిందంటే ప్రాణం మీదకొచ్చినట్లేనని భావిస్తుంటారు. ఈ వ్యాధిని నయం చేయడానికి రూ. వెయ్యి ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు కనీసం 3,4 వేస్తుంటారు. అయినా, ఒక్కోసారి పశువు ప్రాణాలూ దక్కక పోవచ్చు. అయితే, రాజన్న ఇచ్చే మూలికల పొడిని నాలుగు పూటలు పొదుగుకు రాస్తే చాలు.. జబ్బు తగ్గిపోతుంది.  పొదుగువాపు వ్యాధితో పాటు కట్టువ్యాధి, జబ్జ వాపు, విరేచనాలు, కంటిచూపు దెబ్బతినడం, పాలసార పెంపునకు, కాన్పు చేయడం, విరిగిన అవయవాలకు కట్లు కట్టడంతోపాటు.. చలికుందా, రక్తం కుందా, కుంటికుందా, ఊదా కుందా, ససులవ్యాధి అని స్థానికంగా వాడుకలో ఉన్న వ్యాధులకు కూడా రాజన్న వైద్యం చేస్తాడు. కాళ్లు విరిగిన పశువు రాజన్న వైద్యంతో 15 రోజుల్లో లేచి నడుస్తుంది.
 
 
 కారు చౌకలో ద్రావణ ఎరువు
 ‘అమృద కైరసాల్’
 ప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డా. నమ్మాళ్‌వార్ పంటల పోషణకు రూపొందించిన చౌకైన ద్రావణ ఎరువు అమృద కైరసాల్.  అమృద కైరసాల్ తయారీ పద్ధతి: ఐదు కిలోల ఆవు పేడను తీసుకొని ఒక గోనె సంచిలో వేసుకోవాలి. దానిలో ఐదు కిలోల మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విరివిరిగా దొరికే తూటుకాడ (తూటేరు /కాంగ్రెస్ కంప /లొట్టపీసు) మొక్క ఆకులు సన్నగా తరిగి వేయాలి. దీనికి పావు కిలో బెల్లం కలిపి సంచిలో ఒక రాయివేసి తాడుతో కట్టి.. 10 లీటర్ల నీరు పోసిన డ్రమ్ములో వేలాడదీయాలి. నీటిలో ఉన్న సంచిని ఓ 20 సార్లు గట్టిగా కదుపుతూ తిప్పాలి. రోజుకు 3 సార్లు చేయాలి. 2 రోజుల్లో అమృద కైరసాల్ సిద్ధమౌతుంది. దీన్ని పది లీటర్ల నీటిలో కలిిపి పిచికారీ చేసుకోవచ్చు/సాగునీటి కాలువలో కలపవచ్చు.
 
 పోషణకు, చీడపీడల నివారణకు ‘హెర్బల్ టీ’
 అందుబాటులో ఉన్న మొక్కలను ఉపయోగిం చి నమ్మాళ్వార్ కీటక నాశినిని రూపొం దించారు. ఐదు కిలోల పేడను తీసుకొని గోనె సంచిలో వేసుకోవాలి. పేడ ఉన్న సంచిలో వేప, వాయిలి, సీతాఫలం వంటి ఆకులు మరో ఐదు కేజీలు వేసి.. సంచి మునిగేందుకు అందులో ఒకరాయి వేసి.. నీటి తొట్టె లేదా డ్రమ్ములో వేయాలి.  రోజుకు మూడు సార్లు కదుపుతూ తిప్పాలి. సంచిలోని పేడ, మొక్కల కషాయం క్రమంగా కరిగి నీటిలో కలుస్తుంది. దీన్ని అన్ని పంటలకు చీడపీడల నివారిణిగా, పోషక ద్రావణంగా ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement