కర్టసీ షూపుదాం | Soles For Souls is Courtesy | Sakshi
Sakshi News home page

కర్టసీ షూపుదాం

Published Mon, Aug 11 2014 12:37 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

కర్టసీ షూపుదాం - Sakshi

కర్టసీ షూపుదాం

ఒక ఆలోచన పరిస్థితులను మార్చే ప్రయత్నం చేస్తుంది.. నలుగురు కలసి నడిస్తే.. దారిలో ఒకరి ఇబ్బంది మరొకరిని కదిలిస్తుంది. సామూహిక చైతన్యంగా మారి.. ఇంకొందరికి చేయూతనిస్తుంది. అందరూ కలసి ఒకటిగా అడుగేస్తే.. తడబడు అడుగులు కూడా పరుగెత్తుతాయి. ఇలాంటి ఆలోచనే  హైదరాబాద్ రన్నింగ్ సభ్యులకు వచ్చింది. ఏటా నిర్వహించే మారథాన్ పరుగు పందెంలో షూలు లేకుండా పరుగెత్తుతున్న వారి కోసం.. ఓ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది.
 
 మారథాన్.. ఈ సుదీర్ఘ పరుగుపందెంలో పాల్గొనేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. అందులో ఉన్నవారే కారు.. లేనివారు ఉంటారు. ఈ పందెంలో రంగురంగుల బూట్లతో పరుగెత్తే వారే కాదు.. షూలు లేకుండా పాల్గొనే వారు కూడా క నిపిస్తారు. సామాజిక స్పృహ నింపే వేదికగా ఉన్న మారథాన్‌లో కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలని హైదరాబాద్ రన్నింగ్ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందుకోసమే పాత షూ జోళ్లను సేకరించడం మొదలుపెట్టారు.
 
 యూజ్ అండ్ డొనేట్..
 నగరంలో షూ వాడకం పెరిగిపోయింది. ఎమ్‌ఎన్‌సీల రాకతో కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తోంది. ప్రపంచ పోకడలకు తగ్గట్టు ముస్తాబవుతూ.., ఏటా షూలను మార్చేసే కుర్రకారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. కొత్త బూట్ల రాకతో.., పాతవాటిని బయట పడేయడం ఇష్టం లేక.. ఇంట్లో దాచుకోలేక ఇబ్బంది పడుతుంటారు. వీరికిప్పుడో పరిష్కారం చూపుతోంది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్. ఇంట్లో వృథాగా పడిఉన్న బూట్లను కొన్ని మరమ్మతులు చేసి అవసరమైన వారు వినియోగించే మార్గాన్ని ఏర్పాటు చేసింది.
 
 టార్గెట్ యూత్..
 సామాజిక అనుసంధాన వేదిక ప్రచారంతో పాటు యువత ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తున్నారు హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ సభ్యులు. మూడేళ్లుగా పాత షూలు సేకరిస్తున్నారు. ఈ సారి కూడా కళాశాల విద్యార్థులు, ఆన్‌లైన్ వేదికతో పాటు నగరంలోని షాపర్స్ స్టాప్ సూపర్ మార్కెట్, రిలయన్స్ ఫుట్ ప్రింట్‌లలోనూ ‘పాత షూ సేకరణ’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన బూట్లను మారథాన్‌లో పాల్గొనే బూట్లు లేనివారికి అందించనున్నారు. మిగతా వాటిని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిరుపేద విద్యార్థులకు అందించేలా ప్లాన్ చేశారు.
 
 కాస్త పనికొచ్చినా ఓకే..
  పనికొచ్చే ఏ తరహా షూ జోళ్లనైనా తీసుకుంటాం. మారథాన్‌లో షూ లేకుండా వచ్చేవారికి అందిస్తాం. మిగిలిన వాటిని డాన్‌బాస్కో ఎన్జీవో, వివేకానంద విద్యా వికాస కేంద్రం, ఓం సాయి సేవాశ్రమానికి చేరవేస్తాం. ఇతర నగరాల నుంచి మారథాన్‌లో పాల్గొనేవారు పరుగు ముందురోజు కిట్ పొందే ఎక్స్‌పోలో ఇస్తే సరిపోతుంది.
  - నవీన్, హైదరాబాద్ రన్నర్ సభ్యుడు
 
 విస్తృత ప్రచారం..                 
 యువతరం ఎక్కువగా వచ్చే స్పెన్సర్ రిటైల్ అవుట్‌లెట్స్, రిలయన్స్ ప్రింట్స్‌లలో షూ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. కళాశాలల్లోనూ వీటి సేకరణకు సంబంధించి ప్రచారాన్ని మొదలుపెట్టాం. ఈ సేకరణలో ఐదు విద్యాసంస్థలు భాగస్వామ్యం అయ్యాయి.
 - జయభారతి, హైదరాబాద్ రన్నర్ మెంబర్
 కలెక్షన్ పాయింట్లు ఇవే..
 ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్, సెయింట్ మేరీస్. ముఫకం జా కాలేజి, రూట్ బిజినెస్ స్కూల్,
 ఐసీబీఎం బిజినెస్ స్కూల్
 స్పెన్సర్ రిటైల్ అవుట్‌లెట్స్
 ముషీరాబాద్, గచ్చిబౌలి, అత్తాపూర్,
 కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట
 రిలయన్స్ ఫుట్‌ప్రింట్స్
 సోమాజిగూడ, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, మదీనాగూడ, కార్ఖానా, ఏఎస్‌రావు నగర్
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement