సమ్‌థింగ్ స్పెషల్: పకోడీ
ఉల్లి పకోడీ, గోబీ పకోడీ, పాలక్ పకోడీ వీటినే మార్కెట్ చేస్తే మజా ఏముంటుంది. అందుకే పకోడీలలో వెరైటీలన్నింటినీ వండి వడ్డించాడు. బేబీ కార్న్ పకోడీ, ఎగ్ చెక్ బాల్స్ పకోడీ, బోన్‌లెస్ చికెన్ పకోడీ. ఇలా ఇరవై రకాల పకోడీలు హైదరాబాదీలకు రుచి చూపిస్తున్నాడు.
చల్లని సాయంత్రం.. వాన కురిసే వేళ.. బాల్కనీలో నిల్చుని ఎంజాయ్ చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్‌లో వస్తున్న పాటను హమ్ చేస్తుంటే.. ఎంత హాయి. ఈ వెదర్‌కు కోడి కాని కోడి పకోడీ తోడైతే..! శనగ పిండి.. ఉల్లిపాయలు.. అందులో సన్న మిర్చి వేసి ముద్ద చేసి నూనెలో గోలించిన ఆ వేడి వేడి పకోడీలను వేళ్ల మీద ఆడిస్తూ అలా నోట్లో వేసుకుంటే ఆహా..! ఒకటి కాదు రెండు కాదు.. రకరకాల పకోడీలు రారమ్మని పిలుస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడ పకోడి స్నాక్ కాదు.. ఒక బ్రాండ్. అక్కడికి వెళ్తే ఇరవై రకాల వెరైటీలున్న మెనూ దర్శనమిస్తుంది.
ఈ టేస్టీ ట్వంటీ పకోడీ ఫ్యాక్టరీ కర్త.. కర్మ.. క్రియ.. శ్యామ్ బొల్లిన. వైజాగ్‌కు చెందిన ఈయన హైయర్ స్టడీస్ చదివింది యూఎస్‌లో. యూకేలో ఎంబీఏ చేశాడు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని గట్టిగా ఫిక్సయిన శ్యామ్ ఇండియా ఫ్లైట్ ఎక్కేశాడు. హైదరాబాద్ చేరుకుని తన వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. నలుగురూ వెళ్లే రూట్లో వెళ్తే థ్రిల్లేముంటుందని ఫిక్సయిన శ్యామ్.. ఉలిపికట్టెలా తనకు నచ్చిన రూట్లో వెళ్లాడు. ఎంబీఏ బుర్రకదా.. మార్కెటింగ్ సూత్రాలను ఓసారి రివైజ్ చేసుకున్నాడో ఏమో గానీ.., హైదరాబాద్‌లో అంతగా ప్రాచుర్యం లేని పకోడీల పని పట్టాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవు పకోడీలతో పందెం కోడిగా రంగంలోకి దూకాడు.
వూదాపూర్, కూకట్‌పల్లి, జూబీ్లిహ ల్స్‌లలో స్టాల్స్ ఓపెన్ చేసి డిమాండ్‌కు తగ్గట్టు రుచులు పంచుతున్నాడు. ఇది ఓన్లీ ఫుడ్ స్టాల్ కాదు. ఇక్కడి పకోడీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చేలా డెవలప్ చేస్తున్నాడు. ఓన్లీ హైదరాబాద్‌లోనే కాదు.. తమ పకోడీలను బ్రాండింగ్ చేసి పక్క రాష్ట్రాల్లో కూడా మార్కెటింగ్ చేసే ఆలోచనలో ఉన్నాడు శ్యామ్. సొంతంగా రెసిపిలను ప్లాన్ చేసి.. దినుసులు కూడా సొంతంగా సమకూర్చుకుని పకోడీలు చేయడం వీరి ప్రత్యేకత.