శ్రుతిసారం
జ్యోతిర్మయం
‘అంతా మిథ్య తలంచి చూడ’... లోతుగా పరిశీలించి చూస్తే, ఈ లౌకికమైన జగత్తంతా మిథ్యే. ఇందులో మనం దక్కుతాయని ఆశిస్తున్న ఆనందాలూ మిథ్యే. ఈ భోగాలూ మిథ్యే. ఈ విషయం తెలిసినప్పటికీ నరులు ‘నేనూ నా సంతానం, నా సంసారం, నా సంపద, నా ఇల్లూ వాకిలీ’ అనే మోహంలో కొట్టుమి ట్టాడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారే కానీ, పర మార్థమైన దైవాన్ని ధ్యానింపరు కదా అని ధూర్జటి మహాకవి వాపోయాడు కాళహస్తీశ్వర శతకంలో.
‘తద్యథా ఇహ కర్మచితః లోక క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యచితః లోకః క్షీయతే’ ఈ లోకంలో వ్యవసాయం, వాణిజ్యం సేవ మొదలైన కర్మల వల్ల సంపాదించుకున్న భోగాలు కాలక్రమంలో ఎలా గతించిపోతాయి. అలానే అగ్నిహోత్రాది కర్మల వల్ల సాధించుకున్న స్వర్గాది ఫలాలూ, చేసుకున్న పుణ్యం నశించగానే నశిస్తాయి, కనుక వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నది శ్రుతిమాత. ఈ లోకంలోని ఆనందానుభవం ఎలా అనిత్యమో, పరలోకంలోని స్వర్గాది సౌఖ్యాల ఆనందానుభవమూ అలానే అనిత్యం అన్నది శ్రుతి తాత్పర్యం. ఈ లోకాలు కేవలం అవిచార రమణీయమే.
లలితా పరమేశ్వరి సహస్ర నామాల్లో ‘మిథ్యా జగదధిష్ఠానా’ అన్నది ఒక నామం. ఈ నామానికి విశేషమైన అర్థం ఉన్నది. అమ్మవారు ఈ మిథ్యా జగత్తుకు అధిష్ఠాన స్వరూపం అన్నది ఈ నామ తాత్పర్యం. మసక చీకట్లో తాడు పాములా అనిపిస్తుంది. భ్రాంతి గొల్పుతుంది. అలా ఈ మిథ్యా జగత్తుకు అమ్మవారు అధిష్ఠానం, ఆధారం. వాస్తవమైన తాడు ఉండబట్టి మిథ్య అయిన సర్పం తాత్కాలికంగా ఆభాసిస్తోంది. ఉన్నట్లు అనిపిస్తుంది. భ్రాంతి తొలగితే మిథ్యా సర్పం మటు మాయమై, వాస్తవమైన తాడే మిగులుతుంది. అదే విధంగా అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ జగత్తు, జగత్తులోని సుఖ దుఃఖాలు, జన్మ మృత్యువులూ, సత్యంగా గోచరిస్తాయి. అజ్ఞానం తొలగితే జగత్తు పట్ల సత్యత్వ భావన అదృశ్యమవుతుంది. అధిష్ఠాన మైన అమ్మవారే గోచరిస్తుంది. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్న పారమార్థిక సత్యం సుదృఢం అవుతుంది. అప్పుడంతా అద్వైతమే.
జగత్తు పారమార్థిక సత్యం కాదన్నదే శ్రుతి సారం. లలిత నామ సహస్రం బోధ అదే. ధూర్జటి పల్కుల తాత్పర్యం అదే. ఈ జగత్తుకు సంబంధించిన అసత్వాన్ని తెలుసుకొని, నేను కర్తను భోక్తను కాను అన్న పరమార్థాన్ని గ్రహించి, ఈ వ్యావహారిక జగత్తులో, ఫలాల్ని ఆశించకుండా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిత్యం నిర్వహించాలన్నదే గీతాసారం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ నీకు అధికారం కర్మల్లోనే, ఫలాల్లో కాదు, అన్నది గీతా తాత్పర్యం. గీతా సారాన్ని గ్రహించి, ఉపనిషత్ బోధను స్వీక రించి, నిష్కామ కర్మను చేబట్టి, మన జీవితాన్ని సార్థ కం చేసుకుందాం.
పరమాత్ముని