సుఖదుఃఖాలు
జ్యోతిర్మయం
రాజవుతాడనుకున్న రాముడు నారచీరల్ని కట్టి వనానికి బయలుదేరాడు. ఇంక కొన్నేళ్లు కనిపించడు. అడవుల్లో పడరాని పాట్లు పడతాడు. దుఃఖంలో మొదలు నరికిన చెట్టులా కౌసల్యాదేవి నేల కూలింది. తల్లిని రాముడు లేవనెత్తాడు. ప్రేమగా నిమిరాడు. ఈ పుత్ర ప్రేమ దూరం కాబోతున్నదన్న ఆవేదనలో -
యది పుత్ర న జా యేథా మమ శోకాయ రాఘవ,
న స్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమ్రపజాః
‘ఓ రామా! ఇంతటి దుఃఖాన్ని కలిగించడానికి నీవు పుట్టకపోయినా బాగుండేది. అప్పుడు పిల్లలు లేర న్న ఒక్క దుఃఖమే ఉండేది. ప్రజారంజకుడైన పుత్రుడు, సర్వాన్నీ వీడి అడవులకు పోతున్నాడన్న దుఃఖంతో పోలిస్తే, గొడ్రాలినన్న దుఃఖం అత్యల్పమైందే!’ అని కౌసల్యాదేవి ఆక్రోశించింది.
ఆ క్షణంలో కౌలస్యకు రాముడు అడవులకు వెళ్తు న్నాడని మాత్రమే తెలుసు. భోగాలకు దూరమై అడవుల్లో కష్టాలు పడబోతున్నాడని మాత్రమే తెలుసు. కానీ వన వాస సమయంలో సీతను రావణుడు అపహరిస్తాడని, రామాంజనేయ సంయోగం ఘటింపనున్నదని, రాక్షస సంహారం జరగనున్నదని, లోకాలన్నీ సుఖించ గలవనీ, తెలియదు.
యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే,
తావద్రామాయణ కథా లోకేషు ప్రచురిష్యతి.
భూతలంలో పర్వతాలు, నదులూ ఉన్నంత కా లం, రామాయణ గాథ, కౌసల్యా తనయుడైన శ్రీరామ కథ, లోకంలో వ్యాపించి ఉంటుం దని, ఈ గాథ వేదతుల్యమై పరమ పవిత్రమై పాప వినాశకమై పుణ్య ప్రదాయకమై భాసిల్లకలదని కౌస ల్యకు తెలియదు. రాముడు అడవు లకు వెళ్తున్నాడన్న సమయంలో కౌసల్యకు ప్రాప్తించిన దుఃఖం వెనుక ఇంతటి మహా సుఖం దాగి ఉంది. కనుక కౌసల్య దుఃఖం దుఃఖం కానే కాదు. కేవలం దుఃఖ ఆభాసయే! దుఃఖం కాకపోయినా దుఃఖంలా తాత్కాలికంగా పరితపింపచేసేదే!
అలాగే సీతను అపహరించినప్పుడు, మార్గమధ్యం లో అడ్డుకున్న జటాయువు రెక్కల్ని విరిచి నేలకూల్చి నప్పుడు, సీతను తెచ్చి అశోకవనంలో ఉంచినప్పుడు, రావణుడు విజేతనయినానన్న మహా సుఖానుభూతిని పొందాడు. కానీ ఈ సుఖానుభూతి నీడలో, తన మర ణం అన్న మహాదుఃఖం దాగి ఉన్నదని, ఆనాడు రావణు నకు తెలియదు. కనుక ఆ నాటి రావణుని సుఖం సుఖం కానేకాదు. కేవలం సుఖాభాసయే. సుఖం కాక పోయినా తాత్కాలికంగా ఆనందింప చేసేదే!
తరతరాలుగా రామాయణ గాథను నరనరాల్లో జీర్ణించుకున్న మనం, సుఖాలకు పొంగి పరవశింప గూడదనీ, దుఃఖాలకు తల్లడిల్లి నిర్వేదాన్ని పొందకూ డదనీ, తెలుసుకోవాలి. దుఃఖాలన్నీ నిజమైన దుఃఖాలు కావు, సుఖాలన్నీ నిజమైన సుఖాలు కావు, అన్న స్పృహ కలిగి ఉండాలి. కష్టాల్లో దిగులు చెందని వాడు, సుఖాల్లో పరవశింపని వాడు, రాగమూ భయమూ క్రోధమూ లేనివాడే ధీరుడనీ, ముని అనీ, అందుకే భగ వద్గీత అన్నది. కనుక రామాయణాన్ని పఠిద్దాం, గీతను అధ్యయనం చేద్దాం, ధీరులమై నిలుద్దాం.
పరమాత్ముని