దక్షిణాదిన అంతటి నటి ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన 'క్వీన్' సినిమా రీమేక్ హక్కులను తమిళ హీరో ప్రశాంత్ తండ్రి, నటుడు, దర్శకుడు, నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. హిందీలో వికాస్ భల్ దర్శకత్వం కంగనా రనౌత్ అద్భుతంగా నటించారు. ఓ నటికి సవాల్ లాంటి పాత్ర ఇది. ఇందులో కంగనా రనౌత్ విజృంభించి నటించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. దీని రీమేక్ హక్కులకు పెద్ద పోటీ ఏర్పడింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో త్యాగరాజన్ దీని హక్కులు చేజిక్కించుకున్నారు. కథాపరంగా దక్షిణాదికి అనుగుణంగా కొన్ని మార్పులుచేర్పులు చేసి నిర్మించడానికి ఆయన సిద్దమయ్యారు. అయితే ఇందులో క్వీన్ పాత్రదారిని ఎంపికచేయడం ప్రధానం. ప్రస్తుతం త్యాగరాజన్ ఆ వేటలోనే ఉన్నారు. ఆయన మనసులో ఉన్న హీరోయిన్లను సంప్రదించే పనిలో పడ్డారు.
నాలుగు భాషల్లో హీరోలు మారతారు. హీరోయిన్ మాత్రం ఒక్కరే ఉంటారు. అందువల్ల ఆ పాత్రకి తగిన, అన్ని భాషలవారికి నచ్చే హీరోయిన్ను ఎంపిక చేయవలసి ఉంది. ఈ పాత్ర కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, కొంతమంది హీరోయిన్లు ఈ పాత్ర చేయడానికి ఇష్టపడుతుంటే, మరి కొందరు భయపడుతున్నారు. కంగనా రనౌత్ అంతటి స్థాయిలో ఆ చిత్రంలో నటించి మెప్పించారు. కొందరు హీరోయిన్లకు నటించాలన్న ఆసక్తి ఉన్నా, వారికి సమయం చిక్కడంలేదు. దాంతో కొంత సమయం అడుగుతున్నారు. మరికొందరు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు రీమేక్ అని ధైర్యం చేయలేకపోతున్నారు.
క్వీన్ పాత్ర కోసం మలయాళీ ముద్దుగుమ్మ అసిన్ని నిర్మాత సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టిన అసిన్, ఈ చిత్రంలో నటించడం తన వల్ల కాదని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. బాలీవుడ్ క్వీన్గా నటించిన కంగనా రనౌత్ మాదిరి దక్షిణాదిలో కూడా నటించడం అంటే కుదరని పని. అలా నటించకపోతే ప్రేక్షకులకు నచ్చదు. అదే పాత్రను కొత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే క్వీన్లో నటించలేనని అసిన్ త్యాగరాజన్కు సారీ చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం. బాలీవుడ్లో అరకొర అవకాశాలతో సర్ధుకుంటున్న అసిన్, దక్షిణాది 'క్వీన్' వంటి సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరచకపోవడంపై పలువురు సినీ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత ఈ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలలో నిజంలేదని సమంత స్పష్టం చేశారు. ఈ చిత్రం కథలో మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుందని, ఆ విషయంలో దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పడం సాధ్యం కాదని, అందువల్ల ఆ 'యువరాణి'ని తాను కాదని సమంత తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
కంగనా స్థాయిలో దక్షిణాదిన నటించగల సత్తా త్రిషకు ఉందని పలువురు భావిస్తున్నారు. త్యాగరాజన్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ పాత్రకు త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పాత్రకి ఇంకా నయనతార, అనుష్క, కాజల్ - తమన్నా- కలర్స్ స్వాతి, తాప్సీ, నిత్యామీనన్... పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించనని త్యాగరాజన్ చెప్పారు. అయితే మరో దర్శకుని పేరుని మాత్రం ఆయన ఇంకా ప్రకటించలేదు.
-ఎస్ఎన్ఆర్