కూనిరాగమొచ్చినా.. కరా ఓకే!
మీరు బాత్రూమ్ సింగర్లా..? మీ పాటకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడుంటే బాగుంటుందనుకుంటున్నారా..? మ్యూజిక్ జోడించి మీ గాత్రాన్ని నలుగురికీ వినిపించాలనుకుంటున్నారా..? అయితే, ఓకే...! ఇంకెందుకాలస్యం ‘చలో కరావోకే..’ హైదరాబాద్ పబ్బులు, క్లబ్బుల్లో ఇప్పుడు ‘కరావోకే’ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. పాట పాతదైనా, కొత్తదైనా... ఏ భాషలోనిదైనా... రియల్ ఓకల్ వెర్షన్‌ను తొలగించి, మ్యూజిక్‌కు మన వాయిస్‌ను చేర్చడమే కరావోకే ప్రత్యేకత. అలా పాడిన పాటను రికార్డు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కరావోకే కొన్నేళ్ల కిందటే మొదలైనా, నిన్న మొన్నటి వరకు స్టేజ్ షోలకే పరిమితమైంది. ఇప్పుడిది పబ్బులు, క్లబ్బులు, పార్టీలు, ఫంక్షన్లకు సైతం విస్తరించింది.
- సుమన్‌రెడ్డి
ఒక్కసారి కరావోకే కిక్‌కు అలవాటు పడితే, ఎవరూ దాన్ని వదులుకోరు. అందుకే రెగ్యులర్‌గా కరావోకే నైట్స్‌కు అటెండయ్యే యూత్ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పబ్బులు, క్లబ్బుల్లో లైవ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా, పాడటం మ్యూజిక్ లవర్స్‌కు జోష్ ఇస్తోంది. టాలెంట్ ఉంటే, పబ్బుల్లో పాడటం ద్వారా అక్కడకు వచ్చే ప్రముఖుల కళ్లలో పడి సినిమాలు, ఆల్బమ్స్‌లో పాడే చాన్స్ కొట్టేయవచ్చు.
కేజేలకు జేజే...
కరావోకేల జోరు పెరగడంతో కరావోకే జాకీలు (కేజీలు) పుట్టుకొచ్చారు. మ్యూజిక్ ప్లే చేయడం వరకే డిస్క్‌జాకీల (డీజే) బాధ్యత. అయితే, పాడేవారి మూడ్స్ పసిగట్టి, వారి గాత్రాన్ని మ్యూజిక్‌తో సమన్వయపరచి, అవసరమైతే పాట సాహిత్యాన్ని సైతం అందించి, వారి ఆసక్తిని రెట్టింపు చేసే వినూత్నమైన బాధ్యతను కేజేలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. నగరంలోని పబ్‌లన్నీ ఏదో ఒకరోజు కరావోకే నైట్స్ నిర్వహిస్తున్నాయి.
పోటీలు కూడా...
పలు పబ్‌లు ఏటా కరావోకే ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నాయి. గెలిచినవారికి బహుమతులు అందిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సింగర్ ఫిన్లాండ్‌లో జరిగిన కరావోకే పోటీల్లో ప్రథమ వరుసలో నిలిచింది కూడా.
గాత్రం కోసం...
పాడాలనే తపన ఉన్న వారి కోసమే కరావోకే కార్యక్రమాలు నడుస్తున్నాయని కేజే ఆనంద్ ప్రేమ్‌సాగర్ చెబుతున్నారు. హైదరాబాద్ పబ్‌లకు కరావోకేను పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే.
స్పెషల్ అట్రాక్షన్
‘సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం అమెరికాలో ఉన్నప్పుడు తరచు పబ్‌లకు వెళ్లే వాడిని. షికాగో పబ్‌లలో వింటర్‌లో నిర్వహించే కరావోకే నైట్స్ నన్ను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ పబ్‌లలోనూ ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌ను అందుబాటులోకి తేవాలని ఆలోచించా. జాబ్ వదిలేసి హైదరాబాద్ పబ్‌లలో కరావోకే స్పెషల్స్ ప్రారంభించా. మొదట మనవాళ్లకు కొత్తగా అనిపించినా, తొందరగానే దీనికి బాగా అటాచ్ అయ్యారు. ఇప్పుడు అన్ని పబ్‌లలోనూ కరావోకే స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
- కేజే ఆనంద్
అప్లాజ్‌తో క్రేజ్
ఇంగ్లీషు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడూ హమ్ చేసేవాడిని. కానీ, పూర్తి స్థాయిలో పాడేందుకు ధైర్యం చాల్లేదు. మూడేళ్ల కిందట టెన్ డౌనింగ్ స్ట్రీట్ పబ్‌లో ఆనంద్ ప్లే చేస్తున్నప్పుడు అటెండై ఫస్ట్‌టైమ్ కరావోకేలో పాడాను. మంచి అప్లాజ్ వచ్చింది. అప్పటి నుంచి కరావోకే నైట్స్‌కు రెగ్యులర్ అయ్యాను.
- వేణు