
నాకూ ప్రేమకథ ఉంది!
అర్జున్.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో చురుకైన స్టూడెంట్. రూపాలీ.. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమించే యువతి. వీరిద్దరూ ప్రేమలో పడతారు. వారి కథే ‘యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ నౌ’. దీని రచయిత రవీందర్‌సింగ్. ఇటీవల సిటీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణకు వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే..
- వాంకె శ్రీనివాస్
హైదరాబాద్‌లోనే ఎంబీఏ..
నేను పుట్టింది కోల్‌కతా. పెరిగింది ఒడిశాలోని బుర్లా. కర్ణాటకలోని బీదర్‌లో ఇంజనీరింగ్ చదివా. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ నుంచి ఎంబీఏ చేశా. పుణేలోని ఓ ఐటీ కంపెనీలో నా జాబ్ కెరీర్‌ను మొదలెట్టా. అప్పుడే మాట్రిమోనియల్ వెబ్‌సైట్ షాదీ.కామ్ ద్వారా ‘ఖుషీ’తో పరిచయం ప్రేమగా మారింది. 2007, ఫిబ్రవరి 9న చివరి రోజు ఉద్యోగం చేసిన ఆమె ఇంటికి బయలుదేరిన క్యాబ్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫిబ్రవరి 14న మా ఎంగేజ్‌మెంట్. ఆ టైంలో ఇలా జరగడం నన్ను కోలుకోనివ్వలేదు. భువనేశ్వర్‌లో ఫ్రెండ్‌తో కలిసి ఉన్న సమయంలో ఓ పుస్తకం చదువుతుండగా...నాకూ బుక్ రాయాలనిపించింది. ఫ్రెండ్‌తో చెప్పా. అలా నా తొలి పుస్తకం ‘ఐ టూ హడ్ ఏ లవ్‌స్టోరీ’ సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత...
కెన్ లవ్ హాపెన్ టై్వస్, లైక్ ఇట్ హంపెండ్ యెస్టర్‌డే పుస్తకాలు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇదే కోవలో...కాస్త విభిన్నంగా ‘యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ నౌ’ పుస్తకాన్ని తీసుకొచ్చా. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ రాజకీయాలను వివరిస్తూనే.. ఓ యువకుడు, యువతి మధ్య సాగిన ప్రేమాయణాన్ని కథాంశంగా ఎంచుకొని ముందుకెళ్లా. అర్జున్, రూపాలీ పేర్లను కామన్‌గా ఎంచుకున్నా. ఫేస్‌బుక్‌లో చివరి ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరి పేర్లను ఈ కథకు ఎన్నుకున్నా. దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉద్యమమే నన్ను ఈ కథవైపు మళ్లించింది. నా తొలి మూడు పుస్తకాల మాదిరే ఈ బుక్‌కీ ఆదరణ లభిస్తుందనుకుంటున్నా.
సిటీ బ్యాక్‌డ్రాప్‌తో త్వరలో పుస్తకం
హైదరాబాద్‌లో నా కథలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సిటీతో నాకు మంచి అనుబంధం ఉంది. భవిష్యత్‌లో సిటీని వేదికగా చేసుకొని పుస్తకం తీసుకొస్తాను. ఉద్యోగం చేస్తూనే పుస్తకాలు రాసేంత తీరిక ఎలా దొరుకుతుందని చాలామంది నన్నడుగుతుంటారు.
మహిళలు ఉద్యోగాలు చేస్తూనే ఇంటికెళ్లి పిల్లలు, కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని రచనకు సమయం వెచ్చిస్తున్నా. అయితే నా తొలి పుస్తకం ‘ఐ టూ హాడ్ ఏ లవ్‌స్టోరీ’ రాస్తున్నప్పుడు ఏడ్చిన సందర్భాలున్నాయి. ఆ కథ ఎన్నో లక్షల మంది హృదయాలను తాకింది. రాజకీయాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. వీలు చిక్కితే క్రికెట్ ఆడుతుంటా. సినిమాలూ చూస్తుంటా.