తిరుమల కొండలలో 108  తీర్థప్రవాహాలు | 108 Pilgrimage in Thirumala Hills | Sakshi
Sakshi News home page

తిరుమల కొండలలో 108  తీర్థప్రవాహాలు

Published Sun, Sep 29 2019 4:28 AM | Last Updated on Sun, Sep 29 2019 9:08 AM

108 Pilgrimage in Thirumala Hills - Sakshi

దేవదేవుడు కొలువైన తిరుమల కొండలు ముక్కోటి తీర్థాలకు నిలయాలు. శేషాచల కొండలలో దాదాపు 108 పుణ్యతీర్థాలు ఉన్నట్లు పురాణాల కథనం. ఈ108 తీర్థాలలోని పవిత్రజలాలు అన్నీ అంతర్గతంగా శ్రీవారి పుష్కరిణి తీరంలో కలుస్తాయి. అందుచేతనే శ్రీవారి పుష్కరిణి స్నానం సకల పాపహరణం అంటారు. అయితే భక్తులకు సా«ధారణంగా శేషాచల ఏడుకొండలలోని ముఖ్యతీర్థాలు మాత్రమే తెలుసు. కానీ సాక్షాత్తూ స్వామివారి గర్భాలయం భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ పవిత్రజలాలు నేరుగా శ్రీవేంకటేశ్వరుని పాదాలను నిత్యం స్పృశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రత్యేకతలున్న ఈ పవిత్ర తీర్థాల గురించి ప్రత్యేక కథనం. 

సాక్షాత్తూ స్వామివారి పాదాల కింద ప్రవాహించేది విరాజానది. ఆలయంలో సంపంగి ప్రాకారంలో ఉత్తరం వైపు ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరాజానది అంటారు. ఆలయంలోని ఈ దేవనది స్వామిపాదాల కింద నుంచి నేరుగా ప్రవహిస్తుందంటారు. ఇదేవిధంగా మరో బావి కూడా ఆలయంలోనే వుంది. ఈ బావిని చతురస్రాకారంలో చెక్కిన రాళ్లతో నిర్మించారు. దీనిపై అలనాటి అద్భుతమైన శిల్పకళా సంపదను చూడవచ్చు. రాతిరాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి వున్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయ మర్దనంలో శ్రీకృష్ణుని వేడుకొంటున్న నాగకన్యలు, ఏనుగును ఆజ్ఞాపిస్తున్న వేంకటేశ్వరుడు, గరుత్మంతుడి శిల్పాలు కనిపిస్తాయి. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మల బావిగా పిలుస్తుంటారు. 

స్వామి నిర్మాల్యం పూలబావికే పరిమితం
అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూల బావి ఉంది.స్వామివారికి సమర్పించిన తులసీ పుష్పమాలలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం మొదటి నుంచి లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు.

అభిషేక సేవకు బంగారుబావి నీళ్లు
వకుళమాత కొలువైన పోటు పక్కనే బంగారుబావి ఉంది. స్వామివారి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చే భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని పవిత్రజలాలనే వాడుతారు. బంగారుబావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో ఒరలాంటి రక్షణ నిర్మించారు. దీనికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీ తీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి  వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

పుణ్యఫలం కటాహతీర్థ పానం
శ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహతీర్థ పానం– ఈ మూడూ త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహతీర్థం శ్రీవారి హుండీకి వెలుపల అనుకుని తొట్టి మాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీనిని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామివారి పాదాల నుంచి వచ్చే అభిషేక తీర్థమిది, ఈ తీర్థ్దాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరీ మంత్రం లేదా కేశావాది నామాలు లేదా శ్రీవేంకటేశ్వరుని గోవింద నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఈ తీర్థ్దాన్ని స్వీకరించడం వలన జన్మజన్మల కర్మఫలాలు తొలగిపోతాయని, ఒక్క చుక్క స్వీకరించినంతనే మహాపాతకం, అవిద్య, అజ్ఞానం నశించిపోయి భూమ్మీదవున్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

మోక్ష ప్రాప్తి కలిగించే పుష్కరిణి స్నానం శ్రీవారి పుష్కరిణి స్నానం సకల పాపహరణం అంటారు. బ్రహ్మాండంలోని సరస్వతి తీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాద్రితో పాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠక్షేత్రానికి తీసుకొచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని దర్శించడం, పుష్కరిణి తీర్థాన్ని సేవించడం, ఇందులో పుణ్యస్నానాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖశాంతులతో పాటు పరలోకంలో మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తిరుమల కొండలలో నెలవైన వందలాది పుణ్యతీర్థాల పవిత్రజలాలన్నీ ఇందులో ప్రవహిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలలో అడుగడుగునా వింతలే. స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఆయన సన్నిధిలోని అణువణువునూ సందర్శించాల్సిందే.

పుష్కరిణిలో ప్రాచుర్యంలో తొమ్మిది తీర్థాలు
ముక్కోటి తీర్థ సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి మార్కండేయ తీర్థం (తూర్పుభాగం), ఆగ్నేయతీర్థం(ఆగ్నేయభాగం), యమతీర్థం(దక్షిణ భాగం), విశిష్టతీర్థం (ౖ¯ð రుతి) వరుణతీర్థం(పడమర) వాయుతీర్థం (వాయవ్య భాగం), ధనదతీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం(ఈశాన్యం) సరస్వతి తీర్థం(మధ్యభాగం). దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట. ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగరుగ్మతలను పోగొట్టుకుని, భోగభాగ్యాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement